బంధాలన్నీ అశాశ్వతమే. ఇది నిజమని తెలిసినాసరే కలకాలం కలిసుంటాయి బంధాలనుకుంటాం. ఎన్నో రకాల పరిచయాలు ఏర్పడి ఎప్పటికప్పుడు అనుభవపాఠాలను చెప్తున్నాసరే మనసు మన మాట వినదు. అది తన మానాన తాను ఏవేవో అనుకుంటుంది. అనుకోవడమే కాదు కలలు కంటుంది. ఊహల్లో తేలియాడుతుంది. ఎక్కడన్నా దెబ్బతిన్నప్పుడు ఒకటి రెండు రోజులు బాధ పడతాం. తర్వాత మళ్ళా మామూలే. అందుకే అనిపిస్తుంది ఈ మనసు వొట్టి పిచ్చిదేమోనని. ఎవరి సంగతేమో గానీ నా మనసైతే మరీ పిచ్చిది. జరగని వాటి గురించి లేనిపోనివి ఊహించేసుకుని మాటిచ్చేసి ఆ తర్వాత నాలుక్కరచుకుంటూ ఉంటుంది. సరి అదలా ఉండనిచ్చి విషయానికొస్తాను. నేనిక్కడ చెప్పబోయేది ఓ కళ్ళజోడు గురించి.
ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ రావుగారు భౌతికంగా దూరమైపోయారన్న విషయం ఎలా తెలిసిందేమోగానీ సరిగ్గ వారంరోజులుకూడా కాలేదు నా దగ్గరున్న ఆయన కళ్ళజోడు ఈరోజు ఉదయం విరిగిపోయింది.
ఆయన కళ్ళజోడు నా దగ్గరకెలా వచ్చిందంటే..... ఏడాది క్రితమనుకుంటాను ఓ రాత పని విషయంగా నేను ఆయన ఆఫీసుకి వెళ్ళాను. ఓ గంటపైనే అవీ ఇవీ మాట్లాడుకున్నాం. ఆయనను ఎప్పుడు కలిసినా పాజిటివ్ కోణంలోనే మాటలు కొనసాగేవి. ధైర్యాన్నిచ్చేవిగా ఉండేవి. మాటల మధ్యల వాళ్ళావిడతో టీ ఇప్పించారు. ఇద్దరం తాగాం. మళ్ళా కాస్సేపు కబుర్లాడుకున్నాక కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చూపించారు. ఆ పుస్తకాలు తిరగేయడం కోసం నా రీడింగ్ గ్లాసెస్ తగిలించుకున్నాను. వాటిలోంచి ఒకటి రాయగలననుకుని ఎంపిక చేసుకున్నాను. దానిని తెలుగులోకి రాసిస్తే డబ్బులు ఇస్తానన్నరు. సరేనన్నాను.
అనంతరం కళ్ళజోడు తీసి నా ముందున్న టీపాయిమీద పెట్టి మళ్ళీ ఇద్దరం మాట్లాడు కోసాగాం.
మరో పావు గంటకు నా కళ్ళజోడు సంచిలో పెట్టేసుకున్న సంగతి ఎలా మరచిపోయానో తెలీలేదు, టీపాయమీద నాలాటి ఫ్రేమే కలిగివున్న మరొక కళ్ళజోడు తీసుకుని జేబులో పెట్టేసుకున్నా.
ఆయనకు వెళ్ళొస్తానని చెప్పి వీధిలోకొచ్చేసాను. బస్సెక్కాక సంచీలోకి చూడగా రెండు జతల కళ్ళజోళ్ళున్నాయి. అప్పుడుగానీ తెలీలేదు నాది కాని కళ్ళజోడుని తీసుకొచ్చేసానని. తప్పయిపోయింది. బస్సులోంచి ఆయనకు ఫోన్ చేశాను. హాల్లో టీపాయి మీదున్న కళ్ళజోడు పొరపాటున తీసుకొచ్చే సానన్నాను.
"పరవాలేదండి. ఈసారి వచ్చినప్పుడు ఇద్దురుగానీ" అన్నారు మరో రెండు రోజు తర్వాత ఏదో విషయంగా ఫోన్ చేసినప్పుడు "నేను కొత్త కళ్ళజోడు కొనేసుకున్నానండి" అన్నారు.
ఆ తర్వాత నేనిప్పటివరకూ ఆయన ఇంటికి వెళ్ళనూ లేదు. ఆయన కళ్ళజోడు నా దగ్గరే ఉండిపోయింది.
ఈసారి వెళ్ళినప్పుడు ఆయనకిచ్చెద్దామను కుంటూనే నా దగ్గర ఎంతో పదిలంగా చూసుకుంటూ వస్తున్న కళ్ళజోడు ఈరోజు నా అజాగ్రత్త కారణంగా విరిగిపోయింది. పడుకునే మంచంమీద ఆ కళ్ళజోడు పెట్టానన్న సంగతి మరిచిపోయి నా కుడిచేయి బలంగా దానిమీద పడేసరికి ఒక ఫ్రేమ్ ఊడిపోయింది. చెవులకు తగిలించుకునే రెండింట్లో ఒకటి ఊడిపోయింది. విచిత్రమనిపించింది ఆయన పోయిన వారంరోజులకే కమలాకర్ గారి కళ్ళజోడూ నా దగ్గర విరిగిపోవడం. అది విరిగిన బాధ ఓవైపుంటే మరోవైపు మా ఆవిడ నన్ను తిట్టింది "అస్సలు జాగ్రత్త లేదని".
నిజమేనేమో, నాకు జాగ్రత్త లేకపోవడం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి