చెప్పుడు మాటల చెట్టు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       ఒక అడవిలో ఒ పెద్ద చెట్టు ఉండేది. 
       దాని మీద అనేక రకాల పక్షలు నివాసం ఉండేవి.
       ఆ చెట్టుకు చెప్పుడు మాటలు చెప్పే అలవాటు ఉండేది.
      "కాకీ! కాకీ!!  నీ గూట్లో కోకిల గుడ్లు పెట్టింది. పిల్లలు పుట్టగానే వాటిని పొడువు. బయటకు తరుము" అని కాకికి చెప్పేది.
       అలాగే కోకిల వద్దకు వచ్చి "కోకిలా! కోకిలా!! నీ గుడ్లను పొదిగి, బిడ్డలు పుట్టాక వాటిని  బయటకు తరమేస్తుందట.  ఆ దిక్కుమాలిన కాకి"  అని కోకిలకు చెప్పేది.
       ఇలా ఒకదాని మీద మరొకదానికి చెప్పి, వాటిలో కలహం రేపి, అవి తగాదా పడుకుంటే చూసి ఆనందించేది ఆ చెట్టు. 
       ఇది ఇలా చేయడం పక్షులన్నింటికి తెలిసింది.  
       అయినా ఏమి చేయకుండా గమ్ముగా ఉన్నాయి. 
       ఎందుకంటే అది వాటికి ఆశ్రయం ఇచ్చింది కదా?
       ఒక రోజు చెట్లు కొట్టేవాడు వచ్చాడు. 
       ఈ చెట్టును చూసి "అబ్బా! అది బలే పెద్ద చెట్టు.
       దీన్ని కొడితే చాలా కట్టెలు వస్తాయి. 
       కానీ, దీని మీద అనేక పక్షలు ఉన్నాయి.   
       వాటిని వెళ్ళగొట్టిన పాపం చుట్టు కుంటుంది.  
       అందుకే దీన్ని వదిలేద్దాం అనుకున్నాడు.
       అప్పుడే పక్షులన్నీ వచ్చాయి. 
       "అయ్య! ఈ చెట్టును వదలకండి. నరికేయండి. 
       కావలసినన్ని కట్టెలు కొట్టుకోండి. 
       పొయ్యిలో పెట్టుకోండి. 
       మేము వేరే చెట్టు మీదకు పోతాంలే" అన్నాయి. 
       పక్షలు మాటలు విని చెట్టును  నరికేశాడు.
        చెప్పుడు మాటలు చెప్పేవారిని ఎవరూ కాపాడరు. వారికి ప్రమాదాలు తప్పవు మరి.