"సంసారం గుట్టు రోగం రట్టు": - బిందు మాధవి . ఎం.

 "మీ అబ్బాయి కాలేజిలో చేరాడా, ఎడ్మిషన్స్ అయిపోయినట్టున్నాయిగా" అన్నది సరళ మంగతో!
"లేదింకా! వాడికొచ్చిన ర్యాంకుకి గవర్నమెంట్ కాలేజి లో రాదు. ప్రైవేట్ లో లక్షలు లక్షలు డొనేషన్ కట్టాలి. ఒక సారితో సరిపోదు కదా! ఐదేళ్ళు కట్టాలి. వాడేమో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోనంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు" అన్నది మంగ.
"వాడు ఎలాగయినా మెడిసిన్ లోనే చేరాలని గొడవ చేస్తుంటే, మా వారి ఆఫీసులో ఈ మధ్య మొదలుపెట్టిన మనీ సర్క్యులేషన్ స్కీం లో చేరి....." అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, పక్క గదిలోంచి కోడలి టెలిఫోన్ సంభాషణ విన్న అత్తగారు గబ గబా వచ్చి హుష్..అని నోటి మీద వేలు పెట్టి సైగ చేసి, ఫోన్ కట్ చెయ్యమన్నట్టుగా సైగ చేసింది.
"ఎవరే ఫోన్ చేసింది" అని అడిగిన జయలక్ష్మి తో " మా చిన్నప్పుడు పక్కింట్లో ఉండే సరళ ! మొన్న శంకర మఠం వెళితే గుర్తు పట్టి మాట్లాడిందని చెప్పా కదత్తయ్యా! ఆవిడే" అన్నది మంగ.
"నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అలా హరిశ్చంద్రుడి చెల్లెలి లాగా ఇంటి విషయాలన్నీ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. వాడికే ర్యాంక్ వచ్చిందో ఆవిడ అడిగిందా? ఆ ఫోన్ చేసిన ఆవిడ నీకు పెద్ద పరిచయస్తురాలు కాదు. కనిపించినప్పుడు మాటవరసకి నీ గురించి, పిల్లల గురించి అడుగుతారు. అంత మాత్రాన పూస గుచ్చినట్టు మన వ్యక్తిగత విషయాలన్నీ చెప్పకూడదు. వాళ్ళు దాన్ని చిలవలు పలవలు చేసి, ఇంతుంటే అంత చేసి బయట ప్రచారంచేస్తారు."
"పైగా మా వాడి ఆఫీస్ విషయాలతో సహా అన్నీ మాట్లాడేస్తున్నావు!" అని హెచ్చరికగా చూసి లోపలికెళ్ళారు.
*****
"నిరుడు మీ పిన్ని కూతురు గంగ మనింటికొచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయికి నువ్వు బిస్కెట్ ఇస్తే మనం చూడకుండా చెత్త బుట్టలో పడేసింది. నేను చూసి అడిగితే, పిల్లవాడు పొరబాటున పడేశాడు అని అబద్ధం చెప్పింది. నీకు గుర్తు లేదూ?"
"తరువాత ఎప్పుడో మీ పిన్ని మాటల్లో తన మనవడికి ఫుడ్ ఎలర్జీ ఉన్నదని, ఏమి తిన్నా ఊరికే కక్కిపోస్తున్నాడని చెప్పింది. ఆ మాటకే నేను మన హోమియో డాక్టర్ నంబర్ ఇచ్చి ఆయన్ని సంప్రదించమని, ఆయన చాలా మంచి మందు ఇస్తారని చెప్పాను. మందు వాడటం మొదలు పెట్టాక... ఇప్పుడు ఎలర్జీలు తగ్గి పిల్లవాడు బాగా కోలుకున్నాడని, అన్ని రకాల ఆహారాలు పెట్టగలుగుతున్నామని చెప్పింది. నేను చేసిన సహాయానికి కృతజ్ఞతలు కూడా చెప్పింది" అంటుండగా మంగ తమ్ముడు వికాస్ ఫోన్ చేశాడు. ఫోన్ లో మాట్లాడుతున్న మంగ ముఖంలో రంగులు మారుతున్నాయి.
"ఎవరిది ఫోన్? ఎందుకు కంగారు పడుతున్నావు" అనడిగింది. "మా తమ్ముడండి. వాడికి మోకాలి కింద భాగంలో పిక్క దగ్గర కాయ లాగా వచ్చిందిట. అది క్యాన్సరేమో అని కంగారు పడుతూ, నాకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారేమొ అడగటానికి ఫోన్ చేశాడు" అని చెప్పింది.
"అలా వచ్చే కాయలన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు. కొంత మందికి అలా వంశ పారంపర్యంగా వస్తూ ఉంటాయి. నొప్పి లేకపోతే భయపడక్కరలేదు. అలా అని అశ్రద్ధ చెయ్యమని కాదు. మీ నాన్నగారితో మాట్లాడితే, ఇంట్లో ఇంతకు ముందు ఎవరికయినా వచ్చి ఉంటే ఆయన చెబుతారు. అప్పుడు అవసరమయితే మీకు బాగా తెలిసిన డాక్టర్ దగ్గరకి వెళ్ళమను. అన్నిటికీ అలా కంగారు పడకూడదు" అని ఆవిడ అనుభవాన్ని రంగరించి చెప్పారు.
మరునాడు వికాస్ ఓ డజన్ యాపిల్ పళ్ళు తీసుకుని హుషారుగా విజిలేసుకుంటూ వచ్చాడు. తమ్ముడి సమస్యకి సమాధానం దొరికిందని మంగకి అర్ధమయింది. జయలక్ష్మి గారు చూస్తూనే, "ఏమోయి నిన్న మీ అక్కని హడలెత్తించావు, ఇవ్వాళ్ళ హుషారుగా ఉన్నావు!" అంటూ "చాలా విషయాలు ఇంట్లో వారితో స్థిమితంగా చర్చిస్తే సరిపోతుంది. మనకొచ్చే ఎక్కువ లక్షణాలు, తెలివి తేటలు, అభిరుచులు, రోగాలు వంశ పారంపర్యంగా వచ్చేవే! ఈ రోజుల్లో కొన్ని రోగాలు కాలుష్యం వల్ల వస్తున్నాయనుకో! ఏది ఏమయినా శుభవార్త మోసుకొచ్చావు. సంతోషం" అని కాఫీ గ్లాసు చేతికందించారు.
"సంసారం గుట్టు..రోగం రట్టు" అన్నారు అందుకే పెద్దలు. రోగాన్ని దాస్తే పరిష్కారం ఎలా దొరుకుతుంది. కొన్ని విషయాలు అందరితో ఎలా పంచుకోకూడదో, కొన్ని విషయాలు నలుగురితో చెప్పి సలహా, సహాయాలు తీసుకోవాలి" అని జయలక్ష్మి గారు ముక్తాయించారు.
"అందుకే పెద్దవాళ్ళ మాట చద్ది మూట అన్నారు" మంగ, వికాస్ ఒకేసారి!