ఓలేటి వేంకట సుబ్బారావు:-- యామిజాల జగదీశ్

 ఈరోజుల్లో సామాజిక మాధ్యమాలతో ఏర్పడే పరిచయాలు అనేకం. కానీ ఆ పరిచయాల ఆయువు కాలం ఇంత అని గట్టిగా చెప్పలేం. కారణం అన్ని పరిచయాలూ సవ్యంగా సక్రమంగా సాగుతాయని రూఢీగా చెప్పలేం. నాకిది అనుభవపూర్వకమే. 
 
ఫేస్ బుక్కులో నేను చురుకుగా పోస్టులు పెడుతున్న రోజుల్లో పదుల సంఖ్యలో పరిచయమైన వారున్నారు. వారిలో కొందరిని ప్రత్యక్షంగా చూసాను కూడా. అటువంటి వారిలో ఓలేటి వేంకట సుబ్బారావుగారొకరు. 
 
వృత్తిపరంగా ఇంజనీర్ అయినప్పటికీ ఆయన ప్రవృత్తి రచనలు చేయడం. 
 
ఆయన తొలి కథ 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రిక (వారపత్రిక)లో అచ్చయింది. ఆ కథ శీర్షిక "చక్రవర్తి". ఈ కథను ఆయన కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో రాసినదే. ఇందుకు ఆయనకు ఆంధ్రపత్రికవారు ఇచ్చిన పారితోషికం అక్షరాలా ఏడు రూపాయల యాభై పైసలు. కానీ ఇక్కడో విషయం చెప్పాలి. ఆయన అవి వినియోగించు కోలేకపోయారు. ఆయన ప్యాంటు జేబులో ఆ సొమ్మునీ, మనియార్డర్ రసీదునీ పెట్టి రాత్రి పడుకుండిపోయారు. మరుసటి రోజు పొద్దున్న లేచి చూస్తే ప్యాంటు జేబులో రసీదుముక్క మాత్రమే ఉంది. ఏడున్నర రూపాయలను ఓ దొంగ కొట్టేసాడట.  ఆ డబ్బులు పోతే పోయాయి కానీ ఆయన రచనా ప్రస్థానం మాత్రం ఈరోజుకీ సాఫీగా ఉన్నతంగా సాగిపోతోంది. 
 
"మూడు పత్రికలు - ఆరు కథలు" గా ఆయన కలం నిరాటంకంగా రచనలు చేస్తూనే ఉంది.
 
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విపుల తదితర పత్రికలలో ఆయన కథలూ వ్యాసాలూ వెలువడ్డాయి. 
 
ఈ క్రమంలోనే ఆయన ఏడెనిమిదేళ్ళ నుంచి శిరాకదంబం అనే వెబ్ మ్యాగజైన్ కి "తోక లేని పిట్ట"శీర్షికన ప్రముఖ రచయితలను, కళాకారులను, విశిష్ట వ్యక్తులను పరిచయం చేస్తూ వారు రాసిన ఉత్తరాలను పాఠకలోకానికి అందిస్తున్నారు. ఈ "కాలమ్" కు విశేష ఆదరణ లభించింది. బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, చలం, కొమ్మూరి వేణుగోపాల్‌, వైణికుడు చిట్టిబాబు, వి.ఎ.కె. రంగారావు, బ్నిం, శలాఖ రఘునాథ శర్మ, శ్రీశ్రీ, దాశరథి, సి. నారాయణ రెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారుడు బుజ్జాయి, ఇలా ఎందరో ప్రముఖులతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలను ప్రస్తావిస్తూ వారి గురించి ఆసక్తికరమైన అంశాలను ఇచ్చిన "తోక లేని పిట్ట" "శిరాకదంబం" మ్యాగజైన్ కి ఓ ఆణిముత్యమని చెప్పడం అతిశయోక్తికాదు.


రచనతోపాటు చిత్రలేఖనం, సంగీతమన్నా ఎంతో ఇష్టమున్న ఆయనకు  విభిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు మిత్రులయ్యారు. వారిచ్చిన స్ఫూర్తినే ఆలంబనగా చేసుకుని తన రచనను కొనసాగిస్తున్నట్లు సుబ్బారావుగారు చెప్పుకున్నారు. 


శ్రీశ్రీ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, గుంటూరు శేషేంద్రశర్మగార్లను నవ్యాంధ్ర కవిత్రయంగా వ్యవహరించేవారన్న విషయం తంగిరాల సుబ్బారావుగారిపై ఈయన రాసిన వ్యాసంతోనే తెలిసింది నాకు.


పుదుచ్చేరిలోని శ్రీ బాలాజీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా వ్యవహరించిన డా. వేలూరు ఎ.ఆర్. శ్రీనివాసన్ గారిపై ఆయన రాసిన వ్యాసం ఎంతో బాగుంది. మద్రాస్ విశ్వవిద్యాలయ నుంచి ఎంఎస్.సి బయోకెమిస్ట్రీలో టాపర్ గా నిలిచిన శ్రీనివాసన్ గారు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువెక్కువ. నిత్యసంగీత సాధన వారికి ప్రముఖ సంగీతకారునిగా గుర్తింపు తెచ్చి పెట్టిందట. దాదాపు 800 భక్తిగీతాలను, కీర్తనలను రచించి స్వరపరచడం శ్రీనివాసన్ గారి గొప్పతనం.
 
1980 దశకంలో ఓలేటి వారు ఘంటసాలగారిపై ఓ వ్యాసం రాసి వి.ఎ.కె. రంగారావుగారికి పంపిస్తూ విజయచిత్ర మ్యాగజైన్ లో వచ్చేటట్టుగా చూడాలని కోరారు. అయితే "విఎకె" గారు విజయచిత్రలో ఆస్థాన విద్వాంసులకే అవకాశముం టుందని, కనుక మీరు ముంబైలోని స్క్రీన్ పత్రిక (ఇంగ్లీష్) కు వ్యాసాన్ని ఇంగ్లీషులో పంపండి అని సూచిస్తూ ఆ సంస్థ చిరునామా కూడా ఇచ్చారు. విఎకె గారు నిక్కచ్చి మనిషి. ముఖస్తుతికోసం మాట్లాడే వారు కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పే రంగారావుగారి సూచన మేరకే ఓలేటివారు ఘంటసాలగారిపై తాను రాసిన వ్యాసాన్ని ఇంగ్లీషులో రాసి వాసవి అనే అమ్మాయితో టైప్ చేయించి స్క్రీన్ పత్రిక సంపాదకులకు పంపారు. కొన్ని రోజులకే అది అచ్చవడమే కాక డెబ్బయ్ అయిదు రూపాయల పారితోషికం కూడా స్క్రీన్ పత్రిక యాజమాన్యం నుంచి అందుకోవడం మరచిపోలేనని అంటారు ఓలేటివారు. అనంతరం మరో నాలుగు వ్యాసాలు (సుశీల, బాపు, కె.వి. మహదేవన్, పి.బి. శ్రీనివాస్) కూడా ఆయన పంపగా వాటిని స్క్రీన్ పత్రిక ప్రచురించడం విశేషం.అదలా ఉండనిస్తే, ఆయన దగ్గర భరాగో, గొల్లపూడి మారుతీరావు, డి. కామేశ్వరి, ఘంటసాల విజయకుమార్, ఘంటసాల సావిత్రమ్మ, వి.ఎ.కె. రంగారావు, శలా రఘునాథశర్మ, వింజమూరి అనసూయ, ఇలా ఎందరో తమకు రాసిన ఉత్తరాలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వీటితో ఓ మంచి పుస్తకం వెలువరిస్తే లేఖాసాహిత్యంలో చిరస్థాయిగా ఉండిపోతుందని ఓలేటివారికి నా సూచన. ఎందుకంటే ఉత్తరాలెప్పుడూ అమూల్యమే. కారణం, ఉత్తరాలలో కల్పనలకు తావుండక అన్నీ నిజాలే ఉంటాయని నా సుస్పష్టమైన అభిప్రాయం. 
ఫోటో : వి.ఎ.కె. రంగారావుగారితో ఓలేటి వెంకట సుబ్బారావుగారు