ఇలా చూడు :-- ఎం.వి. ఉమాదేవి
కొండగోగు పువ్వులలో కనువిందగు రంగు చూడు 
కొండగాలి సుళ్ళు తిరిగి జారే 
కోక కొంగు చూడు !

పిట్ట పిట్ట ముక్కుకలిపే మురిపె
మైన ఊసు చూడు
చెట్టు పుట్టా చిరుజల్లుకు ఒళ్ళు 
పులకరింత చూడు !

ఏరువాక సాగేటి యువరైతు ఆశ చూడు 
నీరు పొర్లి పారేటి యేటి అలల 
సొగసు చూడు !

ముంగిటిలో కొలువుదీరు ముగ్గులలో భవిత చూడు 
రంగులతో మెరుగులద్ధు రమణి 
లేత కరము చూడు !

తీయనైన మాటలాడు కన్నతల్లి 
మమత చూడు 
తీరు తీరు ప్రేమపంచు ఇల్లాలి 
మనసు చూడు !

శ్రమ జీవన సౌందర్యం ఎదనిండే తీరు చూడు 
శాంతి నిండి ఉమ మదిలో
కాంతిరేఖ చూడు !



కామెంట్‌లు