తాడాట ఆడుదాం రండి
రెండు జట్లుగా విడిపోండి
అటు ఇటు పట్టుకొని లాగాలి
అందరి బలమెంతో చూపాలి!
గిలక బావికి చేంతాడు
జగన్నాథుని రథముకి తాడు
మంచం అల్లే నులక తాడు
చిన్ని బాబుకి మొలత్రాడు!
తాడూ బొంగరముండాలి
వీధిలో ఆట చూడాలి
తాటి చెట్టును ఎక్కాలంటే
గట్టిమోకు తాడుండాలి !
తాళ్ల పరిశ్రమ ఒకటుంది
పురికొస సన్నగా ఉంటుంది
సరుకులు పొట్లం కట్టుటకు
జనపనార ఎటో పోయింది !!
ప్లాస్టిక్ లొచ్చి పడ్డాయి
కొందరి కడుపులు కొట్టాయి
కుటీర పరిశ్రమ ఆదాయం
జ్యూట్ బ్యాగులు కొందాం!