నీవు నేర్పిన విద్యయే:-బిందు మాధవి
 "ఇప్పుడు ఇల్లెందుకు అమ్మటం? నాకు ఇక్కడ బాగానే ఉందిగా" అన్నాడు అమెరికా నించి వచ్చి ఇల్లు అమ్మే ప్రయత్నాల్లో పడ్డ కొడుకుతో.
"ఇంత ఇంట్లో తోడెవ్వరూ లేకుండా ఒక్కడివే ఉంటే, అర్ధరాత్రి..అపరాత్రి ఏమైనా అవసరం వస్తే ఎవరు పలుకుతారు? నాతో నిన్ను అమెరికా తీసుకెళ్ళటం కుదరదు. నీకు తెలుసు కదా...ఇద్దరం ఉద్యోగాలకి వెళితే పగలంతా అక్కడయినా ఒంటరిగా ఉండాలి. నీకు కావలసిన వంటలు, సేవలు సంధ్య చెయ్యలేదు. వృద్ధాశ్రమంలో అయితే నీ లాంటి వాళ్ళు తోడు ఉంటారు" అని రెండో ఆలోచనకి అవకాశం ఇవ్వకుండా తను అనుకున్నది చేసి వెళ్ళిపోయాడు పవన్.
******
కేంద్ర
ప్రభుత్వం
లో
పెద్ద
హోదాలో
ఉద్యోగం
చేసి
రిటైర్
అయిన
మధు
ఒక్కడే
వృద్ధాశ్రమంలో
ఉండలేక
పోతున్నాడు
.
పెద్ద
పెద్ద
ప్రభుత్వ
క్వార్టర్స్
లో
ఉన్నవాడు
చిన్న
గదిలో
ఉండాల్సి
వచ్చేసరికి
ఊపిరి
ఆడక
ఉక్కిరి
బిక్కిరి
అవుతున్నాడు
.
ఎవరో
పీక
నొక్కేస్తున్నట్లు
బాధపడుతున్నాడు
.
తన జీవితం హాయిగా గడవటానికవసరమయిన పెన్షన్ వస్తున్నది. రిటైర్ మెంట్ ముందు కొనుక్కున ఇల్లు అమ్మేసి, ఈ వృద్ధాశ్రమంలో తనని దింపి, ఇక ఈ దేశంలో నాకు ఏ లంపటాలు లేవు, వద్దు అనుకున్నట్టు కొడుకు పవన్ తన జీవితం వెతుక్కుంటూ అమెరికా వెళ్ళిపోయాడు.
రిటైర్ అవకముందే భార్య చనిపోయింది. మొదటి నించీ ఆవిడతో అనుబంధం తక్కువే! ఇంట్లో ఒక సభ్యురాలిగానే చూశాడు కానీ మనసు పంచుకునే ఆత్మీయురాలిలాగా చూడలేదు.
కొడుకు చర్య మింగుడు పడని మధు.....
"ఎంత అపురూపంగా పెంచాను వాడిని! ఎన్నడూ కోప్పడి ఎరగను. ఒక స్నేహితుడి లాగా చూశాను. వాడు ఆడింది ఆట, పాడింది పాటలాగా పెంచానే! వాడి మనసుకి నచ్చిందే చెయ్యమని ప్రోత్సహించే వాడినే! 'చావు కాలానికి లావు దు:ఖమని ' ఈ వయసులో నన్నిలా పడేసి వెళ్ళాడు....పొరపాటుఎక్కడ జరిగింది?" అనే అంతర్మధనం జరుగుతున్న వేళ... ఆలోచనలని చెదర గొడుతూ ఆశ్రమంలో ఉండే గురు మూర్తి వచ్చి, "గురువు గారూ రండి కాసేపు చెస్ ఆడదాం" అని పిలిచాడు.
"గురు మూర్తి నీతో మాట్లాడుతుంటే ఒంటరితనం తగ్గి బానే ఉంటుంది కానీ, మా అబ్బాయి ధోరణే అర్ధం కావట్లేదోయి" అన్నాడు.
"మీకు అభ్యంతరం లేకపోతే, మీ గురించి తెలుసుకోవాలనుంది సర్! కాలు చెయ్యి ఆడినంత కాలం మన లాంటి వాళ్ళకి ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది. ఒక్కోరిది ఒక్కో కధ. ఆనందంగా ఉండే వాళ్ళు కొందరయితే, ఏదో పోగొట్టుకున్న నిరాశ కొందరిది" అన్నాడు.
*****
"పవన్ ఇంకా ఎంత సేపురా నిద్ర! ఉదయం తొమ్మిదైనా లేవవు. మంచి అలవాటు కాదని ఎంత మొత్తుకున్నా నీలో మార్పు రావట్లేదు" అని ఇంటర్ చదువుతున్న కొడుకుని కుదిపి లేపే ప్రయత్నం చేసింది మా ఆవిడ అశ్విని.
"ఏ రోజూ తను ఆఫీస్ కి బయలుదేరే లోపు లేవడు. బ్రేక్ ఫాస్ట్ దగ్గరనించి, సాయంత్రం తినే స్నాక్స్ వరకు ఏ ఒక్క దానికి ప్లానింగ్ ఉండదు. తల్లి ఇంట్లో వండే పదార్ధాలకి, అతను తినే వాటికి సంబంధం ఉండదు."
"అప్పటికప్పుడు ఏమి తినాలనిపిస్తే అది దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్ళి తెచ్చుకుని సగం తిని, మిగిలినవి టేబుల్ మీద అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. రాత్రి పడుకునే ముందు తినే తిండి పరిస్థితి కూడా అదే!"
"ఏ పూటా ఆ రొంపి అంతా శుభ్రం చెయ్యటానికి అశ్వినికి గంట పడుతుంది."
"చదువుకునే పిల్లలు, అందులోనూ టీనేజ్ లో ఉండే పిల్లలు అలాగే ఉంటారు" అని పవన్ కి వత్తాసు పలికే వాడిని!"
"పవన్ చదువు, తిండి, నిద్ర వేళలు, బయట తిరుగుళ్ళు..స్నేహాలు...ఏ విషయం లోను అశ్విని ని నోరెత్తనివ్వలేదు"
"ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్ల వల్ల ఇంటర్ రెండో సంవత్సరంలో రెండు పేపర్లు మిగిలిపోయాయి పవన్ కి."
"వీడికున్న చదువు శ్రద్ధకి సైన్స్ సబ్జక్ట్స్ వద్దు అంటే విన్నారు కాదు. చూడండి ఇప్పుడేమయిందో! " అన్నది అశ్విని.
"మన రోజుల్లాగా కాదు! తరం మారింది, చదువులు మారాయి. వాడికి నచ్చినట్టు చెయ్యనీ. మనం కూడా పిల్లలని స్నేహితుల్లాగే చూడాలి కానీ, ఇరవై నాలుగ్గంటలు చదువుకో..చదువుకో అని పోరకూడదు. కొన్నాళ్ళకి వాడికే బాధ్యత తెలిసి వస్తుంది" అని పవన్ ని వెనకేసుకొచ్చి "మీ అమ్మ మాటలకేం కానీ ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఏవో పిచ్చి వ్రాతలు వ్రాస్తూ రచనా వ్యాసంగం చేస్తుంటుంది కదా, అందుకే అలా ఆదర్శాలు మాట్లాడుతుంది" అని కొడుకు ముందు తల్లిని తీసి పారేసి మాట్లాడాను.
ఇలా అన్నిటికి తండ్రి తనకి వత్తాసు పలుకుతూ, తల్లిని తీసి పారేసి మాట్లాడుతూ ఉండటం వల్ల తల్లీ కొడుకుల మధ్య ఉండాల్సినంత అనుబంధం లేక దూరం పెరిగింది.
"ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ రెణ్ణెల్లు గాలి తిరుగుడు తిరిగాడు. తోటి ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ లోను, ఇతర కోర్సుల్లోను చేరేసరికి తోడు లేని పవన్ తోచక కోచింగ్ సెంటర్ లో చేరి సీరియస్ గా కోచింగ్ తీసుకుని మంచి మార్కులతో పాస్ అయ్యాడు."
"ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా ఎమ్మెస్ చెయ్యటానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో హైదరాబాద్ లో జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ లో తల్లి చనిపోయింది. ముందు నించీ ఆమెతో పెద్దగా అనుబంధం లేకపోవటం వల్ల అతనికి పెద్ద తేడా కానీ, తల్లి లేనివెలితి కానీ తెలియలేదు."
******
మధు తన గతమంతా దాచకుండా చెప్పి "అవునులే నేనే కదా చిన్నప్పటి నించీ నీకు నచ్చినట్టు చెయ్యి అని పవన్ కి మార్గదర్శనం చేసింది. ఇప్పుడు నా పాఠం నాకే అప్పచెప్పాడు" అన్నాడు మధు.
"అవును సర్! మీరు చెప్పిన దాని ప్రకారం నీకు నచ్చిందే చెయ్యి అనే స్వేచ్ఛ చిన్నప్పటి నించీ మీరిచ్చినదే! ఎంతో అనుబంధం, ఆత్మీయత ఉన్న కుటుంబాల్లోనే పిల్లలు పెద్దయ్యాక వారి జీవన సరళిలో పెద్దలని ఇముడ్చుకోలేక వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మీ అబ్బాయి విషయం లో....ఏ కట్టుబాటు, సెంటి మెంట్ లేకుండా పెరిగినప్పుడు అంతకంటే ఎక్కువేం ఆశిస్తాం సర్? మేమే మీ వాళ్ళనుకోండి. ఎవరితో ఉంటే వారే ఆత్మీయులు! మీకున్న విషయ పరిజ్ఞానాన్ని మాకందరికీ పంచండి" అని "అన్నట్టు చెప్పటం మర్చిపోయాను సర్...రేపాదివారం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుట. అందరికీ చెప్పమన్నారు. మ్యూజికల్ చెయిర్స్, పాటలు, నాటికలు ఉన్నాయిట. సరదాగా పేరిద్దాం రండి" అని చనువుగా చెయ్యి పుచ్చుకుని ఆఫీస్ రూం కి తీసుకెళ్ళాడు.