అంతరంగం ( జీవితానుభవాలు - కుక్క కొరుకుడు): - కందర్ప మూర్తి , హైదరాబాద్

 విధ్యార్థి దశలో  చిన్నతనం అంటే  ఆ ఆనందమే వేరు.
అక్షరాబ్యాసమై ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు
వెళ్లినా ఆ అమాయక  మనస్తత్వమే ఉంటుంది.
    హైస్కూల్ చదువు పూర్తై  కాలేజీ వాతావరణానికి వచ్చేసరికి
కొంచం వేషభాషల్లో మార్పు కనబడుతుంది. మా సమయంలో
యస్.యస్.యల్.సి (పది)పాసయిన తర్వాత ఉధ్యోగ వేట. ప్రాథమిక  పాఠశాల నుంచి  ఐదవ తరగతి పాసయి  హైస్కూల్లో  ఫస్టు ఫారం నుంచి  ఫిఫ్తు పారం వరకు చదవ వలసి వచ్చేది.
 కాలేజీ  చదువంటే వేరే  ప్రాంతానికి  పోయి చదవాల. డబ్బు ఖర్చుతో పని. అందువల్ల  అందుబాటులో ఉండే ఉధ్యోగానికి
 ప్రయత్నం జరిగేది. అవకాశం ఉంటే వృత్తి విధ్యాకోర్సుల కోసం
 ఐ.టి.ఐ , పోలీటెక్నిక్ , టీచర్ ట్రైనింగ్ కి వెళ్లేవారు.
      మా ఊరు చోడవరం తాలూకు ముఖ్య కేంద్రమైనందున ఎప్పుడూ చుట్టు పక్కల గ్రామ ప్రజల రాకతో సందడిగా ఉండేది.
 పెద్ద సబ్ పోష్టాఫీసు మనిఆర్డర్లు , రిజిస్ట్రేషన్ , కార్డులు కవర్లు
 పోష్టల్ స్టాంపుల విక్రయం, సందర్సకులు , పోస్టుమేన్ లు వచ్చిన
ఉత్తరాలపై నల్లటి స్టాంప్ గుద్దుళ్లతో సందడిగా కనబడేది.
పోస్ట్ మేన్ కాకీ రంగు యూనిఫాం నెత్తి మీద  నేతాజీ టోపీతో
ఊళ్లో వచ్చిన వారి ఉత్తరాలు మనిఆర్డర్లు ఆఫీసు లెటర్స్
 వీధుల వారిగా సర్దుకుని  కాలినడకనే వచ్చి ఇంటింటికీ అంద
చేసేవారు. అప్పట్లో ఎక్కువగా ఎడ్మినిస్ట్రేట్  పనులు ఉధ్యోగస్థుల, చందా కట్టిన వారి దినపత్రికలు వార పత్రికలు,
 విధ్యార్థుల, రచయితల , డబ్బు రవాణా అంతా తపాల శాఖ
ద్వారానే జరిగేది.  ఏదైనా అర్జంటు  సమాచారమైతే 
 కొద్ది పాటి అక్షర సముదాయంతో  టెలిగ్రామ్ సాధనంగా
 ఉండేది.
     పెద్ద స్థానిక గ్రంథాలయం  అందరికీ అందుబాటులో ఉండేది.
మేము ఇప్పుడు తెలుగు సాహిత్య రచయితలుగా ఉన్నామంటే
అప్పటి గ్రంథాలయాలే కారణం.అన్ని వయసుల వారి అభిరుచి
ప్రకారం పుస్తకాలు అందుబాటులో ఉండేవి. రక రకాల ఆంగ్ల
తెలుగు దిన పత్రికలు వార మాస పత్రికలు , పిల్లలకు చందమామ , బాలమిత్ర, బొమ్మరిల్లు , బుజ్జాయి , హాస్యోక్తుల
పుస్తకాలు చదవడానికి ఉండేవి. ఉదయం సాయంకాలం
గ్రంథాలయం తెరిచి ఉంచేవారు. డిపాజిట్ కట్టి కొందరు
పుస్తకాలు ఇంటికి తీసుకుపోయేవారు.
    బయట కూడా పుస్తకాల షాపులలో రోజు అద్దెకు తెలుగు
నవల్సు , డిటెక్టివ్ నవల్సు మేగజైన్లు దొరికేవి. వార పత్రికలలో
వచ్చే తెలుగు సీరియల్స్ కోసం మహిళలు యువతులు ఎదురు
చూసేవారు. ఊళ్లో ఎక్కడికి ఎంత దూరమైనా చెప్పులు లేకుండా
కాలినడకనే పోయేవాళ్లం.
       ఇంక పోలీసు స్టేషన్ ఎప్పుడూ దొంగలు తాగబోతులు
 భూ తగాదాలలో కొట్టుకోవడం వంటి కేసులతో కోలాహలంగా
కనబడేది. పోలీసు కానిస్టేబుల్సుకి వారి సర్వీసు నెంబరుతోనే
ఆఫీసర్ పిల్చేవారు. నెత్తి మీద ఎర్రని నిలువు చారల తురాయి
టోపీ గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కాకీ హాఫ్ నిక్కరు ఎర్ర బెల్టు , కాకీ కమీజు
 కాళ్లకి ఉలెన్ స్ట్రాపులు చుట్టి చేతిలో లాఠీ తో కానీస్టేబుళ్లు
 పరుషమైన పదజాలంతో కనబడేవారు. ఏదైనా ప్రాంతంలో
 పోలీసులు కనబడ్డారంటే అక్కడ దొంగతనమో దొమ్మీయో
 జరిగిందనుకోవాలి.
     ఇంక ఫోటో స్టూడియో కొస్తే , స్టూడియో లో ఐతే కావల్నిన
 లైటింగ్  తగిన దూరంలో బాక్స్ కెమేరా సెట్ చేసి ఫోటోలు
తీసేవారు. ఫోటో స్టూడియోలు ఒకటి రెండు మాత్రమే ఉండేవి.
 నలుపు తెలుపు ఫోటోలే తీసేవారు.
 బహిరంగ ప్రదేశాల్లో  సమూహ ఫోటోలు కుటుంబ ఫోటోలు
 సూర్య కాంతి వెలుగు మీద ఆధార పడి తీసేవారు. మూడు
కాళ్ల స్టాండు మీద బాక్సు కెమెరా బిగించి నల్లటి పెద్ద గుడ్డ
ముఖం మీద కప్పుకుని తీయబోయే ఫోటో గ్రూప్ సెట్ చేసి
 ముందే ఫ్రేములో బిగించిన నెగెటివ్(నల్లటి అద్దం)లో రెడీ
చెప్పి కెమెరా ముందున్న లెన్స్ కప్పు కొద్ది సెకెండ్లు తీసి
మళ్లా యధాస్థానంలో ఉంచేవాడు ఫోటోగ్రాఫర్. ఫోటోను
బట్టి  నల్లని గాజు పలక నెగెటివ్ గా ఉండేది. ఎన్ని కాపీలు
కావాలో ముందే చెబితే అన్ని కాపీలు అందచేసేవారు.
 ఫోటో నెగెటివ్ మనకి ఇచ్చేవారు కాదు. తారీఖు , ఫోటో
నంబరు నోట్ చేసుకుని అవుసరమైనప్పుడు ఆ వివరాలు
చెబితే డార్క్ రూమ్ నుంచి నెగెటివ్ పైకి తీసి ప్రింటు ఇచ్చే
వారు. సింగిల్ పాసు పోర్టు ఫోటోకైతే రోజులు ఆగ వలసి
వచ్చేది.
ఇప్పటిలా ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ అందరికీ అందుబాటులో
ఉండేది కాదు. డబ్బున్న వారు విదేశీ కెమేరాలకు బేటరీలతో
నడిచే ఫ్లాష్ లైట్లతో ప్రయాణాలు చారిత్రాత్మక స్థలాలు ఫోటోలు
 తీసుకునే  వారు.
   మరో చిన్ననాటి ముచ్చట మా ఊరి సినేమా హాలు.
పాత బస్టాండ్ బానయ్య కోనేరు పక్కన ఉండేది. ఊరంతటికీ
ఒకటే సినేమా హాలు.
 పేరు పూర్ణాధియేటరు. దాని యజమాని అయ్యలు శెట్టి.
ఆయన ఎవరో మాకు తెలియదు కాని ఆయన కొడుకు
 భారీ శరీరం పెద్ద పొట్టతో నల్లగా బుకింగ్ ఆఫీసు ముందు
 కూర్చునేవాడు.వెంట ఒక బొచ్చు కుక్క ఉండేది.ఆయన
బుకింగ్ మానేజరుతో టికెట్ల గురించి సంప్రదించి కబుర్లు
చెబుతూ రెండవ ఆట మొదలయే వరకు ఉండి  కలెక్షన్
చూసుకుని వెళ్లే వాడట. నేల ,బెంచి , కుర్చీ , బాల్కనీ
తరగతుల వారిగా టికెట్లు రంగుల్లో ధరలు ఉండేవి.
  చక్కటి వెంటిలేషన్ , లైటింగ్ , తరగతుల వారిగా కూర్చోడానికి సీట్లతో
చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ముందు వెనక గేట్లతో మంచి నీటి సదుపాయం
బయట హోటళ్లు టిఫిన్ సెంటర్లు సినేమా టికెట్లు అమ్మకానికి క్యు  పద్దతిలో
బుకింగ్ కౌంటరు ఏర్పాటు చేసారు.
     అప్పట్లో రాత్రి రెండు సినేమా ఆటలే నడిచేవి.ఆరు 
గంటల నుంచి ధియేటరు పైన లౌడు స్పీకరులో సినేమా
పాటలు మొదలయేవి. సినేమా టికెట్లు అమ్ముతుండగానే
 హాలులో భారత ప్రభుత్వ సమాచార శాఖ వారి న్యూస్
రీల్ వేసేవారు. అంతకు ముందు ఊరిలోని వ్యాపారస్థుల
 ఎడ్వర్టైజులు చూపేవారు. బయట సినేమా పాటలు ఆగి
పోయాయంటే అసలు సినేమా మొదలైనట్టు. పదహారు
రీళ్లతో మూడు గంటల పైన సినేమా ఉండేది. ధియేటర్లో
 వెస్ట్రైక్స్ సింగిల్ ప్రొజెక్టరైనందున నాలుగు పార్టులు చేసి
నడిపేవారు. రెండు పార్టులైన తర్వాత పెద్ద ఇంటర్వెల్ ఇస్తే
ప్రేక్షకులు బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకోవడం
 టీలు, టిఫిన్లు, కూల్ డ్రింకులు తాగి లోపలి కొచ్చేసరికి
హాలులో వ్యాపార ప్రకటనలు నడుస్తుంటాయి.చిన్న తరగతు
లకు గేట్ మేన్ ఇంటర్వెల్ పాసులు ఇస్తాడు. లోపలి కొచ్చే
టప్పుడు పాసు ఇస్తేనే లోపలికి వదిలేవాడు.
  ఫస్టు షో వదలగానే రెండవ ఆటకు టికెట్ అమ్మకం
మొదలయేది. మొత్తం రెండవ ఆట సినేమా పూర్తయేసరికి
రాత్రి పన్నెండు దాటేది. సాధారణంగా పల్లె వాసులు ,వ్యాపారస్థులు ఆఫీసర్స్ లాంటివారు సెకెండ్ షోకి వచ్చేవారు.
  నేను చెప్పే ఈ ముచ్చట్లు 1960 కి ముందువి.ఎక్కువగా
పాత సినేమాలే వచ్చేవి. సినేమా ఫిల్మ్ రోళ్లు రేకుల పెట్టెలో
ఉంచి బస్సుల ద్వారా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పంపే
వారు.రాబోయే సినేమాల వాల్ పోస్టర్లు ధియేటరు లోపల
బోర్డు మీద అంట పెట్టేవారు. సినేమా మారిందంటే సైకిల్
రిక్షాలకు  జట్కాబళ్లకు వాల్ పోస్టర్లు తడికల మీద అంటించి
 డప్పులు లేక లౌడు స్పీకర్లు పాటలతో ,ప్రింటు రంగుల కాగితాలతో ప్రచారం   చేసేవారు.
.
  నాకు బాగా జ్ఞాపకం ఉన్న సినేమా యన్. టి. రామారావు, 
సావిత్రి నటించిన పి. పుల్లయ్య గారి " వెంకటేశ్వర మహత్యం"
  సినేమా వచ్చినప్పుడు
  ధియేటరు ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు
విగ్రహం చుట్టూ పెద్ద మండపం లైట్లతో అలంకరించి సీలు
వేసిన హుండీ పెట్టారు. ఆ సినేమా బాగా ఆడింది.హుండీకి
చాలా ఆదాయం వచ్చిందట. ఆ డబ్బు తిరుపతి దేవస్థానానికి
అందచేసేరట.
  ఇంక నా కుక్క కాటుకు వస్తాను.అప్పుడు నాగేశ్వరరావు గారు
 నటించిన దేవదాసు మా పూర్ణా ధియేటర్లో నడుస్తోంది. ఒకసారి
 బెంచి టికెట్ కొని సినేమా చూడటమైంది. అందులో పాటలు
నాకు బాగా నచ్చాయి.ఆ సినేమాకు టికెట్ కొని వెళ్లిన మా
బంధువు వంట్లో బాగా లేక ఇంటర్వెల్ పాస్ తీసుకుని వచ్చేసాడు. ఎవరైన మిగతా సినిమా చూడాలంటే పాసు
తీసుకోమని చెప్పాడు. పూర్ణాధియేటరు మా ఇంటికి దగ్గరే.
నేను పాసు తీసుకుని ఆలశ్యమైందని గేటు దగ్గర పాసు ఇచ్చేసి
 పరుగున లోపలికి వెళ్లేను. ధియేటర్ యజమాని జూలు కుక్క
పరిగెడుతున్న నన్ను చూసి వెంట పడి కాలి పిక్క కరిచింది.
నేను నిక్కరు వేసుకున్నందున కాలు దానికి అందింది. వెంటనే
 యజమాని , మిగతా సిబ్బంది స్ఫందించి కుక్కను పట్టుకుని
 నాకు ఫస్టు ఎయిడ్ చేసి ఇంటికి పంపేసారు.మర్నాడు ప్రభుత్వ
హాస్పిటల్ కి వెల్తే గాయం  శుభ్రం చేసి రోజూ బొడ్డు చుట్టు
పద్నాలుగు కుక్క ఇంజెక్షన్లు చెయ్యవలసి వచ్చింది.
            
      మరికొన్ని బాల్య ముచ్చట్లు రాబోయే రోజుల్లో.
                  **                  **                  **
                
కామెంట్‌లు