నాకో అలవాటుంది. అది సరిగ్గా ఎప్పుడు మొదలైందో చెప్పలేను. ఎవరైనా తెలుగు వాళ్ళు పరిచయమైతే వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించక ఇంటి పేరు అడిగేవాడిని. అలాగే ఎవరైనా పెళ్ళిపత్రికలో ఆహ్వాన పత్రికలో స్తే అందులో వధూవరుల ఇంటిపేర్లు చూస్తాను. ఆ అలవాటు ఇప్పటికీ నాకుంది. కొన్ని ఇంటిపేర్లు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. పుస్తకాలు అందులోనూ పాత పుస్తకాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఇంటి పేర్లకు సంబంధించి పుస్తకాలు ఏవైనా దొరుకుతాయేమోనని చూసేవాడిని. కొనడానికి డబ్బులు ఉన్నా లేకున్నా అలాంటి పుస్తకాలు కనిపిస్తే ఉన్న చోటనే అవి తిరగేసేవాడిని. అలా పేజీలు తిప్పుతున్నప్పుడల్లా ఓ ఆనందం. అటువంటి నాకు ఈ మధ్య టెలిగ్రామ్ యాప్ లో ఓ పుస్తకం పీడీఎఫ్ కంట పడింది. ఆ పుస్తకం పేరు తెలుగు వారి యింటి పేర్లు. తేళ్ళ సత్యవతి అనే ఆమె పిహెచ్.డి. పట్టాకోసం నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసం. ఈ పుస్తకం 1987లో ప్రథమ ముద్రణకు నోచుకుంది. జి.ఆర్. పబ్లికేషన్స్, గంటూరు వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. దాదాపు ఆరు వేల గృహ నామాలు సేకరించి వాటి పూర్వరూపం ఏదై ఉంటుందో తెలుపడానికి సత్యవతి గారు పడిన శ్రమ గమనార్హం. ప్రశంసనీయం. శాస్త్రీయంగా పరిశోధించి సమ్యగ్ దృష్టితో ఆవిష్కరించిన పుస్తకమిది. సాహిత్యంలో నిక్షిప్తమైన ఇంటి పేర్లను వెతికి వెతికి వాటిని చక్కగా విభజించి సమర్పించిన తీరు ముదావహం. వ్యవహారంలో ఉన్న తెలుగు వారి ఇంటి పేర్ల వర్గీకరణ ఆసక్తికరంగా ఉంది. గృహ నామ వివరణ పట్టిక కూడా ఇందులో ఉంది. భాషా శాస్త్రంలో పరిశోధన చేయాలనే సత్యవతి గారి ఆకాంక్షను గుర్తించిన ఆచార్య తూమాటి దోణప్పగారు తెలుగు వారి ఇంటిపేర్లను పరిశోధనాంశంగా సూచించిందే తడవుగా ఆమె బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పుస్తకంలో మొత్తం రెండు భాగాలున్నాయి. పూర్వభాగంలో ప్రవేశిక, భూమిక, భారతీయేతర భాషలలో ఇంటి పేర్లు, ఇతర భారతీయ భాషలలో ఇంటిపేర్లు,తెలుగు వారి ఇంటిపేర్లు, తెలుగు సాహిత్యంలో ఇంటిపేర్లు, వ్యవహారంలో తెలుగు వారి ఇంటిపేర్లు – వర్గీకరణ ఉన్నాయి. ఇక ఉత్తర భాగంలో గృహ నామ వివరణ పట్టిక, గృహనామ పరపద వివరణ పట్టిక ఆధార గ్రంథ సూచి ఉన్నాయి. గృహ నామల సేకరణ ఏడు విధాలుగా చేసినట్టు సత్యవతిగారు సిద్ధాంత వ్యాసం ప్రారంభంలోనే చెప్పుకున్నారు. అవి, ఓటర్ల జాబితా నుండి, గ్రంథాల నుండి, తెలుగు శాసనాల నుండి, వార్తాపత్రికల నుండి, ఉత్తరాల ద్వారా, సంభాషణ రూపంలో, వివిధ కార్యాలయాల నుండి. ఉత్తర హిందూ దేశంలో ఇంటిపేర్లన్నీ దాదాపు వృత్తిపరమైనవే అంటూ కొన్ని పేర్లు ఉదాహరించారు. పుస్తకమంతా బాగానే చదివించింది. కానీ నిరాశ తప్పలేదు. అందుకు కారణం, మా యామిజాల ఇంటిపేరు గురించి ఒక్క ముక్క కూడా కనిపించలేదు. అది తప్పిస్తే మిగిలినదంతా బాగానే ఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి