స్వర్గానికెలా పోవాలండి?:-- యామిజాల జగదీశ్
 అనగనగా ఓ ఆశ్రమం. ఆ ఆశ్రమానికో గురువు. ఆ గురువు పేరు గురునాథం. ఆ గురునాథం దగ్గరకు ఓరోజు సోమనాథం అనే వ్యక్తి వచ్చాడు. 
గురువుగారికి దణ్ణం పెట్టి "అయ్యా! నేను స్వర్గానికి పోవాలనుకుంటున్నాను. అందుకు దారి మీరే చెప్పాలి. ఎందుకంటే చాలా మందిని కలిసినా ఎవరూ సరిగ్గా చెప్పలేదు. మీరు చెప్పండి గురువుగారూ" అన్నాడు.
అంతట గురువు "ఏముంది దానధర్మాలు చేస్తూ రా. నువ్వు స్వర్గానికి పోతావు" అన్నారు.
"అంత సులభమా స్వామీ. అయితే ఈ రోజు నుంచే మీ మాట పాటిస్తాను" అన్నాడు సోమనాథం.
"కానివ్వు" ఆన్నారు గురువు.
సోమనాథం ఇంటికి చేరాడు. ఆరోజు నుంచి పిడికెడు బియ్యం క్రమంతప్పక ఓ యాచకుడికి ఇస్తూ వచ్చాడు. ఇలా ఓ నెల రోజులైంది. 
గురువు దగ్గరకొచ్చి "స్వామీ! మీరు చెప్పినట్లే చేస్తున్నానండి. రోజూ పిడికెడు బియ్యం ఓ యాచకుడికి ఇస్తున్నానండి. నేనీ దానంతో స్వర్గానికి చేరుకుంటానా" అని అడిగాడు.
"అలాగా" అంటూ గురువు తన తోటలోకి వెళ్ళి ఓ రావి చెట్టు కాండాన్ని గోటితో గీకసాగారు. అర గంట పైనే ఆయనలా గోటితో గీస్తూ ఉన్నారు. 
సోమనాథానికి ఏమీ బోధపడలేదు. పైగా ఆయన మీద కోపం వచ్చింది. ఏమిటీ పని అని మనసులో అనుకుని "స్వామీ మీరేం చేస్తున్నారో తెలీడం లేదండి" అని కోపాన్ని అణచుకుని వినయంగానే అడిగాడు సోమనాథం.
"ఓహో...నీకు నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదూ. ఏమీ లేదు. నేనిలా ఒకే ఒక్క వేలి గోటితో గీస్తూ గీస్తూ ఈ భారీ చెట్టుని కూల్చేస్తాను తెలుసా?" అన్నారు.
అప్పటికి గానీ సోమనాథానికి తన దాన విషయం సవ్యం కాదన్నది అర్థమైంది.
తన దగ్గరున్నదంతా దానధర్మాలు చేసేసి సోమనాథం ఆయన దగ్గర శిష్యుడిగా ఉండిపోయాడు.