రామశర్మ తెలివి:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.

  ఒక రాజుకు సంతానం లేదు. అతడు ఎన్నో నోములు ,వ్రతాలు చేశాడు .ఆ నోముల,వ్రతాల పుణ్యం వలన అతని భార్య గర్భం దాల్చింది.
       రాజుకు తనకు మగ సంతామో, ఆడ సంతానమో తెలుసుకోవాలనే కోరిక కలిగి జ్యోతిష్కులను పిలిపించాడు .వారు కొంత మంది మగ పిల్లవాడు అని, మరికొందరు ఆడపిల్ల అని చెప్పారు .రాజుకు కోపం వచ్చింది. "శాస్త్రాన్ని తెలిసిన మీరు ఖచ్చితంగా చెప్పకపోవడం ఏమిటి ?నాకు సరిగా ఉన్నదున్నట్టు చెప్పండి .మీరు చెప్పింది నిజమైతే మీకు సన్మానం. లేకుంటే మీకు కఠిన శిక్ష విధిస్తాను" అని హుకుం జారీ చేశాడు. ఆ మాటలు విని జ్యోతిష్కులు అందరూ తలలు  వంచుకున్నారు .
      అప్పుడు రామశర్మ అనే జ్యోతిష్కుడు వచ్చి తాను నిజం చెబుతానని తన జ్యోతిష్యం అబద్దం అయితే తాను ఏ శిక్ష విధించినా  సిద్ధమని  చెప్పాడు .అందుకు రాజు సంతోషించి ,అతనిని ఆహ్వానించాడు.రామ శర్మ రాజుతో "నేను మీకు ఎవరు జన్మిస్తారో నోటితో చెప్పను. ఒక కాగితం చిట్టీ పైన వ్రాసి ఇస్తాను. కానీ ఒక షరతు.  ఆ కాగితపు చిట్టీని మీరు రాణి ప్రసవం అయిన తర్వాతనే విప్పాలి .అంతవరకు దానిని తెరవకూడదు "అని అన్నాడు .అందుకు రాజు సమ్మతించాడు.
       చివరకు రాణి మగబిడ్డను ప్రసవించింది. రాజు రామశర్మ వ్రాసి ఇచ్చిన కాగితపు చిట్టీని తెరచి చూశాడు. అందులో ఇలా ఉంది  "మీకు ఆడ బిడ్డ కాదు మగ బిడ్డ "అని రాసి ఉంది .రామ శర్మ జ్యోతిష్యం నిజమైంది. వెంటనే రాజు అతనిని పిలిపించి ఘనంగా సన్మానించాడు.
        తోటి జ్యోతిష్కులు రామశర్మను రహస్యంగా  కలిసి "ఒకవేళ ఆడబిడ్డ జన్మిస్తే నీకు శిక్ష కఠినంగా పడేది గదా" అని అన్నారు. అప్పుడు రామ శర్మ" ఇటువంటి మూర్ఖుడైన రాజుకు బుద్ధి చెప్పాలని నేను ఆ విధంగా వ్రాశాను .ఆడపిల్ల పుడితే ఆడబిడ్డ తర్వాత పుల్ స్టాప్ మరచినానని  చెప్పే వాడిని. అందువల్ల "మీకు ఆడబిడ్డ.  కాదు మగ బిడ్డ" అని ఆ చిట్టీలో ఉండేది .తర్వాత "మీకు ఆడ బిడ్డ . మగ బిడ్డ కాదు "అని విడమరచి చెప్పేవాడిని. ఇప్పుడు ఆ అవసరం రాలేదు .అందువలన బ్రతికి పోయాను. ఇంతకన్నా నాకు గత్యంతరం లేదు. జ్యోతిష్య శాస్త్రం మీద విశ్వాసం పెంచాలనే నేను ఈ పని చేశాను "అని అన్నాడు రామశర్మ . 
        రామశర్మ తెలివితేటలకు మిగతా జ్యోతిష్కులు ఎంతో సంతోషించారు.