కోకిల:- జగదీశ్ యామిజాల
కోకిలా, ఓ కోకిలా,
నీ కుహుకుహులే
పలువురు సంగీతదర్శకుల
స్వరసంగీతానికి పునాది

పొద్దున్నే
స్వరం వినిపించే కోకిలకూ
కరుణకు నిలయమైన ఆలయానికీ
ఎటువంటి తేడా లేదు
రెండూ మనసుకు 
ప్రశాంతత చేకూర్చేవే

కరుణతో హృదయాన్ని ఆవరించిన ఆలయ కోకిల ఒక్కటే తన గానరసంతో
మనకు భరోసా ఇస్తోంది

అజ్ఞానంలోంచి 
ఇవతలకు రమ్మని వినిపించే
కోకిల గానమే
మనకవసరం

అందుకే 
పొద్దున్నే కూసే కోకిల స్వరం
మనకు ఉషారిచ్చే దివ్య మంత్రం

నీ కుహుకుహులతో
మా జీవనసరళిని శృతి చేసి
పల్లవించి
చరణాలతో ఊహలకు ఊపిరినిచ్చి
ఉత్సాహభరితంగా
ముందుకు సాగుతుంటాం కోకిలా

నీ రూపమూ అందమైతే
నీ స్వరం మహా అందం


నీ స్వరమధురిమతో
మనుషులేమిటీ
చెట్లు చేమలూ 
ఇంకా ఇంకా చిగురిస్తూ
మాకందరికీ వసంతాన్నిచ్చి
చైతన్యపరుస్తుంది
అందుకే అంటాను
నీ గానం
మాకు తీర్చుకోలేని రుణం!!
కామెంట్‌లు