శిక్ష:-- యామిజాల జగదీశ్

 మహేష్ కిందా మీదా పడి ఎట్టాగో స్కూలుకి చేరాడు. అయితే అప్పటికే గంట కొట్టడం, ప్రార్థన ముగియడం, పిల్లలందరూ తమ తమ తరగతి గదులకు వెళ్ళడం జరిగిపోయాయి. 
అయితే ఆలస్యంగా వచ్చిన ఓ ఆరేడుగురు విద్యార్థులు మాత్రం తెలుగు మాస్టారు కంట పడి మైదానంలో మోకాళ్ళపై కూర్చోవడమే కాక స్కేలుతో దెబ్బలూ తిన్నారు. ఇంకెప్పుడైనా ఆలస్యంగా వస్తారా అని హెచ్చరించిన తెలుగు మాస్టారు అటూ ఇటూ చూసి ఇంకెవరూ లేరుగా అనుకుని స్టాఫ్ రూములోకి వెళ్ళిపోయారు. 
ఇదంతా స్కూలు ప్రవేశద్వారం పక్కనుంచి చూస్తున్న స్కూల్ హెడ్మాస్టరు మహేష్ పిల్లిలా అడుగులో అడుగేస్తూ అమ్మయ్య తెలుగు మాస్టారు కంటపడలేదుగా అని మనసులో అనుకుని ఊపిరి పీల్చుకున్నారు.
ఎందుకంటే ఆలస్యంగా వచ్చిన వారెవరికైనా శిక్ష తప్పదు కదా....

కామెంట్‌లు