పొరుగూరు రాజుగారిది పెళ్ళి,
కమ్మటి విందు ఉంది.
కుందేలు, తాబేలు విందుకు పోతున్నాయి.
కుందేలు వేగంగా నడుస్తుంది.
తాబేలు తాపీగా కదులుతుంది.
"ఇలా అయితే మనం విందు అందుకున్నట్టే.
ఏమిటా నడక?
కాస్తా వేగం పెంచు.
పెందలాడే చేరుతాము" అంది కుందేలు తాబేలుతో.
ఇదేమి పట్టించుకోకుండా తాబేలు చిన్నగా నడుస్తుంది.
“నీతో నాకు కుదరదులే.
నీవచ్చేసరికి ఎంగిలి ఆకులు కూడా ఉండవు.
నీ చావు నీవు చావు.
నేను పోతున్నా" అని కుందేలు పరుగందుకుంది.
కుందేలు కొంత దూరం పోగానే వాగు అడ్డం వచ్చింది.
దానికి ఈతరాదు.
పడవవాడు అప్పుడే బయలుదేరి పోయాడు.
వాడు ఆవలి ఒడ్డుకు పోయి తిరిగి రావాలంటే రెండు గంటలు పడుతుంది.
ఏమి చేయాలో పాలుపోక కుందేలు గుటకలు మింగుతూ కూలబడింది.
తాబేలు రానే వచ్చింది.
గబుక్కునా వాగులో దూకింది.
ఆవలి ఒడ్డుకు చేరింది.
రాజు గారింటికి వెళ్ళింది.
విందు భోజనం ఆరగించింది.
తిరిగి వచ్చింది.
కుందేలు ఇంకా పడవకోసం ఎదురు చూస్తూనే ఉంది.
కొంతసేపటికి పడవ వచ్చింది.
కుందేలు ఎక్కింది.
పెండ్లి ఇంటికి వెళ్ళింది.
అప్పటికే భోజనాలు అయి పోయాయి.
ఖాళీ పాత్రలు కడుగుతున్నారు.
కుందేలు చెవులు జాడించుకుంటూ ఇంటికి వచ్చింది.
రాత్రి మిగిలిన చద్ది దుంపలు తిన్నది.
"ఆత్రుత పడ్డా వరిగేది ఏమి లేద"ని తెలుసుకుంది కుందేలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి