"జీవ వైవిధ్యం- క్లోనింగ్":-సైన్స్ కధ :-ఎం బిందుమాధవి

 "ఒరేయ్ కార్తిక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళొద్దాం రారా" అన్నాడు ఫోన్లో కిరణ్.
"జురాసిక్ పార్క్ సినిమా చూస్తున్నానురా. ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా ఏదో కొత్తదనం అనిపిస్తుందిరా. మనకి ఏదో తెలియని సందేశం ఇస్తున్నట్టుంటుంది. అదేంటంటే మన పెద్ద వాళ్ళు వారి చిన్నప్పుడు చూసినన్ని భిన్నమైన చెట్లు, కీటకాలు, జంతువులు ఇప్పుడు లేవు అంటూ ఉంటారు."
"అంటే అవి క్రమేణా అంతరించిపోయాయనే కదా అర్ధం.
"అబ్బా ఫోన్ లో ఎంత సేపు మాట్లాడుకుంటాం. ఇక్కడికి రా. మొన్న మా బాబాయి దగ్గరనించి కొన్ని పుస్తకాలు తెచ్చాను. అందులో భలే ఆసక్తికరమైన విషయాలున్నాయి. చదివి ఇద్దరం చర్చించుకోవచ్చు. శ్రీరాం గాడిని కూడా రమ్మంటాను."
"మనది ఎటూ కేంద్రీయ విద్యాలయ విధానం కాబట్టి, డిగ్రీ లో చేరటానికి మనం ఎంసెట్ ఇంజనీరింగ్, బయొలాజికల్ సైన్సెస్ కూడా అప్పియర్ అవచ్చు. మనకి ఇందులో ఆసక్తి ఉంటే మన లైన్ మార్చుకోవచ్చు కూడా!" అన్నాడు కార్తిక్.
కిరణ్ వచ్చాక ఇద్దరూ అమ్మ చేసిచ్చిన పకోడీలు తిని టీ తాగి, కార్తిక్ రూంలోకెళ్ళి కూర్చున్నారు.
ఇప్పుడు చెబుతా విను అని మొదలుపెట్టి
"మా చిన్నప్పుడు మా నాన్నగారు కడపకి దగ్గరలో ఉన్న ఆల్విన్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. అది ఒక అడవి ప్రాంతంలో కట్టిన టౌన్ షిప్. మేము అక్కడ క్వార్టర్స్ లో ఉండేవారం. సాయంత్రం అయ్యేసరికి అక్కడ పెద్ద పెద్ద మండ్రగబ్బలు, తేళ్ళు, పాములు కనిపించేవి. చీకటి పడితే చాలు కీచురాళ్ళ చప్పుడు విపరీతంగా ఉండేది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ చప్పుడు భయం వేసేది. కానీ ఇప్పుడు కీచురాళ్ళ చప్పుడే వినపడట్లేదు."
"అభివృద్ధి పేరుతో మనం అడవులు నరికేసి ఫ్యాక్టరీలు కట్టేసి, టౌన్షిప్స్ నిర్మించుకుంటూ పోతే కొన్ని రకాల చెట్లు, కీటకాలు, జంతువులు కనుమరుగైపోతాయి. అలా షుమారు 245 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివశించిన రాక్షస బల్లులు (డైనోసార్స్) సూర్యుడి నించి విరిగి పడిన ఒక పెద్ద శకలం కారణగా నశించిపోయాయి.
ఒక శిలాజంలో దొరికిన రక్తం తాగే దోమ లాంటి ఒక కీటకం శరీరంలో నించి గ్రహించిన డిఎన్ ఏ ద్వారా ప్రయోగశాలలో డైనోసార్ ని తయారు చెయ్యటమే కదా ఈ "జురాసిక్ పార్క్" సినిమా!"
"ఇలా డైనోసార్ల లాగా ఈ కాలంలో కూడా కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. అవి మన చుట్టు కనిపించినంత సేపు మనకి వాటి విలువ తెలియదు. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలో అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాల జాబితాలో మన దేశం ఒకటి అని మొన్న పేపర్ లో చదివాను. కానీ ఇక్కడ కొన్ని వన్యప్రాణులు ప్రమాదపుటంచున ఉన్నట్లు బయోడైవర్సిటీ నివేదికలు చెబుతున్నాయి."
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా, శ్రీరాం వచ్చాడు. అతనికి కూడా స్నాక్స్ ఇచ్చి తన రూం లోకి తీసుకెళ్ళాడు కార్తిక్.
మిత్రులతో మాట కలుపుతూ శ్రీరాం
"అవునురా.. అంతరించిపోతున్న జంతువుల్లో బెంగాల్‌ టైగర్‌ కూడా ఉంది. మనం శ్రీశైలం ఎక్స్కర్షన్ కి వెళ్ళేటప్పుడు "పులుల సంరక్షణ ప్రాజెక్ట్" అని చూశాం గుర్తుందా? అంటే పులుల సంతతి అనూహ్యంగా తగ్గిపోతున్నదనే కదా! కొంత మంది స్వార్ధపరులు వాటిని చంపేసి చర్మాన్ని, గోళ్ళని విదేశాలకి స్మగ్లింగ్ చేస్తున్నారు. పులులు తగ్గిపోవటానికి ఇది ఒక కారణమయితే, అడవులు కొట్టెయ్యటం ఇంకో కారణం."
"అలా సృష్టి నించి పూర్తిగా నశించిపోవటానికి సిద్ధమైన జంతువులు ముందుగా తమ పునరుత్పత్తి లక్షణాన్ని కోల్పోతాయిట. ఇక క్రమేణా సృష్టిలోనించి అవి కనుమరుగౌతాయి. ఆ పరిస్థితికి పులులు రాకూడదని వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు."
"కానీ జంతువులు అంతరించాక జాగ్రత్త పడేబదులు కొన్ని జంతువులని క్లోనింగ్ ప్రక్రియ ద్వారా వృద్ధి చెయ్యచ్చు అనే ప్రయోగాలు చేసి విజయం సాధించారు."
"ప్రపంచంలో మొదటిసారిగా స్కాట్‌లాండ్ దేశంలోని రోసిలిన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన‌ 'ఇయాన్ విల్మట్' (ఫాదర్ ఆఫ్ క్లోనింగ్) 1996లో మొదట గొర్రె పొదుగు కణాలను (Udder cell) తీసుకొని క్లోనింగ్ చేసి డాలీ అనే మొదటి 'క్షీరద గొర్రె పిల్ల' ను స్పష్టించారు. ఇది 2003లోచనిపోయింది."
"క్లోనింగ్ అనేది గ్రీక్ మాట. దాని అర్ధం రెమ్మ (branch). సహజ లైంగిక ప్రక్రియ అయిన శుక్రకణం..అండం కలయిక కాకుండా, ఒక జీవి అండం తీసుకుని దానిలోని డి ఎన్ ఏ ని తొలగించి, శరీరంలోని ఇంకొక ముఖ్యమైన భాగం నించి తీసిన "సోమాటిక్ సెల్" లోని డి ఎన్ ఏ ని ఆ అండంలోనికి ప్రవేశ పెడతారు. ఆ అండాన్ని ప్రయోగ శాలలో ఫలదీకరణం చేయించి తిరిగి తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. దీన్నే క్లోనింగ్ అంటారు.
దీనిలో ఏర్పడే పిల్లజీవి ఏ శరీర కణ కేంద్రకం నుంచి తీసుకున్నారో ఆ తల్లి జీవిని పోలి ఉంటుంది. అంటే తల్లి జీవి, పిల్ల జీవి అచ్చం ఒకేలా ఉంటాయి.
కానీ మనుషుల మీద ఇలాంటి ప్రయోగాలు చేసి క్లోనింగ్ సంతతిని వృద్ధి చెయ్యటాన్ని అమెరికా, బ్రిటన్ దేశాలు నిషేధించాయి.
* * * *
ఇలా క్లోనింగ్ చేసి జీవులని కృత్రిమంగా పుట్టించగలిగినా, అది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. ఎందుకంటే క్లోనింగ్ అనేది ప్రకృతికి విరుద్ధం. కానీ జీవులు అంతరించటం వల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బ తింటుంది కాబట్టి సహజ ప్రక్రియ ద్వారా వాటిని కాపాడే ప్రయత్నం చెయ్యాలి.
ఈ ప్రకృతిలో ప్రతిజీవి ఇంకో జీవి మీద ఆధార పడి మనుగడ సాగిస్తుంది. ఇదే జీవ వైవిధ్యం. నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటి మీద ఆధారపడే జీవులూ నశిస్తున్నాయి.
సృష్టిలోని ఏజాతి మనుగడకైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదెలు, జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి. గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తుంది. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనూహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. ఎలుకలని పట్టుకోవటానికి బోన్లు పెడితే ఫరవాలేదు కానీ, చంపటానికి విషప్రయోగాలు చేస్తే వాటితో పాటు అనేక ఇతర జీవులు చనిపోతాయి.
మానవుడు తన మనుగడ కోసం చుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం, గాలి, నీరు, రక్షణ, ఆశ్రయం నిత్యావసర వస్తువులు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి. 
వాతావరణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ జీవవైవిధ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.  
మనలాంటి యువతరం ఇలాంటి విషయాల గురించి తెలుసుకుని, మన వంతుగా పర్యావరణాన్ని, తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడకపోతే, భవిష్యత్తులో ఎన్నో వృక్ష, జంతు జాతులని పోగొట్టుకోవలసి వస్తుంది.
"వినటానికి, తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉందిరా! నేనెప్పుడూ ఇంత లోతుగా ఆలోచించలేదు! అయితే మనం ముగ్గురం డిగ్రీలో " ఎన్వైరన్ మెంటల్ సైన్స్" ఎంచుకుందాం" అనుకుని వీడ్కోలు తీసుకుని మిత్రులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు.

కామెంట్‌లు