నలుగురు సోమరులు. నీతికథ.:- బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

 అమరావతి నగర శివార్లలో నలుగురు సోమరి పోతులు ఉండేవారు.వారు ఏపని చేయకుండా గుడిలో ఇచ్చే ప్రసాదం తోపాటు ఎవరన్న ఏదైనా పెడితే తిని నిద్ర పోతుండేవారు. వారిలో పెద్ద వాని పేరు రూపాయి,రెండోవాని పేరు ముప్పావలా,మూడవ వాని పేరు అర్ధ రూపాయి,నాలుగో వాని పేరు పావలా.
ఓక రోజు అన్నదమ్ములు నలుగురు వీధిలో వెళుతుంటే నేలపై రూపాయి బిళ్ళ కనిపించింది.అది చూసిన పెద్దవాడు, ముప్పావలా ని  ఆరూపాయి తీయమన్నాడు,ముప్పావలా, అర్ధరూపాయి చెప్పాడు,అర్ధరూపాయి పావలాకి చెప్పాడు, పావలా తను విని వినట్లే మౌనంగా ఉండి పోయాడు.
అలా వీధిలోని రూపాయి వద్ద ఎండలో నలుగురు అన్నదమ్ములు  నిలబడి పోయారు.కొంత సేపటికి తలపై బుట్టలో జామ పండ్లు అమ్ముకునే వ్యక్తి వారి వద్దకు వచ్చాడు.
'అయ్యా రూపాయికి ఎన్ని పండ్లు'అన్నాడు పెద్దవాడు.'నాలుగు'అన్నాడు ఆ జామ పండ్ల వ్యక్తి.'సరే పండ్లు నా చేతికి ఇచ్చి నేలపై ఉన్న ఆ రూపాయి తీసుకో'అన్నాడు పెద్దవాడు. పండ్ల బుట్ట తలపై నుండి దించడానికి సహాయం చేయమన్నాడు పండ్ల వ్యక్తి. అది మా పనికాదు అన్నారు అన్నదమ్ములు.దారిన పోతున్న మరో వ్యక్తి సహాయం తో పండ్ల బుట్ట దింపుకుని, నేల పై ఉన్న రూపాయిని తీసుకుని, వీళ్ళ చేష్టలకు వళ్ళుమండిన ఆపండ్ల వ్యక్తి, నాలుగు జామ పండ్లు నేలపై ఉంచి 'నాకు రూపాయి నేలపై దొరికింది కనుక నేను పండ్లుకూడా అక్కడే పెట్టాను తీసుకొండి'అని తన దారిన తాను వెళ్ళి పోయాడు.
రోడ్డు పైన ఉన్న జామపండ్లను నువ్వు తీయమంటే నువ్వుతీయి అని నలుగురూ సోమరి అన్నదమ్ములు ఒకరికి ఒకరు చెప్పుకోసాగారు. ఇదంతా చెట్టు ఉన్న రెండు కోతులు గమనించి మెరుపు వేగంతో వచ్చి ఆ పండ్లు తీసుకు వెళ్ళాయి.
జరిగిన సంఘటనకు, నువ్వే కారణం అని నలుగురు అన్నదమ్ములు వాదులాడుకుంటూ నడుస్తూ పొరుగు గ్రామం మొదట్లో ఉన్న బావి వద్దకు వెళ్లారు. 'ఒరే ముప్పావలా నీళ్ళుతోడు'అన్నాడు రూపాయి.వాడు అర్ధరూపాయికి,వాడు పావలాకి చెప్పాడు.పావలా 'ఆగండి ఎవరైనా వచ్చి నీళ్లు తోడి పోస్తారు'అన్నాడు.అలా కొంత సమయంగడచింది.
ఆదారిన రాజు గారు మేనాలో వెళుతూభోజన సమయంకనుక బావి వద్దఉన్న చెట్టు కింద పల్లకి దించి బావివద్దకు కాళ్ళు చేతులు శుభ్రపరుచుకునేందుకు  వెళ్ళారు.అక్కడ ఉన్న నలుగురు సోమరులను గమనించి 'ఏంనాయనా ఇంతఎండలో ఇక్కడ నిలబడి ఎవరికోసం చూస్తున్నారు' అన్నాడు .'ఎవరైనవచ్చి నీళ్ళుతోడిపోస్తే తాగుదాం అని'అన్నాడు పెద్దవాడు రూపాయి.విషయంగ్రహించిన దీవాన్ వీళ్ళకు భోజనం పెట్టించి జమీందారు వారి పల్లకి మోయించాడు.అలావారి సోమరితనాన్ని వదలి చక్కగా జమిందారు గారి దివాణంలో కష్టపడుతూ హాయిగా జీవించారు.
                                                        
కామెంట్‌లు