అంతరంగం ( జీవితానుభవాలు -సైకిల్ సవారి)--కందర్ప మూర్తి , హైదరాబాదు.


 ఎవరికైనా బాల్యం ఒక అమాయక  చీకూ చింతలేని ఆనందమయ జీవితం.ఆటలు పాటలు సాహసాలు దూకుడు

బాల్యప్రాయం అది.

   అప్పట్లో మాఊళ్లో సైకిళ్లు ఎక్కువగా రోడ్లమీద కనబడేవి.

..వ్యాపారస్తులు, చిరు ఉధ్యోగులు రెండు చక్రాల సైకిళ్లు

 ఉపయోగించే వారు. హీరో , అట్లాస్, హెర్క్యులిస్ బ్రాండ్ల

 సైకిళ్లు వాడుకలో ఉండేవి.


   కూడళ్లలో సైకిల్ అమ్మకాలషాపులు  విడి భాగాలుగా ఉండి అమ్మిన

తర్వాత వాటిని జోడించి సైకిల్ గా తయారు చేసేవారు.సైకిల్ కి

వెనక కేరేజి , ముందు హేండిల్ బార్ కి తొట్టె పెట్టించుకునే వారు.

కేరేజి మీద వెనక ఒకరు కూర్చొనే వారు. సామాన్లు కూడా పెట్టి

తీసుకెళ్లే వారు. సైకిల్ బెల్ శబ్దం ప్రత్యేకంగా ఉండి సైకిల్ అని

గర్తించేవారు. ఎక్కువగా పెద్ద వాళ్లు తొక్కే సైకిళ్లే అందుబాటులో

ఉండేవి.

    సైకిల్ షాపుల వారు సైకిల్ అమ్మకాలే కాకుండా గంటకు ఇంత

డబ్బు అని అద్దెకు ఇచ్చేవారు. తాత్కాలికంగా పనుల కోసం

 వెళ్లేవారు సైకిళ్లు అద్దెకు తీసుకుని పని అయిన తర్వాత ఎన్ని

గంటలు వాడితే అంత డబ్బు చెల్లించేవారు . బాగా పరిచ

యస్తులకే అద్దెకు ఇచ్చేవారు. కొత్తవారైతే ఎవరో ఒకరు షాపు యజమానికి పరిచయం ఉన్న వారిని వెంట తీసుకురావాలి.

 సైకిల్ సర్వీసింగు , రిపైర్ ,టైర్ పంక్చర్  కి షాపు దగ్గర పనివాళ్లు

ఉండేవారు. 

       పాఠశాల శలవుల్లో ఏదో ఒక కాలక్షేపం ఉండేది. మా అన్నయ్య, వాడి స్నేహితులు సైకిళ్లు అద్దెకు తెచ్చుకుని పాఠశాల

ఆటల మైదానంలో సైకిల్ తొక్కడం నేర్చుకునేవారు. వాళ్లు

పెద్ద వాళ్లు  కాబట్టి ముందు హాఫ్ ఫెడల్, తర్వాత ఫుల్ ఫెడల్

ప్రాక్టీసు చేసేవారు. ఎవరో ఒకరు హేండిల్ పట్టుకుంటే తొక్కేవారు

 మెల్లగా ఫెడల్ మీద కాలుతో కుంటుతూ హాఫ్ , ఫుల్ ఫెడల్

తొక్కడం నేర్చేవారు. సైకిల్ పెద్దది ఎత్తుగా ఉండటం వల్ల కాళ్లు అందక  సీటు ఎక్కే అవకాశం లేకపోయేది. ముందు హేండిల్

బేలన్సు కోసం తాపత్రయ పడేవారు. బాగా తొక్కడం వచ్చిన

తర్వాత రోడ్డు మీద ప్రాక్టీస్ జరిగేది. ఒక్కొక్కసారి హేండిల్ బేలన్సు కాసుకోలేక కింద పడి చిన్న చిన్న దెబ్బలు

 తగిలించుకునే వారు.

        అలా ఒకసారి నేను కూడా సైకిల్ తొక్కడం నేర్చుకుంటా

నంటే  సైకిల్ అద్దెకి తెచ్చి పాఠశాల ఆటల మైదానంలో హాఫ్

ఫెడల్ ప్రాక్టీసు మొదలైంది. మెల్లగా హాఫ్ నుంచి ఫుల్ ఫెడల్

తొక్కడం నేర్చుకున్నాను. ఇంక రోడ్డు మీద తొక్క వచ్చన్న

ధీమాతో సైకిల్ రోడ్డు మీదకు తెచ్చాను.కొంత దూరం వెళ్లేసరికి

 రోడ్డు పల్లం వచ్చింది. నేను ఫుల్ ఫెడలు తొక్కేసరికి  సైకిల్

 జోరందుకుంది.

   మా ఊళ్లో అప్పుడే కొత్తగా మూడు చక్రాల సైకిల్ రిక్షాలు

రోడ్ల మీద తిరగడం మొదలయాయి.మట్టి రోడ్లే ఉండేవి.

 నేను సైకిలు ఫుల్ ఫెడలు తొక్కినందున రోడ్డు పల్లం అవడం,

సైకిల్ జోరు పెరిగింది. కొత్త  సైకిల్ రిక్షా కింద నుంచి ఎత్తు వైపు

 వస్తోంది. నేను గాభరాలో హేండిల్ కుడివైపు తిప్పాలో లేక

ఎడం వైపు తిప్పాలో తెలియక  సైకిల్ రిక్షాను గుద్దేసి వెనక

సీట్లో పడ్డాను.సైకిల్  రిక్షాను గుద్దేసి పక్కన పడింది. తర్వాత

మా వాళ్లు పరుగున వచ్చి నన్ను రిక్షా నుంచి పైకి తీసారు.

 నుదుటి మీద బొప్పి కట్టింది.రిక్షావాలా ఒకటే తిట్లు.అతనికి

 సర్ది చెప్పి ఎలాగోలా బయట పడ్డాం.

   ఒకటి రెండు యాక్సిడెంట్లు జరగందే డ్రైవర్ కాలేడు అన్నట్టు

చిన్న చిన్న దెబ్బలు తగిలిన తర్వాతే సైకిల్ సవారి వచ్చింది.

 తర్వాతి రోజుల్లో సీటు తొక్కడం కూడా వచ్చేసింది.

    కాలక్రమంలో పిల్లల బేబీ సైకిళ్లు అందుబాటులో కొచ్చాయి.

    మరికొన్ని నా చిన్న నాటి ముచ్చట్లు తర్వాత.

   

                    **                   **                    **