*"తానా" సాహిత్యసభకు ముఖ్యఅతిథిగా నల్లాని రాజేశ్వరి*

 అనంతపురము, :ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాహిత్యసభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని జిల్లాకు చెందిన విద్యావేత్త, రచయిత్రి, కాలమిస్ట్, సామాజిక కార్యకర్త నల్లాని రాజేశ్వరికి ఆహ్వానం అందింది. అంతర్జాల వేదికపై 21 దేశాలలోని 21 సంస్థలతో 21 గంటల పాటు ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనం జరగనుందని నిర్వాహకులు తోటకూర ప్రసాద్, తాళ్లూరి జయశేఖర్, తూనుగుంట్ల శిరీష, చిగురుమల్ల శ్రీనివాస్ సంయుక్తంగా వెల్లడించారు. 
ఉగాది సందర్భంగా "తానా" ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 10, 11 తేదీలలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనంలో ఫ్రాన్స్ ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా నల్లాని రాజేశ్వరి పాల్గొని ప్రసంగిస్తారు. బాలల హక్కులు, బాలికా విద్య, మహిళాసాధికారత, భాష - సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు వంటి అంశాలపై మాట్లాడతానని నల్లాని రాజేశ్వరి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి సభలో ముఖ్యఅతిథిగా పాల్గొనే అవకాశం తనకు  లభించినందుకు ఆమె హర్షం వ్యక్తంచేశారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సభల నిర్వాహకులకు రాజేశ్వరి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.