పీవీకి పద్యాలు:-- యామిజాల జగదీశ్
మా నాన్నగారి (యామిజాల పద్మనాభస్వామిగరు) రచనలు సేకరిస్తుండగా ఈ కింది అయిదు పద్యాలు రాసుకున్న కాగితం దొరికింది. కీ.శే. పి.వి. నరసింహారావుగారు దేశ ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పుడు రాసిన పద్యాలివి. మన దేశానికి రాష్ట్రపతిగా ఉండిన శంకరదయాళ్ శర్మగారికి అప్పుడప్పుడూ ఏదో ఒకటి రాస్తూ పోస్టు చేస్తుండటం ఎరుగుదును. అలాగే పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు వధూవరులను ఆశీర్వదిస్తూ పద్యాలు రాసి అవి అచ్చేసి ఫ్రేము కట్టి కళ్యాణమంటపంలో చదివి వధూవరులకు బహుమతిగా ఇవ్వడం గుర్తే. మరి పీవీ నరసింహారావుగారికీ రాసిన ఈ పద్యాలు పోస్ట్ చేసారో లేదో తెలీదు. ఓ జ్ఞాపకం కోసం ఇవి.....
-----------------------------------
భారత ప్రధానికి బహుమతి
------------------------------------
1
శ్రీ విద్యామూర్తివిగా
ప్రావీణ్యమునందినట్టి పాలకుడవుగా
భావింపదగిన ఘనుడవు
పీ.వీ.నరసింహరాయ! పృధుగుణగేయా!
2
చక్కని పలుకుల చక్కెర
చిక్కని తీయందనమ్ము చెలగగ నొరులన్
ప్రక్కకు చేర్చుకొనెడు నీ
ఫక్కికి జే! జే! యటంచు పలికెద నెపుడున్
3
పాలనలో ఎదిరింతకు
లాలనలో సాటిగన నిలన్ నీకు బళీ!
నీలోగల ధీశక్తికి
మేలై యీ భరతభూమి మిన్నందె కదా
4
ముదుసలితనమెరుగని నీ
మదికిన్ శ్రీమాత దివ్య మానవశక్తిన్
కుదురుగ నిల్పుత సతమున్
ముదము కిరీటముగ సుజనమూర్ధన్యము గన్
5
డెబ్బది రెండవ యేటన్
నిబ్బరముగ పీఠమంది నిల్చి ధరిత్రిన్
పబ్బముగ నేలుమిదెన్
కబ్బురమగు పద్యరత్నహరముగొనుమా!


కామెంట్‌లు