ఏప్రిల్ ఫూల్ -- శ్రుతి మించితే (కథ) --సరికొండ శ్రీనివాసరాజు

 పృథ్వీశ 6వ తరగతి చదువుతున్నాడు. ఆరోజు ఏప్రిల్ 1 కావడంతో కనీసం 30 మందిని ఫూల్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. "అన్నయ్యా! నీ కోసం నీ మిత్రుడు సిద్ధార్థ వచ్చాడు." అన్నాడు పృథ్వీశ. నృపాల్ బయటకు వచ్చాడు. "అన్నయ్య ఏప్రిల్ ఫూల్." అన్నాడు పృథ్వీశ. అన్నయ్య ఒక దెబ్బ వేసి వెళ్ళాడు. "అమ్మా! వంటింట్లో గ్యాస్ లీకైన వాసన వస్తుంది." అన్నాడు పృథ్వీశ. అమ్మ విమల కంగారుగా వంటింట్లోకి వచ్చింది. "అమ్మా! ఏప్రిల్ ఫూల్!!"అన్నాడు పృథ్వీశ. "నాన్నా నీ బైకులో గాలి తగ్గింది." అన్నాడు పృథ్వీశ. నాన్న ధనంజయ వచ్చి చూసుకున్నాడు. నాన్న ఏప్రిల్ ఫూల్." అన్నాడు పృథ్వీశ. "పెద్ద వాళ్ళను ఫూల్ చేయవద్దురా!" మందలించాడు ధనంజయ ‌ 
       ఆరుబయట ఆడుకుంటున్నాడు పృథ్వీశ. బైక్ మీద వెళ్తున్న ఓ పెద్ద మనిషిని ఆపి, "అంకుల్! అక్కడ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు." అన్నాడు. అతడు వెనక్కి చూశాడు. "ఏప్రిల్ ఫూల్!" అన్నాడు పృథ్వీశ. "పెద్ద వాళ్ళతో ప్రవర్తించాల్సిన తీరేనా ఇది. మీ అమ్మానాన్నలు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? ఏ పాఠశాలలో చదువుతున్నావు? మీ ఉపాధ్యాయులు నీకు పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పలేదా?" అంటూ ఆపకుండా తిడుతున్నాడు ఆ పెద్ద మనిషి. చాలామంది పిల్లలు గుమిగూడి చూస్తున్నారు. పృథ్వీశ పరువు పోయింది. విమల బయటికి వచ్చి పృథ్వీశను బాగా తిట్టింది ‌ 
       ఓ రెండు గంటలు ఇంట్లో కుక్కిన పేనులా కూర్చున్నాడు పృథ్వీశ. మళ్ళీ బయటికి వచ్చి వేరే కాలనీకి వెళ్ళిపోయాడు. అతని లెక్కల మాస్టారు కనిపించాడు. "గుడ్ మార్నింగ్ సర్! మీ షర్ట్ మీద ఏమో ఉంది." అన్నాడు. మాస్టారు "ఆన్లైన్ తరగతులు వింటున్నావా పృథ్వీ!" అని అడిగాడు. వింటున్నానండీ!" అన్నాడు పృథ్వీశ. కొన్ని తేలికైన ప్రశ్నలు అడిగారు మాస్టారు. తెల్ల మొహం వేశాడు పృథ్వీశ. మాస్టారు బీభత్సంగా తిట్టారు. అతి తెలివికి పోయిన పృథ్వీశకు బయటి వాళ్ళ ముందు పరాభవం జరిగింది. అవమానంతో ఇంటికి వచ్చాడు పృథ్వీశ ‌
       "అమ్మా! నీకు ఫోన్ వస్తుంది. ఎవరో అన్ నోన్ నంబర్ నుంచి కాల్." అన్నాడు పృథ్వీశ. పైన చెట్లకు నీళ్ళు పోస్తున్న విమల ఇది నమ్మలేదు. ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. తీస్తే అమ్మ తిడుతుంది. "అమ్మా! ఆపకుండా ఎవరో ఫోన్ చేస్తున్నారు." అన్నాడు పృథ్వీశ. అమ్మ నమ్మలేదు. మళ్ళీ కిందికి వచ్చాక మిస్డ్ కాల్స్ చూసి ఫోన్ చేసింది. "ఫోన్ కాల్స్ పట్టించుకోకుండా ఏం చేస్తున్నావే తల్లీ! నేను శ్రావణిని. మీ ఇంటికే బయలుదేరాను. ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉంటే వచ్చాను. ఫంక్షన్ అయిపోయాక మీ ఇంటికి వద్దామని నీకు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చెయ్యలేదు. మీ ఇంటి చిరునామా దొరకక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళాను." అంటూ పెద్ద క్లాస్ తీసుకుంది శ్రావణి. ఆవేశంగా విమల పృథ్వీశకు దేహశుద్ధి చేసింది. నీ ఏప్రిల్ ఫూల్ మూలంగా నిజాన్ని కూడా అబద్ధం అనుకున్నా! రాక రాక ఇంటికి వస్తున్న చిన్ననాటి ప్రాణ స్నేహితురాలిని కలుసుకునే అదృష్టం నాకు లేకపోయింది." అని మొదలు పెట్టి చాలాసేపు తిట్టింది. నృపాల్ పృథ్వీశతో "నీ టార్గెట్ పూర్తి అయిందా?" అని అడిగాడు. సిగ్గుతో తల దించుకున్నాడు పృథ్వీశ.