కొత్త తరం కథలు - - రక్షిత సుమ

 ఒక చెట్టు మీద కాకుల జంట నివసిస్తూ ఉండేది. అదేనండి, అప్పట్లో ఒక పాము కాకి గుడ్లను తినేస్తుంటే ఆ కాకులు రాణీ గారి హారం తెచ్చి పాము పుట్టలో వేసి దాన్ని చంపించాయి కదా..హా..ఆ గూట్లో పెరిగిన ఒక కాకి ఫ్యామిలీ ఏ ఇది.
ఆడ కాకి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫ్లాష్ back అంతా దానికి చెప్పింది మగ కాకి.
"సర్లేండి, అది అపుడెప్పుడో జరిగినది కాదా.! ఆ పాము వాళ్ళకి బుద్ది వచ్చి ఉంటుంది.మళ్ళీ అలా చేయకపోవచ్చు " అని అన్నది ఆడ కాకి.
"ఏమో ఈ పాములని అస్సలు నమ్మలేం.ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి సరేనా"అంది మగకాకి.
ఒకరు ఆహారం కోసం వెళ్తే ఇంకొకరు గూడు దగ్గర ఉండి గుడ్లను కాపాడాలని నిర్ణయించుకున్నాయి.
కాకి అనుమానపడ్డట్టుగానే ఎలాగైనా వీళ్ళ మీద పగ తీర్చుకుందామని wait చేస్తున్న పాము,సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది.
వీళ్లేమో గూడు వదిలి వెళ్ళడం లేదు.ఏం చెయ్యాలబ్బ అని ఆలోచిస్తుంటే,దానికి ఒక ఐడియా వచ్చింది.
వెంటనే రాజుగారి కోటకి వెళ్లి కాకి గుడ్డు పరిమాణం లో ఉన్న ముత్యాన్ని తీసుకొచ్చి ,మగ కాకి కాపలా కాస్తున్న సమయంలో గూడు కింద పడేసింది.
పాపం మగకాకికి గుడ్ల లెక్క తెలియక,గూడులోంచి గుడ్డు పడిపోయిందేమో అని తీసుకోడానికి కింద వాలింది.నోటిలో కరుచుకొని పైకి ఎగరబోతుంటే ,ఏదో గట్టిగా తగిలి కింద పడిపోయింది.చూస్తే అది రాజభటులు విసిరిన రాయి.
"దొంగ కాకి,రాణీ గారి ముత్యాన్ని దొంగలించబోయింది,"అంటూ ముత్యాన్ని తీసుకెళ్ళి పోయారు.ఇదంతా చూసిన పాము,దాని plan fail అయినందుకు నిరుత్సాహపడి అక్కడనుంచి బయల్దేరింది.
భటులు కొట్టిన దెబ్బనుంచి తేరుకున్న కాకికి పొదలలో కదులుతున్న పాము కనిపించింది.
అప్పుడు దానికి పాము ఏం చెయ్యాలనుకుందో అర్థమయ్యి,"అమ్మ దొంగమోహంది! ఇంత పన్నాగం పన్నిందా.ఎలాగైనా దీనికి ఒక గుణపాఠం నేర్పాలి"అని అనుకుంటూ గూట్లో చేరింది.
ఆడ కాకి వచ్చాక జరిగిన విషయమంతా చెప్పింది.ఇద్దరు కలిసి,పాముకి ఎలా బుద్ది చెప్పాలా అని ఆలోచించ సాగారు.
ఇంతలో ఆడకాకికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చి మగ కాకికి చెప్పింది.అనుకున్నట్టుగానే తెల్లావారుజామునే లేచి వాటి పథకం అమలు పరచసాగాయి.
కాకి గుడ్లను తినడానికి ఒక్క అవకాశమైన దొరకకపోదా అని మళ్ళీ కాకి గూడు దగ్గర్లో ఉన్న పొదలలోకి వచ్చి చేరింది పాము.
ఎప్పటిలా గూడులో కాకులు కాపలా లేకపోవడంతో పాము సంతోషంతో " ఆహా,ఇన్నాళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది.నిన్న తగిలిన దెబ్బకి చికిత్స చేయించుకోవడానికి వెళ్ళినట్టున్నాయ్ కాకులు.ఈ రోజు నాకు మంచి విందే!" అంటూ ఉత్సాహంగా బుస కొట్టసాగింది.
ఇంకా ఆలస్యం చెయ్యకుండా బరబరా పాకుతూ చెట్టేకేసింది.నిగ నిగ మెరుస్తున్న గుడ్లను చూసి పాము నోట్లో నీళ్ళు ఊరాయి.వెంటనే నోరు పెద్దగా చాపి గుటుక్కున మింగింది.అంతే..! దానికి గొంతు పట్టేసింది. ఊపిరి ఆడటం లేదు.మైకం వచ్చినట్టయ్యి చెట్టు పైనుంచి కింద పడి గిల గిల కొట్టుకోసాగింది.
ఇదంతా పక్క చెట్టుమీదనుంచి చూస్తున్న కాకులు, పాముకి వాటి గొంతు వినపడేంత దూరంలో వచ్చి, "ఏం పాము మమా, గుడ్లు మింగబోతే గొంతు పట్టేసిందా అలా గుడ్లు తేలేసశావ్? " అడిగింది ఆడకాకి.
"అయినా కాకి గుడ్లు మింగితే గొంతు ఎలా పట్టేసిందని ఆలోచిస్తున్నట్టు ఉన్నదేమో." అంది ఆడకాకి.
"చెప్తాం విను.మమ్మల్ని రాజభటులతో చంపించడానికి రాణిగారి ముత్యాలు తీసుకొచ్చావు కదా. మేము కూడా నీకు బుద్దిచెప్పడానికి,మా గూటిలో గుడ్లకి బదులు పసరు పూసిన రాళ్ళు పెట్టాం.అవి మింగితే ఎంతటి విషపూరిత పామైనా అవి గొంతుదిగక,ఊపిరి ఆడక పోవాల్సిందే."అని అన్నాయి.అవి భద్రంగా దాచిన గుడ్లను వాటి గూటిలో సర్దుతూ.
ఇది విన్న పాము,"ఇంకెప్పుడు ఇలా చెయ్యను,ఎవరి గుడ్లు దొంగతనం చేయను.క్షమించండి.ఇంకెప్పుడు ఎవ్వరికీ అనవసరంగా హాని చెయ్యను.దయచేసి నన్ను బ్రతికించండి.please.."అని ప్రాధేయ పడసాగింది పాము.
"అమ్మో..నిన్ను ఇప్పుడు బ్రతికిస్తే మాకు ఇంకోసారి హాని చేయవు అని ఏంటి నమ్మకం"కోపంగా అడిగింది మగకాకి.
"నేనే కాదు,మా పాములెవరం ఇంకెవరికి అనవసరంగా హాని చేయము.మీకు మాటిస్తున్న .నన్ను నమ్మండి.నాకు నా తప్పు తెలిసి వచ్చింది."అని గట్టిగ దగ్గుతూ బ్రతిమాలుతోంది పాము.
"సరే,ఈసారికి క్షమిస్తున్నాం.ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టం గుర్తుంచుకో.
అదిగో ఈ నీళ్ళు తాగు.ఇందులో విరుగుడు మందు కలిసి ఉంది.నీ ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు"అంటూ చెట్టు మొదట్లో ఉన్న కొబ్బరి టెంకను చూపించింది ఆడ కాకి.
పాము ఆ నీళ్ళు తాగగానే ఆ రాయి లోపలికి పోయింది,కాసేపటికి విరుగుడు కూడా పనిచేసి మామూలైంది.
కాకుల వైపు చూస్తూ,"నన్ను క్షమించండి.అప్పుడు మా తాత చేసింది తప్పని తెలిసి కూడా మీమీద పగ సాధించాలనుకుని మిమల్ని చాలా ఇబ్బంది పెట్టాను.నాకు నా తప్పు తెలిసొచ్చింది."అని చెప్పింది.
ఇంతలో దాని కళ్ళు నీలంగా మారాయి.అంతా మబ్బు మబ్బుగా కనిపిస్తుంది.చర్మం dull గా అయ్యింది.
అయ్యా విరుగుడు పనిచేయలేదేమో అని కంగారు పడ్డాయి కాకులు.
కానీ అంతలోనే పాము కుబుసం విడవసాగింది.విషయం అర్ధమైన కాకులు స్థిమితపడ్డాయి.
కాసేపటికి కుబుసం విడిచిన పాము,కొత్త చర్మంతో తళతళ మెరవసాగింది."నాకు బుద్ది చెప్పినందుకు ధన్యవాదాలు. పాత చర్మం తో పాటే పాత బుద్ధులు కూడా ఇప్పటినుంచి వదిలేస్తున్నాను.ఇకపై మంచిగా మారతాను. నానుంచి మీకు ఎలాంటి ఇబ్బందీ రాదు."అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
పాము బుద్ది తెచ్చుకొని మంచిగా మారినందుకు సంతోషిస్తూ "హమ్మయ్య ఇకనుంచి ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా ఉండొచ్చు" అనుకుంటూ గూడు లోకి వెళ్ళాయి కాకులు.ఇంతలో గుడ్లలోంచి పిల్లలు బయటికి రావడం మొదలయ్యాయి.వాటిని చూస్తూ ఆనందంగా పిల్లలకోసం ఆహారం సేకరించడం మొదలుపెట్టాయి కాకులు.