నీకేం తెలుసు...!?:-....శ్రీమతి ఝాన్సీ .కొప్పిశెట్టి - ఆష్ట్రేలియా(హైదరాబాద్)

 నీకేం తెలుసు...నా మనసు?

దాని నాడుల్లో ఒదిగిన పర్వతశ్రేణులు,
దాని పేగుల్లో రగులుతున్న అగ్గికణికలు,
దాని రక్తంలో పోటెత్తుతున్న సప్తసముద్రాలు,
దాని అంతరంగ సొరంగాల్లో నిక్షిప్తమైన నిధులు,

నీకేం తెలుసు....?

నా మనసు పడే ఆక్రోశం!
జీవనంలో విచ్చిన్నమైన ప్రణయసౌధం,
ఎదపై పిడికిళ్ళతో పొడిచిన అశుభ శకునం,
దాహం తీరని తమకం,
అనుభూతికై పడే ఆరాటం
మర్మమెరుగని అంతరాళ మర్ధనం
తన అస్తిత్వానికై చేసే పోరాటం

నీకేం తెలుసు.....?

నా మనసొక భావ పరంపరల స్వరం
అంతర్లీనమైన కోటి కోరికల రణం
చంచల ఇంద్రియాలపై దాని నియంత్రణం
కట్టుబాట్లలో కట్టడి చేస్తున్న వైనం
వ్యాకరణ ఛందస్సులెరుగని భాష్యం
అభివ్యక్తికై చేస్తున్న ప్రయత్నం

గుప్పెడు మనసొక మహాప్రస్థానం!
గుప్పెట విప్పితే నగ్న సాక్షాత్కారం..!!