ఒక తోటలో గులాబీ చెట్లకు పూలు బాగా విరబూసి కాసాయి. ఆ చెట్ల దగ్గరే ఒక పొద్దు తిరుగుడు పూల చెట్టు మొలచి పూలు కాసింది . ఒక రోజు పొద్దు తిరుగుడు పువ్వు గులాబీ పువ్వుతో ‘నీ అందం ,ని రంగు ఎవ్వరికీ రావు . ఎన్ని రకాల పూలు ఉన్నా నిన్ను మెచ్చని ,నచ్చని వారుండరు . నిన్ను బొకెలు తయారీలో వాడుతారు . ప్రేమికులు ఒకరికోకరో ఇచ్చి పుచ్చుకుంటారు . నీతో సువాసన వదచల్లు సెంట్లు ,ఆగరొత్తులు , ,సబ్బులు తయారు చేస్తారు . ఒకప్పుడు మన భారత ప్రధాని నెహ్రూజీ తన కోటుకు పెట్టుకునే వారు,అంటే ఈ సొగసే నిన్ను ఇంత దాన్ని చేసింది . ’ అంది ఆ మాటలు విన్న గులాబీ పువ్వు గర్వంతో పొంగిపోయింది . ‘నా సొగసు ఇంత గొప్పగావున్నా ఈ చెట్టుకు అంటి పెట్టుకుని ఉన్నా ఎప్పుడొకప్పుడు నేల రాలాల్సిందే , దాని కోసం నా సొగసు వాడిపోకుండా వుండాలంటే నాకు ఎండ తగలకూడదు. ’ అని సూర్యదేవుని ప్రార్థించింది . ప్రార్థనకు ప్రత్యక్షమైన సూర్యభగవానుడుని ‘గులాబీ తనకు ఎండతగల కుండా చేయమని ’ వేడుకుంది . సూర్య భగవానుడు “తథాస్తు “అని మాయమై పోయాడు . తన మొర ఆలకించి నందులకు గులాబీ పువ్వు నీడపట్టున హాయిగా వున్నాను అనుకుంది .కానీ రెండురోజులు గడిచాక గులాబీకి నీరసం వచ్చి చెట్టు వాడు ముఖం పట్టడం మొదలైంది. మరో రెండు రోజులకు చెట్టు కొమ్మలు సన్నగా అయిపోవడం మొదలు పెట్టాయి . ఇదంతా గమనించిన పొద్దుతిరుగుడు పువ్వు గులాబీ పువ్వుతో ‘ నీవు నీ సొగసు వాడిపోగూడదని సూర్య దేవుని కోరి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు . సూర్య భగవానుడు సకల జీవులకు అన్నీ విధాలా రక్షించే దేవుడు . సూర్య రశ్మి వల్ల చెట్ల ఆకుల్లో ఆహారం తయారు అవుతుంది . అది శక్తినిచ్చి పూలు కాయలు కొత్త చిగుర్లు తొడగడానికి తోడ్పడుతుంది . మనం ఎంత అందంగా వున్నాము అని , ఎంత కాలం జీవించాము అన్నది కాదు . ఎంత మందికి ఎంత ప్రేమను , ఎంతసహాయం చేశామన్నది ముఖ్యం ‘అని చెప్పింది .
గులాబీ పువ్వు ఆలోచించి తాను చేసిన తప్పు తెలుసుకుని సూర్య దేవుని ప్రార్థించింది . పువ్వు మొర అలకించిన సూర్య దేవుడు ప్రత్యక్షమైనాడు గులాబీ పువ్వు తాను చేసిన తప్పును దేవునికి చెప్పి బతికించమని బతిమాలింది .సూర్య దేవుడు కరుణిoచి .గులాబీ మొక్కపై ఎండ పడేటట్లు చేశాడు .గులాబీ మునపటి లాగే తయారు అయ్యింది .సూర్య దేవునికి కృతజ్ఞతలు గులాబీ తెలిపింది . అందుకు సూర్యదేవుడు ‘ నా వల్లే సకల జీవరాసులు ఈ భూమి మీద బతుకు తున్నాయి . నాతో పాటు గాలి, నీరు , ఆకాశం ,నిప్పు ,భూమి అనే పంచ భూతాలు తమ వంతు కర్తవ్యాన్ని భాద్యతను క్రమం తప్పకుండా పాటిస్తు న్నాయి . అందుకే ఎవ్వరూ గొప్ప అని పొంగి పోకూడదు ,క్రుంగి పోకూడదు . తమ వంతు భాద్యతని నిర్వహించాలి “ అని చెప్పి అంతర్థానమయ్యాడు . .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి