చంద్రకు నివాళి:-- యామిజాల జగదీశ్


 యుద్ధాలు జరిగి మనుషులు చనిపోవడం సహజం. కానీ చాపకింది నీరులా ఏడాదికిపైగా మానవజాతిని వణికిస్తున్న కరోనా ఎందరిని బలి గొంటుందో తెలీదు కానీ నాకు పరిచయముండి వార్తలకెక్కిన కొందరి గురించి చదువుతుంటే బాధ వేస్తోంది. కరోనా మొదటి వేవ్ అప్పుడు నేను మాస్క్ పెట్టకునే వాడిని కాను.  భౌతిక దూరం పాటించేవాడిని కాను. దాదాపు నెలన్నరగా కరోనా రెండో వేవ్ జడలు విప్పడంతోపాటు హైకోర్టువారు మాస్క్ పెట్టుకోనివారికి వెయ్యి రూపాయల జరిమానా విధించమని ఆదేశాలు జారీ చేయడంతో పాటు కఠిన చర్యలు పాటించాలని చెప్పడంతో భయపడి ఇప్పుడు ఏదైనా పనుండి బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుంటున్నాను. భౌతిక దూరమూ పాటిస్తున్నాను. ఇదిలా ఉంటే, ఈరోజు ఉదయం తెలిసిన వార్త.... చిత్రకారుడు చంద్ర మృతి. మూడేళ్లుగా ఆయన నరాలకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతోపాటు ఆయన తాజాగా కరోనా బారిన కూడా పడి సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న మదర్‌ థెరిసా రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స కూడా పొందుతూ వచ్చారు. అయితే చికిత్స ఫలించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయనతో నాకున్న పరిచయం తక్కువే కానీ ఆయనిక లేరన్న దుర్వార్త బాధ పెట్టింది. నాకు చాలాకాలం వరకూ ఆయన లెటరింగ్ తోనూ, బొమ్మలతోనూ పరిచయం. న, స వంటి కొన్ని అక్షరాలు ఆయనలాగా రాయలాని ఆశించి అలాగే ప్రాక్టీస్ చేసేవాడిని. అలాగే ఆయన వేసిన బొమ్మలు కొన్ని చూసి వేయడాన కి ప్రయత్నించాను. అఫ్ కోర్స్ నాకు రవ్వంత కూడా చిత్రకళ అబ్బలేదు. బొమమ్లైతే వేయాలని ఆరాటముండేది కానీ తగినంత కృషి చేయలేదు. దాంతో నాకు బొమ్మలు నా వశమవలేదు. అయితే ఓ అయిదారేళ్ళ క్రితం నంబూరి రామలింగేశ్వరరావు (రాము, ఉదయం దినపత్రికలో సహోద్యోగి) ఓరోజు ఫోన్ చేసి చంద్ర ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు. నేను ఫలానా అని చెప్పాక కృష్ణ గారి అల్లుడినని చెప్పాను. అప్పుడాయన జి. కృష్ణగారేనాండి...నాకెందుకు తెలీదండి....నేను రాంనగర్ లో ఆయన ఇంటికి వచ్చేవాడినండి అంటూ కృష్ణగారితో ఆయనకున్న పరిచయం గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆ తర్వాత ఓమాను నేనొక్కడినే ఆయన ఇంటికి ఫోన్ చేసి చంద్రగారి దగ్గరకు వెళ్ళగా ఆయన వేసిన బొమ్మలు చూపించారు. ఆయన బొమ్మలు ఎలా వేయడం మొదలుపెట్టారో చెప్పుకొచ్చారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఆయన చిత్రకళా రంగంలో ఎనలేని కీర్తిప్రతిష్టలు గడించారు. కొన్ని రచనలు కూడా చేసిన చంద్రగారు సినిమాలకు ఆర్ట్ డైరెక్టరుగానూ పని చేశారు. చిత్రకళకు సంబంధించి కొన్ని వ్యాసాలుకూడా రాసిన ఆయన కవితలు రాసినట్టు ఎవరో చెప్పగా విన్నాను. కానీ ఆ కవితలు చదువుదామంటే దొరకలేదు.  ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ చంద్ర తమలాంటి ఆర్టిస్టులకెందరికో స్ఫూర్తిప్రదాత అని చెప్పారు. ఒక గొప్ప ఇలస్ట్రేటరుగా వినుతికెక్కిన చంద్ర చిత్రాలు తెలుగు సాహిత్యానికి అనుబంధంగా ఎప్పటికీ నిలిచిపోతాయనడంతో సందేహం లేదు.  
చంద్ర తనకు జరిగిన ఓ సన్మానంలో తన బాల్యం అతి నిరాడంబరంగా మొదలై చిత్ర కళారంగ పరిచయం నుంచి బాపు బొమ్మలతో సమానంగా రాణించగలగడం తన అదృష్టమన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రకు ఈ నాలుగు ముక్కలే నా నివాళి.