అంతరంగం (జీవితానుభవాలు --గాడిద సవారి):- కందర్ప మూర్తి , హైదరాబాద్.

 బాల్యం గురించి ఎంత రాసినా ఇంకా ఏవో గుర్తుకు
వస్తూనే ఉంటాయి.
       నా బాల్య స్మృతులలో మరొకటి' గాడిద సవారి' కూడా
చెప్పుకో తగ్గది.తెలుగు జానపద చిత్రాలలో శ్రీ యన్.టి.రామారావు , కాంతారావు లాంటి కత్తియుద్ధ వీరులు
రంగుల గుర్రాలపై సవారి చేస్తు యుద్ధం చెయ్యడం, సినేమాలలో
చూసి మేమూ ఆలా ప్రాక్టీస్ చెయ్యాలని వెదురు బొంగులు
టిన్ షీట్ ముక్కలు వంటివి తెచ్చి శలవు దినాల్లో ప్రయత్నించే
వారం. దెబ్బలు  తగులుతాయని  ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నా
 మా ధ్యాస  ఆటల మీదే ఉండేది.
       అప్పట్లో మా ఊరు మేజర్ పంచాయతీగా ఉండేది.
ఊరి పొలిమేరల్లో నర్సయ్య పేట , రమణయ్య పేట , గాంధీ
నగర్ లాంటి పేటల్లో ఊరి జనాల బట్టలు ఉతికే చాకళ్లు ,
మంగలి కుమ్మరి వంటి చేతి వృత్తుల వారు నివాశం ఉండేవారు
   చాకళ్లు కమ్మల పాకల్లో కుటుంబాలతో ఉంటూ ఊరి ఇళ్ల మురికి బట్టలు తెచ్చుకుని వాటికి నల్ల జీడితో గుర్తులు పెట్టి
మూటలు కట్టి పెంపుడు గాడిదల వీపు మీద ఇటు అటు సర్ది
కోళ్లు, చంటి పిల్లల్ని మూటల మధ్య కూర్చో బెడతారు.
   ఆడాళ్లు మధ్యాహ్నం బువ్వ సిల్వరు గిన్నెల్లో ఉంచి గుడ్డతో
చుట్టి పెంపుడు కుక్క వెంట రాగా  ఇళ్లకు తడికలు కట్టి చాకళ్లు
సకుటుంబ సపరివార సమేతంగా ఊరి బయటీ చెరువు దగ్గరున్న చాకిరేవుకి బయలు వెల్తారు.
       అక్కడ మురికి బట్టల మూటల్ని దింపి గాడిదల్ని తిండి
కోసం ఊరి మీద వదిలేస్తారు. పాపం , అవి ఊళ్లోను  బ్రాహ్మణ
దొడ్లలో ఎంగిలి ఆకులు , దొరికింది తిని సాయంత్రం చాకిరేవుకి
వస్తే ఉతికిన బట్టల్ని ఆరిన తర్వాత మూటలు కట్టి వీపు మీద
 సర్దితే చాకలి పేటకు చేరుస్తాయి.
    అలా ఊరి మీద వదిలేసిన గాడిదలు కొన్ని మా వీధి వైపు
వచ్చేవి. అందులో చిన్నగా ఉండే గాడిదనొక దాన్ని ఎంచుకుని
మా మిత్ర బృందం చుట్టూ కాసి దాని చెవులు పట్టుకుని పెద్ద
తాడు దాని మూతికి చుట్టి ఇద్దరు చెవులు పట్టుకుని నడిపిస్తే
నడుం మీద కూర్చుని తాడు కళ్లెం మాదిరి పట్టుకుని నియమిత
దూరం వరకు సవారి చేస్తే, తర్వాత మరొకరు ఎక్కి సవారి
సరదా తీర్చుకునే వాళ్లం.
      అలా గుర్రం సవారి ముచ్చట తీర్చుకునే  సమయంలో
గాడిద మీద కూర్చునే చాన్సు నా కొచ్చింది. నేను గాడిద వీపు
మీద  కళ్లెం పట్టుకుని కూర్చున్నా. కొంతదూరం వెళ్లేసరికి ఎవరో
గాడిద ముడ్డి వెనక కర్రతో పొడిచారు. గాడిద వెనక కాళ్లతో
ఒకతాపు  తన్ని  ఒకటే  పరుగు లంకించుకుంది.
 రెండు వైపుల చెవులు పట్టుకున్న నా మిత్రులు వాటిని 
వదిలేసారు. నాకు భయమేసి  పడిపోకుండా  గాడిద మెడ
గట్టిగా పట్టుకున్నాను. అది నన్ను కింద పడెయ్యడానికి ఎంత
ప్రయత్నించినా నేను మెడ వదల లేదు. చివరికి గాడిద
దగ్గరగా ఉన్న ధాన్యం మిల్లు గోడకు రాపిడి చేస్తూ నన్ను ముళ్ల
కంచెల్లో పడేసింది.కింద పడ్డ నాకు ముణుకులు చెక్కుకు పోయి
రక్తం వచ్చింది. కాళ్లకి ముళ్లు గుచ్చుకుపోయాయి.
  ఈ లోపున నా మిత్రులు పరుగున వచ్చి నన్ను లేవదీసి
బయటకు తెచ్చారు.ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దవాళ్లు
చివాట్లు పెట్టి దెబ్బలు శుభ్రం చేసి టించర్ అయోడిన్ పెట్టారు.
 ఈ విధంగా నా గర్రపు సవారి ముచ్చట తీరింది.
                 **                 **                    **