అంతా నేనే:- బిందు మాధవి . ఎం .

 భోజనం చేసి, నడుం వాల్చి ఓ కునుకు తీసి నిద్ర నించి లేస్తున్న కామేశ్వరమ్మగారికి, వంటింట్లో నించి ఏదో కింద పడిన శబ్దం వినపడి, "ఎవరే అది? పిల్లేమో చూడవే, టీ కి అట్టేపెట్టిన పాలు కాసిని తాగిపోతుంది!" అన్నారు.

నిశాంత్ డబ్బాలోంచి వేరు శనగ ఉండలు ఫ్రెండ్ కోసం తీసుకుంటుంటే, బిందె మీద మూత కింద పడి చప్పుడయింది. బామ్మ పడుకుంది, ఇదే మంచి టైం అనుకుని వాడి పని వాడు చల్లగా కానిచ్చేశాడు.
కంప్యూటర్ మీద పని చేసుకుంటున్న విమల, "ఆ:( నేనిక్కడే ఉన్నానత్తయ్యా! నే చూస్తానుండండి" అని, తన కొడుకు చేసిన పని తెలిసీ, అత్తగారు అరుస్తుందని సర్ది చెప్పింది.
కామేశ్వరమ్మగారు ఇంట్లో వాళ్ళ తిండికి ఆంక్షలు పెట్టే గయ్యాళి కాదు కానీ, ఇంటి ఖర్చు విషయంలో కొంచెం పొదుపుగా, పట్టింపుగా ఉండే వ్యక్తి.
గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తూ బొటాబొటిగా భర్త సంపాదించిన దానితో సిటీలో నలుగురు పిల్లలతో గుట్టుగా కాపురం సాగించిన మధ్య తరగతి ఇల్లాలు ఆవిడ! అందుకే ఆవిడకి ప్రతి ఖర్చు మీద అవగాహన, నెలకి సరిపోయే సరుకుల
పట్ల ఖచ్చితమైన అంచనా ఉన్నాయి.
*****
పిల్లలు స్కూల్ నించి వచ్చి ఆడుకోవటానికి వెళ్ళే ముందు పెట్టటానికని జంతికలు, చేగోడీలు, పప్పు చెక్కలు, వేరుశనగ ఉండలు చేసి డబ్బాల్లో నిలవ పెడుతుంటుంది, కామేశ్వరమ్మగారు.
పోయిన నెలలో పరిచయం ఉన్న ఒక పేదరాలు ఇంటికి అమ్మటానికి తెచ్చిన బాదుషాలు ఒక కిలో కొని డబ్బాలో పెట్టింది. ఇక ఆ నెలలో తను వండే ఐటంస్ తగ్గించచ్చనుకుని ఒక అంచనాలో ఉన్నది.
ఒకరోజు మరిదిగారబ్బాయి పెద్దమ్మని చూసిపోవటానికి వస్తే, "అమ్మాయ్ విమలా, ఆ డబ్బాలో మొన్న రమణమ్మ దగ్గర కొన్న స్వీట్ ఉంది! చేగోడీలు, బాదుషా ఓ ప్లేట్ లో పెట్టి తీసుకురా. మల్లి వచ్చాడు. తిన్నాక టీ ఇవ్వచ్చు" అని కోడలిని కేకేశారు కామేశ్వరమ్మగారు.
విమల డబ్బా మూత తీసి చూసి, బాదుషాలు అయిపోయినట్టు గమనించి, చేగోడీలొక్కటి తెచ్చి పెట్టింది.
వచ్చిన వారి ముందు ఏమీ అనలేక, వారు వెళ్ళిపోయాక "ఏమిటే కిలో బాదుషాలు రెండు రోజుల్లో ఊది పారేశారా? మరీ "చేటూ పాటు తెలియనమ్మ మొగుడు పెళ్ళికెళ్ళిందన్నట్టు", ఇలా అయితే సంసారాలు చేసినట్టే" అని గట్టిగా అనేసరికి, "మొన్నామధ్య మా ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు కదా! అప్పుడు వాడేశానత్తయ్యా" అని చెప్పి కొడుకు తప్పుని తన మీద వేసుకుంది.
మొన్నటికి మొన్న పెరుగు గిన్నె భర్త కింద పడేసి, పెరుగంతా నేలపాలు చేసి రాత్రి భోజనాల్లోకి పెరుగు లేకుండా పిల్లలకి అన్నం పెట్టటం చూసి కామేశ్వరమ్మగారు "అదేమిటి పొద్దున్న లీటర్ పాలు తోడు పెడితే, పిల్లలకి పెరుగు లేకుండా అన్నం పెడుతున్నావు" అనడిగారు. "ఇందాక నూనె చేత్తో పట్టుకున్నానత్తయ్యా. జారి కింద పడి పెరుగంతా నేలపాలయింది" అని చెప్పింది విమల.
"ఇదిగో అమ్మాయ్, ఇతరుల తప్పులని చేష్టలని నీ మీద వేసుకుని వారిని కమ్ముకురావటం అంటే....భాగవతంలో గోపకులు తమ ఇళ్ళల్లో జరిగే తప్పులు, కృష్ణుడు చేసే లీలా విలాసాలని గుర్తించక, అవి తమవారే చేశారని అనవసరంగా తమ భుజాల మీద వేసుకునే వారుట. అత్తలు కోడళ్ళని అనుమానించటం, తిట్టటం చేసేవారట" అన్నారు.
అని భాగవతంలోని పద్యం మధురంగా పాడి విమలకి చెప్పటం మొదలు పెట్టారు.
గోపస్త్రీలందరూ యశోద ఇంటికి వెళ్ళి
"ఆడం జని వీరల పెరు( , గోడక నీ సుతుడు ద్రావి యొకయించుక తా(
ఘోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ"
[ఆటలకని బయలుదేరి నీ కొడుకు ఇదిగో వీరి ఇంట్లో పెరుగు త్రాగి పోయాడు. వెళ్ళేవాడు వెళ్ళక నిద్రపోతున్న ఇంటి కోడలి మూతికి కొద్దిగ పెరుగు అంటించి వెళ్ళిపోయాడు. దొంగ తిండి తిన్నదని పాపం కోడలిని అత్తగారు కొట్టింది.]

"వారిల్లు సొచ్చి కడవల దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ వారికివీరికిని దొడ్డవాదయ్యె సతీ!"
[మీ సుపుత్రుడు వారి ఇంట్లో చొరబడి ఘుమ ఘుమలాడే నెయ్యి త్రాగి చివరకు ఆ కడవలు వీరి ఇంట్లో పడేసి పోయాడు. దాని వల్ల వారిద్దరికి పెద్ద పోట్లాట అయింది.]
ఇలా ఇతరులు చేసిన పని కానీ, తప్పు కానీ తమ భుజాల మీద అనవసరంగా వేసుకోవటం భగవంతుడి చేష్టలకి మనం బాధ్యత వహించటం లాంటిది" అని తమ నిత్య కృత్యంలో జరిగే విషయాన్ని చక్కటి భాగవత పద్యంతో కామేశ్వరమ్మగారు వివరిస్తుండగా విని, నిశాంత్ "బామ్మా నువ్వెప్పుడూ భాగవతం చదువుతుంటావు కదా! అందులో ఇలాంటివి ఇంకేమేం పద్యాలు ఉన్నాయో నాకు కూడా చెప్పవా? నా లాగే కృష్ణుడుకూడా అల్లరి చేసేవాడా" అనడిగాడు.
"చూశారా అత్తయ్యా, నేను వాళ్ళని కమ్ముకొస్తున్నానని ఇంత చక్కటి భాగవత పద్యం ద్వారా చెప్పి, మాకందరికీ అవి నేర్చుకోవాలనే ఆసక్తి కలిగించారు. మంచే జరిగింది కదా!" అని విమల "రేపు ఇంకొన్ని పద్యాలు చెప్పండత్తయ్యా, చాలా బాగున్నాయి. నేనూ నేర్చుకుంటాను" అన్నది.
"నీకు ఈ పద్యాలు నచ్చాయా! అయితే రేపు రాత్రి నా దగ్గర పడుకున్నప్పుడు కృష్ణుడు చేసిన ఇంకొక లీల కధ లాగా చెబుతా" అని మనవడి బుగ్గలు పుణికి ముద్దు పెట్టింది.

కామెంట్‌లు