శ్రీ రామ స్తుతి:-కవిచక్రవర్తి డాక్టర్ అడిగొప్పుల సదయ్యమహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరంఅధ్యక్షులు-9963991125
01.
నీదు రూపు చూడ నిఖలసౌందర్యమ్ము
నీదు నామజపము నిక్షురసము
నీదు కనుల గురియు నెనరుశ్రీ మధురమ్ము
రమ్య సుగుణ సాంద్ర! రామచంద్ర!!

(ఇక్షు=చెరకు,నెనరు=కరుణ,మధురము=తీపి)

02.
నీదు చరితమంత నీదులాటయెగద!
కష్ట కడలి నడుమ కటిక యిరుల
రిక్తమందు బతుకు రిక్త తిక్తమె కదా!
రమ్య సుగుణ సాంద్ర! రామ చంద్ర!!

(ఇరులు=చీకటి,రిక్తము=అడవి,వ్యర్థము,తిక్తము=చేదు)

03.
సీత జాడ వెతుక జేసుకొంటివి నేర్పు
కోతి మూక తోడ ప్రీతి జేసి
చింతలోని పులుపు చివరిదాకుండగా!
రమ్య సుగుణసాంద్ర! రామచంద్ర!!

(మూక =గుంపు,ప్రీతి=స్నేహము,చింత=బాధ,ఆలోచన)

04.
రావణుణ్ణి జంపి రామ సీతను కాచ
బయలుదేరితీవు బలము లంక
ఉప్పు నీటి మీద రప్ప వారధికట్టి
రమ్య సుగుణసాంద్ర! రామచంద్ర!!

(రామ=పడతి,కాచు=కాపాడు,బలము=సైన్యము,రప్ప=రాయి)

05.
వగరు పొగరులణచి వధియించితివినీవు
రావణాప్తగణము రణమునందు
నిఖిల లంక గూల్చి నిప్పుగుండముజేసి!
రమ్య సుగుణసాంద్ర! రామచంద్ర!!

(ఆప్తగణము= విశ్వాసపాత్రులు)


06.
కటువు బటువు దోడ కఠినాత్మ దనుజుడు
రావణుండు దురము రయము జేరె
శిరములడచి వాణ్ణి శరముల ద్రుంచితి
రమ్య సుగుణసాంద్ర! రామచంద్ర!!

(కటువు=కోపము,కారము;పటువు=తెగువ,చతురత;దురము=యుద్ధము,అడచి=తొలగించి,త్రుంచితి=చంపితివి)