స్నేహితుని క్షేమం.:-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.


 


అడవిలోని జంతువులు అన్ని సమావేశమై ఉన్నాయి. సమావేశంలో ఆరోపణ చేయడానికి వచ్చిన కాకిబావను చూసిన సింహరాజు 'చెప్పండి కాకిబావగారు తమకు వచ్చిన కష్టం ఏమిటి'అన్నాడు.

'ప్రభు ఇంతకాలం ఒకరిని చూసి ఈర్ష పడటం,అసూయ చెందడం మనుషులకే అనుకున్నా అది మనఅడవిలోని జంతువులకు అలవడిందని నిన్ననే నాకుతెలిసింది.ప్రభు మేము మీలాగా వేటాడలేము నగర,గ్రామవాసులు వదిలే ఎంగిలి పదార్ధాలు తింటూ జీవించేవాళ్ళం.

పొరుగున ఉన్న గ్రామానికి చేరువగా ఉన్న ఏటి ఒడ్డున ఉన్న చెట్టుపై గూడు కట్టుకుంటే నాకు సౌకర్యంగా ఉంటుందని వెళ్ళను అప్పటికే ఆచెట్టుపై గూడుకట్టిన నా స్నేహితుడు అయిన కాకి నన్నుగూడు కట్టుకోనివ్వలేదు ఈఅడవిలో అందరికి జీవించే హక్కు ఉన్నప్పుడు నేనుకట్టుకునే గూటికి ఎందుకు ఆటంకం కలిగించాలి?'అన్నడు కాకిబావ.ఆచెట్టుపై గూడుకట్టిన కాకిని సభకు పిలిపించారు.

'మన కాకిబావగారునువ్వు గూడుకట్టుకున్న చెట్టుపై తనూ గూడుకట్టుకోవడానికి వచ్చానప్పుడు అభ్యంతరంపెట్టావట కారణం ఏమిటి?'అన్నాడు సింహరాజు.

'ప్రభు గ్రామానికి చేరువగా ఏటిలోనీరు అన్ని సౌకర్యంగా ఉన్నాయని నేను గూడుకట్టి గుడ్డుపెట్టాను. అనంతరం తెలుకున్నాను, ఆచుట్టుపక్కల ఒక్కచెట్టులేదని.గ్రామానికి చెట్లు చేరువలో ఉండటంవలన ఆగ్రామస్తులు తమ అవసరాలకు ఆ చెట్లన్ని కొట్టుకువెళ్ళారు.నేనుగూడుకట్టిన ఈఒక్కచెట్టే అక్కడఉంది.ఎప్పుడు ఎవరు వచ్చి ఈచెట్టును కొట్టివేస్తారో, వర్షాలవలన వాగుకు వరదవచ్చి ఒడ్డునే ఉన్న నానివాసమైన చెట్టు నీటికోతకుగురై వాగులోకి ఒరిగి పోతుందో అని భయంతో ప్రతిరోజు గడుపుతున్నాను,అనాలోచితంగా ఈచెట్టుపై గూడుకట్టి నేను అనుభవిస్తున్న బాధ,వేదనా నామిత్రుడికి రాకూడదనే నేను నివాసంఉండే చెట్టుపై  గూడుకట్టనివ్వలేదు,అపార్ధం చేసుకున్నఅతను తమకు ఫిర్యాదు చేసాడు'అన్నది సభకు వచ్చిన కాకి.

'విన్నారా కాకిబావగారు తనకు వచ్చినకష్టం తనమిత్రుడికి రాకూడదు అనే ఆలోచన చాలాగొప్పది.సాటివారికి ఇబ్బంది కలగకూడదు అన్న ఈకాకిని మేము అభినందిస్తున్నాం.తమరు ఈవిశాలమైన అడవిలో మరోచెట్టుపై గూడుకట్టుకుని హాయిగా జీవించండి'అన్నాడు సింహరాజు.రాజుగారితీర్పుకు జంతువులన్ని ఆమోదంతెలిపాయి.


కామెంట్‌లు