తల రాత:-- కంచనపల్లి ద్వారకనాథ్, చరవాణి: 9985295605

     యక్ష వనం అనే  అడవిలో ఎన్నో  జంతువులు ,పక్షులు   ఏదేచ్చగా ఎలాంటి కొరత లేకుండా జీవిస్తూoడేవి .  ఏపుగా పెరిగిన గడ్డి , మొక్కలు   తింటూ జీవిస్తున్న జింకలగుంపు లో ఓ జింక  ఆలోచన చేసింది .తనలోతాను  “నేను ఈ గడ్డి ఆకులు , అలుములు తింటూ బతుకుతున్నా ఏ సింహామో  , పులో వచ్చి మీదపడి చీల్చి తింటుందో అన్నభయం బతుకుబతకడం లో ఏమి సుఖం  ఉన్నది .దీనికి పరిష్కార మార్గం  ఒక్కటే . దేవుని    ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని వరం పొందవలసిందే” అనుకుని దేవుని రోజు ప్రార్థించగా ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై  “ నీ ప్రార్థనకు మెచ్చితిని . ఏమి వరం కావాలో కొరుకో”అన్నాడు . “ వెంటనే జింక సంతోషంతో “ స్వామి నేను రోజు నా తిండి నేను తిని బతుకుతున్నా ఏ క్షణాన ఏ   పులో ,సింహామో , తోడేలో వచ్చి మీదపడి తినేస్తుందో  భయం పట్టుకుంది . అందు కోసం   నా  ముఖాన్ని మార్చి సింహం ముఖం గా మార్చి వేయండి    అనగానే . ‘ దేవుడు  “  తాథాస్తు”  అనగానే జింకకు సింహం తలకాయ    వచ్చేసింది .  దేవుడికి  జింక  ధన్యవాదాలు తెలిపింది . దేవుడు మాయమైపోగానే  జింక సంతోషం తో అడవిలోకి పరిగెత్తింది జింకశరీరంతో సింహం ముఖంతో  గంతులేస్తు   పరుగులెత్తింది.  అడవిలోని జంతువులు ఇదేదో కొత్త జంతువు వచ్చిందని  భయపడి,  అడవికి  రాజైన సింహంతో సహా   తలా ఓ దిక్కున   పరుగులుతీసాయి. జింక తననుచూసి భయపడి పారిపోవడం తో  గర్వంగా అడవి అంతా గంతులేస్తూ పరుగెత్తె సరికి  అలసి  ఆకలేసింది  . ఆహారం తిందామని జింక చెట్ల  పొదల్లోకి పోయి మూతి పెట్టగా     సింహముఖానికి గడ్డి,ఆకులు  సహించక   దిగులుపడిoది పోనీ ..  మాంసం తిందామంటే   కాళ్ళకు    పంజాలులేవు జంతువులను వేటాడే శక్తి లేదు .పోనీ  నీళ్ళుఅయినా తాగుదామని వాగు దగ్గరికి వెళ్ళి మూతి పెట్టగానే తన సింహం ముఖం కనపడి భయంతో నీళ్ళు తాగలేక జింక   నీరస పడిపోయి లాభం లేదని మళ్ళీ  దేవుని ప్రార్థించింది . మళ్ళీ దేవుడు   ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు .” స్వామి పొరపాటున ఈ    వరం కోరి మాంసము తినలేక , గడ్డి తినలేక  ఆకలితో అలమటి స్తున్నాను .  తక్షణమే నా ముఖాన్ని  మార్చి  గొరిల్లా ముఖం  ప్రసాధించండి .”   అనగానే “తాథాస్తు “ అని మాయమై పోయాడు  . సంతోషం తో ఒక్క నిట్టూర్పు విడిచి “  అక్కడే వున్న  పళ్ళచెట్టు  దగ్గరికి వెళ్ళి చెట్టు  పైన వున్న కోతుల్ని “ మిత్రులారా నాకు ఆకలిగా వున్నది . కొన్ని పళ్ళు కోసి కిందకి    పడేయండి” అంది చెట్టు పై నుoడి కోతులు చూసి ఇదేదో విచిత్ర కోతి  మన అడవిలో ప్రవేశించింది అంటూ దానిపై దాడికి దిగి  దాని శరీరమ౦తా గాయాలు  చేయడంతో  చావు తప్పి కన్ను లొట్టపోవడం తో తన పిక్కబలంతో పెరిగెత్తి పారిపోయింది .తన్ను తాను   రక్షిoచుకోవడం జంతువులనుoడి  రక్షణ కోసం ఎలాగైనా ఈ సారి బాగా ఆలోచించి  అడవిదున్న ముఖం అయితే  శత్రువుల్ని కుమ్మవచ్చు  ఏ  గెడ్డో,ఆకులో  తిని ఆకలి తీర్చుకోవచ్చు అనుకుని   దేవుడిని కోరో కోవాలని  మళ్ళీ  దేవుడిని ప్రార్థిoచింది. దేవుడు  ప్రత్యక్షమై ఈ సారి  “ఏం వరం కావాలో కోరుకో “అన్నాడు .  చేతులెత్తి నమస్కరించి”స్వామి నా కోరిక  సరైనదిగా లేనట్లు వున్నది.  అందుకే నాకు ఆపదలు వస్తున్నాయి  అందుకే  ఈ సారి బాగా  ఆలోచించి కోరుకుంటున్నాను . ఈ తలను మార్చి  అడవి  దున్న   ముఖం  ప్రసాదించండి”  అనగానే  “  తాథాస్తు “   అని దేవుడు  మాయమైనాడు . .” ఆహా ( నా కోరిక ఫలించింది  విజృంభిస్తా” అంటూ అడవిలో తిరుగుతూ   గడ్డి ,  చెట్ల ఆకులు  తలవంచుకుని మేస్తూ   పొదల్లోకి పోయింది  .  పక్కనే పొంచి వున్న పులి దాని  ముఖాన్ని చూసి మంచి అడవి  దున్న దొరికింది  దీని పని  పట్టవలసిందే “ అనుకుని దానిపై దాడికి   సిద్దమై దాని  వెనుకగా వచ్చి నక్కి చూడగానే ఇదేదో విచిత్ర మైన జంతువు అని భావించి  భయపడి పులి పరుగు   తీయడంలో  అలికిడి      విన్న జింక అటువైపుచూసి బెదిరి జింక ముఖం  దున్నదైనా వెనుక జింక  శరీరం. దాని బెదురు బుద్ది అన్నీ కలిసి ఒక్క సారిగా  పరుగు  లంకించింది .   జింక  ప్రాణాలు అరచేత పట్టుకుని “ బతుకు జీవుడా ఏమి నా కర్మ ఇలా బతక వలసినదేనా ?  ఇదివరకు నా తోటి జింకలతో హాయిగా కలిసివుండేదాన్ని ఇప్పుడు  ఎన్ని ముఖాలు మార్చినా    నా లక్షణాలు పోలేదు. నా భయము  పోలేదు. అయ్యో దేవుడా నీవే    రక్షించు  .స్వామి “ అనగానే దేవుడు ప్రత్యక్షమై” ఏ   తల  కావాలో కోరుకో “  అనగానే “ స్వామి బుద్ది వచ్చింది నాకు ఏ ముఖాలు వద్దు నా ముఖం నాకు  ప్రసాదించండి .  నా తోటి మిత్రులతో నేను హాయిగా కలిసి జీవిస్తాను  అంది . దేవుడు “ చూశావా,, నీ తల మారిందేకానీ .. నీ తల రాత మారలేదు .  వేరొకరిలా జీవించాలనుకోకు .అది అనేక  అనర్ధాలకు దారి తీస్తుంది  నీవు నీలా జీవించు. అందుకే దేవుని కోరికలు కోరేటప్పుడు ఆలోచించి  సముచితమైనవిగా కోరుకోవాలి. ఏ దేవుడు ఇన్ని   వరాలు ఇవ్వడు. నీవు భక్తితో ప్రార్థించావు   కాబట్టి    ప్రత్యక్షమైనాను . నీకు బుద్ది  రావాలనే  నీవు అడిగిన తలలన్నీ ఇచ్చాను ..పోయి ఇకనైనా నీ గుంపులో కలిసి జీవించు “  అని దేవుడు మాయమైపోగా  జింక    చెంగు చంగున జింకలగుంపుని కావడానికి వెళ్ళి పోయింది .