కోడిపుంజు కూత ...(బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

      ఓ కోడి పుంజు ఉండేది. 
       అది రాత్రి ఆలస్యంగా పడుకుంది.    
       తెల్లారుజామున లేవటానికి బద్దకించింది.
        "ఆ లేవచ్చులే, లేచి ఊళ్ళేలాలా, ఊరేగాలా" అనుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది.
       చాలా సేపటి తర్వాత మేల్కొంది. 
       లేచి చూసేసరికి బారెడు పొద్దెక్కింది.    
       "ఇదేమిటి? విచిత్రంగా ఉంది.
        నేను కూత కూయక పోయినా పొద్దు ఎలా పొడిచింది?
         పొద్దున్నే సూర్యుడిని  ఎవరు నిద్ర లేపారబ్బా!" అనుకుని బయటకు వచ్చింది.
       బయట అవ్వ అన్నం వండుతుంది.
        "అవ్వా? అవ్వా! ఈ రోజు నేను కూయలేదు కదా? పొద్దెలా పొడిచింది?” అని అడిగింది.
       "పిచ్చి పుంజా! నువ్వు లేవకపోతే పొద్దు పొడవదా ఏమిటి? 
        ఎవరు ఉన్నా లేకపోయినా పొద్దు తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. 
       కాలం ఎవరి కోసము ఆగదు. 
       తాములేకపోతే పనులు జరగవు, ఎక్కడివి అక్కడే ఆగిపోతాయి, అనుకునే వారంతా మూర్ఖులే" అంది అవ్వ.
        కోడిపుంజు సిగ్గుపడి వెళ్ళిపోయింది.
కామెంట్‌లు