చారల- చీర ,-ప్రహసనం ..!!:- ---శ్యామ్ కుమార్ నిజామాబాద్.


 ఒకసారి మా బాబాయి ఉద్యోగరీత్యా ఏదో ఊరికి వెళ్లి అక్కడి నుంచి ఒక చీర తీసుకుని వచ్చి, మా పిన్ని కి ఇచ్చారు. దాన్ని మా పిన్ని చేతుల లో పెట్టి చాలా గర్వంగా నవ్వుతూ" నీకే" అన్నారు.  ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసిన పిన్నికి మొహంలో నవ్వు లేకుండా పోయింది. "ఎవరు సెలెక్ట్ చేసింది - ఈ చీర , మీరేనా ?"అంది.  అది తెల్ల చీర, దానిమీద కాఫీ రంగు లో నిలువుగా అడ్డంగా వెడల్పాటి గీతలు ఉన్నాయి.  ఆ డిజైన్ కాస్త ,మడత మంచాలకు , ఈజీ చైర్ లకు వేసే బట్టలకు ఉండే 

 డిజైన్ లాగా అనిపించింది. మా పిన్ని దాని గురించి విమర్శలు మొదలు పెట్టింది." అసలు సెలెక్షన్ తెలియని మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు? అంది. "అయినా ఇటువంటి చీర తీస్తారా? అసలు దాని ధర ఎంత? అంది.   మా బాబాయి మొహంలో నవ్వు  మాయమై పోయింది.  సీరియస్ గా వెళ్లి ,ఈజీ చైర్ లో కూలబడ్డారు. ఇంకా మా పిన్ని దాని గురించి రకరకాల విమర్శలు  కురిపించడం మొదలుపెట్టింది. మా బాబాయి కళ్ళు మూసుకొని , దవడలు బిగించి కూర్చున్నారు.  కాసేపటి తర్వాత  ఉన్నట్టుండి లేచి, కత్తెర తీసుకుని పరపర  కోయడం మొదలుపెట్టారు. మా పిన్ని లేచి పరిగెత్తుకు వచ్చే లోపల కోయడం అయిపోయింది. ఇక' పరిస్థితి చాలా తీవ్రంగా తీవ్రంగ ఉంది' అని నేను వేరే రూం లో కి వెళ్ళిపోయాను. ఉదయాన్నే లేచి చూస్తే, ఇద్దరు హాయిగా యుద్ధ- విరమణ చేసి సంతోషంగా ఉన్నారు.  మా పిన్ని ని అడిగాను "ఇంతకీ  బాబాయి ఏమన్నారు? "అని. అప్పుడు పిన్ని నవ్వి ,"ఆ ..ఏముంది అప్పుడప్పుడు అలానే చేస్తూ ఉంటారు" అంది.   ఆ చీర ముక్కలు  అడ్డ పంచలు గా వాడుకున్నారు అనుకోండి! అది  వేరే సంగతి. నాక్కూడా ఒకటి ఇచ్చారు సరదాగా- వాడుకోమని..గతం గొప్పది సుమా!


కామెంట్‌లు