యాభై, నలభై ఏండ్ల కిందట నా చిన్నతనంలో మా ఇంట్లో, రామాయంపేట పట్టణంలో నాన్న హయాంలో ఏటా జరిగే 'ఉగాది వేడుకలు' గుర్తొస్తే నాకిప్పటికీ మనసు కలుక్కుమంటుంది. కారణం, మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలలోని పరమార్థాన్ని అప్పట్లో నేను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయానే అని! 'ఉగాది' అంటే కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్పడం, ఇంకా పచ్చడి చేసుకొని తాగడం, ఇంట్లో ఇష్టమైన స్వీట్లు, హాట్లు, వంటకాలు చేసుకొని తినడం... ఇంతే అనుకునే ఈతరం వాళ్ళు ముఖ్యంగా పంచాంగ విశేషాలు, అందులో వుండే రాబోయే ఏడాది కాలంపై ఒక విశ్లేషణాత్మక, గణిత శాస్త్రీయ అవగాహన, అంచనా వంటివాటి ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.
ఇటీవల నేను మా సీతయ్య గుడి (రాజ రాజేశ్వరస్వామి దేవాలయం ) అభిషేకానికి వెళ్ళినప్పుడు, ఒక పెద్దమనిషి మా నాన్న పంచాంగ పఠనాన్ని గుర్తుకు తెచ్చుకుని బాధ పడ్డారు, "నాయన గొంతు ఖంగుమనేది". అప్పట్లో నాన్న పోరోహిత్యం ఒక పెద్ద దివిటీ. ఇంట్లో అయినా, బయట అయినా ఆయన పూర్తి శాస్త్రోక్తంగా ఉండేవారు. ఎప్పుడైనా పంచాంగ శ్రవణమే ఉగాది ప్రత్యేకం. పగలు 3.30 గంటలు అవడంతోనే నాన్న కొత్త ధోవతీ, తెల్ల లాల్చీ వంటి బుషర్ట్, పైన కండువాతో బజారుకు వెళ్లేవారు. గాంధీ విగ్రహం దగ్గరి, పెద్ద దుకాణంలో ప్రముఖ వైశ్యులు పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసేవారు. అది రెండు గంటలపాటు సాయంత్రం 6 గంటల వరకు సాగేది. జనం రోడ్డుమీది వరకు వచ్చి కూర్చుని, వినేవారు. మైకులు ఉండేవి కావు కనుక, గట్టిగా మాట్లాడవలసి వచ్చేది. ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఏడాది సంగతులు వినాలన్న శ్రద్ధ, భక్తి కొట్టొచ్చినట్టు కనిపించేది.
ఏటా అన్ని పండుగలలోకెల్లా ఉగాది పండుగే ఎంతో గొప్పగా, పెద్ద ఉత్సవంలా జరిగేది. ప్రతీ పండుగ రోజులానే, అమ్మ ఆ రోజు కూడా మబ్బుల ఏ నాల్గింటికో నిద్ర లేచేది. తలుపులన్నిటికీ తాజా మామిడి ఆకుల తోరణాలు తప్పనిసరి. పెద్దర్వాజ, కొత్త దర్వాజల ముందు వాకిళ్ళు శుభ్రం చేసి పేడనీళ్లతో చానిపి చల్లి ముగ్గులు వేయడం, తూర్పు, ఉత్తర ప్రధాన ద్వారాలతోపాటు వంటిల్లు, దేవునర్రల గడపలు కడిగి బొట్లు పెట్టడం వంటి పనులన్నీ అమ్మ ఒక్కతే చేసుకొనేది. ఆ తర్వాత వంటకోసం మడి (ప్రత్యేక వస్త్రాలు) కట్టుకొనేది. నాన్న పొద్దున్నే నిత్య అభిషేకం తర్వాత, కొత్త పంచాంగానికి పూజ చేసేవారు. శ్రీరామ నవరాత్రుల ఏర్పాట్లతో ఏ మధ్యాహ్నానికో పండుగ ప్రత్యేక పూజలు ముగిసేవి. (ఆ తరువాతే అందరి భోజనాలు). చతుషాలలోని తూర్పు ప్రధాన ద్వారం ఎదురు వరండాలో నవరాత్రుల పూజా మండపం ఏర్పాటు చేసేవారు. పక్కనే కుడివైపు గూట్లో అమ్మ దీపం వెలిగించేది. అది నవరాత్రులన్ని రోజులు రాత్రీ పగలు నిరంతరాయంగా వెలిగేలా, నూనె తగ్గకుండా అమ్మ, నాన్న చూసుకునే వారు.
నిజానికి ఉగాది ప్రత్యేకమే పంచాంగ విశేషాలను ప్రజలు తెలుసుకోవడం. అప్పట్లో వ్యవసాయమే చాలామందికి ప్రధాన వృత్తి, వ్యాపార కేంద్రీయ వ్యవస్థ కాబట్టి సిద్ధాంత వేత్తలు తమ పంచాంగాలలో తత్సంబంధ విషయాలే 99 శాతం పొందు పరిచేవారు. గాంధీ విగ్రహం దగ్గర నాన్న పంచాంగ పఠనాన్ని అప్పుడప్పుడు నేను పక్కన కూచుని వినేవాణ్ని. వర్షాలు, ఎండలు, అతివృష్టి, అనావృష్టి, పంటలు పండే తీరుతెన్నులు, వరి, మక్కజొన్న వంటి ధాన్యాల దిగుబడులలో హెచ్చుతగ్గులు, పంటలను పాడు చేసే జీవజాతుల పుట్టుక, గిట్టుకలు, సమాజంలో దోపిడీలు, దొంగతనాలు, మంచీ చెడూ వంటివన్నీ ఆయా పాళ్లలో అందరికీ అర్థమయ్యేలా విడమరిచి చెప్పేవారు. వ్యక్తిగతంగా రాశీఫలాలు, ఆదాయ వ్యయాలు, లాభ నష్టాలు, రాజపూజ్య అవమానాలు ఒక్కొక్కరికీ విడివిడిగా చెబుతున్నప్పుడు ప్రతీ ఒక్కరిలోనూ ప్రత్యేక ఆసక్తి కనపడేది.
అక్కడ్నించి మా ఇంటి ఎదురుగా వుండే ప్రసిద్ధ వైశ్య పుంగవులు, దివంగత చొల్లేటి లింగయ్య ఇంట్లో, ఆ పిమ్మట మా ఇంట్లో పంచాంగ పఠనం చేసి, ఒక్కొక్కరికీ విడివిడిగా జాతక విశేషాల అంచనాలను చెప్పేవారు. చిన్నతనంలో నేను దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇదంతా చాదస్తం అనుకున్న రోజులూ ఉన్నాయి. కాలక్రమంలో భారతీయత, సనాతన వైదిక ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన విజ్ఞానంలోని శాస్త్రీయత తెలిసి వస్తున్నది. ఈ ఉగాది శ్రీ ప్లవ నామ సంవత్సరం నా ఒళ్ళు పులకరింప జేస్తున్నది. ఎందుకంటే, 1961 నాటి కార్తీక మాసంలో ఒకానొక రోజు నాకు జన్మనిచ్చిన ఏడాది పేరు కూడా ఇదే (ప్లవ) కావడం. 60 ఏళ్ళు నిండుతున్న ఈ సందర్భం నాకు మరో జన్మ వంటిదే. ఇక నా భావి జీవితాన్ని ఇంతకు మించిన మానవీయ, శాస్త్రీయ విలువలతో వికసింప చేయడానికే ప్రయత్నిస్తాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి