జై హనుమాన్! (ఇష్టపదులు):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
కనుమా యిడుములనిక కావుమమ్ము హనుమా!
కొనుమా యంజలులిక కోర్కెలే లేవుమా!

వినుమా రామభజన వీనుల విందౌమా 
చనుమా వనమునందు చక్కని ఫలముగొనుమ!

నయమా నీచరితము నామది తలచె సుమా!
నిజమా నిను పిలిచిన నీవె పలుక హనుమా!

మహిమా నీస్మరణము మా పాలిట శుభమా 
ఘనమా జలధిని లంఘనమది  విస్మయమా!

వినుమా మారుతి కథ విజయము నిచ్చు సుమా
వనమా ఋష్యమూక వాసిగ పర్వతమా!

ప్రియమా రామునికడ  ప్రీతి  రాయభారమ
వశమా మృదుభాషణ వాయు పుత్ర మనమా!

ఘనమా లంకకు జని కనె అశోకవనమా 
జయమా సీతకిచ్చె జాగ్రత యుంగరమా!

నిజమా చూడామణి నిడి దీవెనొసగె సుమ
హర్షమా  సీతమది  హాయినిండె   హనుమా!

ఆగమా!రక్కసులె అరిచియు బంధనమా 
భయమా తోక నిప్పు భలె లంక ధ్వంసమ!

ముదమా సీతకంటి ముచ్చటగ విను రామ 
ప్రియమా చూడామణి ప్రేమగొనె శ్రీరామ!

తరమా వారధినిట తలచుటే  కపులమా 
వరమా సముద్రుడే వారధికి తగ్గెనుమ!

శోకమా సౌమిత్రి సొమ్మసిల్లె కదనమ
హనుమా సంజీవని గొనితెచ్చెను  లెమ్మా !

ధర్మమా యుద్ధమున  ధన్యమగు  విజయమా 
శ్రీరామ జయరామ శ్రీ మారుతీ రామ!