ఏనుగు దెబ్బ: -- యామిజాల జగదీశ్

 అది దట్టమైన అడవి. ఆ అడివికి సింహమే దీర్ఘకాలంగా రాజుగా ఉంటోంది. అయినా  ఎప్పటికప్పుడు అడవిలోని జంతువులను సమావేశపరచి తానేగా ఈ అడవికి రాజునని, తనకున్న బలం మరిదేనికీ లేదని అందరితో అనిపించుకోవడం ఆ సింహం అలవాటు. నలుగురితో తానే గొప్ప అని చెప్పించుకుని మురిసిపోవడం దానికి ముచ్చట. ఆనందమూ. 
ఎప్పట్లాగే ఆ సింహం మళ్ళీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కొక్క జంతువునీ ప్రశ్నిస్తూ తానే గొప్పనని అనిపించుకుంటున్న సింహం ఏనుగునీ అడిగింది. తానే గొప్ప కదా అని ప్రశ్నించింది సింహం. 
కానీ ఏనుగు ఏమీ చెప్పలేదు.
సింహం రెండు మూడు సార్లు అడిగినా ఏనుగు మౌనంగానే ఉంది. 
దాంతో సింహానికి కోపమొచ్చింది.
"నీకేమన్నా చెవుడా? చేటంత చెవులున్నాయి. నిన్నేగా అడుగుతున్నా. చెప్పవేం జవాబు" అని కోపావేశంతో అడిగింది. 
అంతే....ఏనుగుకీ కోపం వచ్చింది. తొండంతో సింహాన్ని పైకెత్తి "ఇంకెప్పుడైనా ఈ బోడి ప్రశ్న అడుగుతావా? ఎవరు గొప్పా అని. అడవికి నిన్ను మృగరాజుగా రోజూ గుర్తించి చెప్తుండాలా? మరోసారి ఈ ప్రశ్న వేసావంటే ప్రాణం ఉండదు" అంది ఏనుగు.
సింహం బతుకుజీవుడా అనుకుని "ఏదో ఆడిగానని ఇంత కోపమా? అవుననో కాదనో చెప్తే సరిపోతుంది కానీ ఇలా తొండంతో తిప్పి పైకెత్తి భయపెట్టిస్తావా?" అని గొణిగింది.
అందుకే అంటారు పెద్దలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసుండాలని.