చీకట్లను చీల్చే వెలుగు:--ఆచార్య మాడభూషి శ్రీధర్, పూర్వ కేంద్ర సమాచార కమీషనర్("ఆస్వాదన"..... అతి త్వరలో పుస్తాకావిష్కరణ )

 వనంజ్వాలా నరసింహారావు గారు మరో పెద్ద పని చేశారు. కవిత్రయం రచించిన, తెలుగులో ఆదికావ్యమయిన ఆంధ్రమహాభారతంలోని మూల కథను, చిన్న కథలుగా, మన వాడుక మాటల్లో సులువుగా చదువుకునే రీతిలో మళ్లీ రచించి మన ముందుంచారు.  

మహాభారతాన్ని పంచమ వేదం అంటారు, అంటే నాలుగువేదాల్లో ఉన్న సూత్రాలకు ఇది కథా రూపం. నియమాలు సిద్దాంతాలుగా ఉన్న మౌలిక సూత్రాలను ఉదాహరణలు లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. అసలు సాధ్యం కాదు. ఇదివరకు చందమామ, బాలమిత్ర అనే పిల్లల పుస్తకాలలో భారత కథలు చదివి భారతం తెలుసునని మనం అనుకుంటున్నాం. నన్నయ తిక్కన ఎర్రన అనే ముగ్గురు రాసిన గ్రంధాన్ని చదివితే తప్ప మనకు ఏమీ తెలియదని అర్థం కాదు. 
అయితే ఈ కవిత్రయ భారతానికి మూలమైన సంస్కృత మహాభారతం అనే వ్యాస రచన చదవని వారికి అసలు కథలోని కీలకమైన అంశాలపైన అవగాహన రాదు. కవిత్రయం చేసిన మార్పులగురించి కూడా తెలియదు. మన తరానికి కనీసం చందమామ మాసపత్రిక జ్ఞానమైనా ఉంది. ఆ తరువాత కొన్ని తరాల పాటు సినిమాల ద్వారా భారత కథలు అందరికీ పరిచితమైనాయి. అనేకానేక సినిమాలు మహా భారతంలోని విభిన్న ఘట్టాలను దృశ్యకావ్యాలుగా మలిచినవే. ఎన్ టి రామారావు, ఎస్ వి రంగారావు వంటి మహామహులైన నటులు, కెవి రెడ్డి వంటి దర్శక శ్రేష్ఠులు ఉండడం వల్ల భారత కథలు తెలుగు వారికి బాగానే తెలిసాయి. అయితే అవే ఘట్టాలపై మళ్లీ సినిమాలు తీసినప్పుడు సొంత మార్పులు చేర్పులు చేయడం వల్ల అసలు కథ ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయి సినీ రచయితల కల్పనలే అసలు కథలనుకునే పరిస్థితి వచ్చింది. అసలు కథ ఏమిటో తెలియాలంటే ముగ్గురు కవుల తొలి తెలుగు కావ్యమైనా చదవాలి, లేకపోతే, వనం జ్వాలా వంటి అనువక్తల ఆస్వాదన రచనల ద్వారానైనా తెలుసుకోవాలి.  
పుల్లెల శ్రీరామచంద్రుడు మూల సంస్కృత రామాయణ భారత కావ్యాలకు సంక్షిప్త అనువాదాలు మనకు రచించి ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు. అవి కూడా చదవడం కష్టమనుకునే వారి కోసం యువతరం కోసం, అంతగా సమయం లేని నవతరం కోసం వనం జ్వాలా వారి ఈ రచన ఆ మహాకావ్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. విచిత్రమేమంటే రామాయణ మహాభారతాల పైన సమగ్ర అవగాహన లేకుండా, కొందరు రాసిన అనేకానేక స్వకపోల కల్పనలతో కూడిన, నిందా గ్రంధాలు పుస్తకాల మార్కెట్ లోకి వచ్చి అవే నిజమనే భ్రమలు కలిగించాయి. వాటిని ఖండించి అసలు భారతంలోని  అంశాలు తెలియజేసే రచనలు అంతగా జనంలోకి రాలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు దర్శకులు సినిమాలు తీసినట్టే ఎవరి బుర్రకు తట్టిన భావాలకు వారు పుస్తకాలుగా రాసి పడేశారు. 
వనం జ్వాలా నరసింహారావు కేవలం తెలుగు మహాభారత కావ్యాన్ని మాత్రమే అనుసరించి, అవే కథలు మామూలుగా మళ్లీ చెప్పారు. ఆయన ఆమాటే అంటూ ఉంటారు కూడా.  ఆయన ఇంకా ఏ ప్రచురణను (తితిదే వారి) అనుసరించారో కూడా తెలియజేశారు.  వారి సొంతవూరు, ముత్తారం (వనం వారి కృష్ణాపురం) గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా రామాలయంలోని శ్రీ కృష్ణమూర్తి విగ్రహం, జనగామ ఆశ్వరావు పల్లి గ్రామంలోని శ్రీ గుప్త ప్రసన్న భక్త ఆంజనేయ ఆలయంలోని రాముల వారు, ఆంజనేయ  చిత్రాల్ని ప్రేమతో ఈ పుస్తకంలో చేర్చారు.  
 మా నాన్న ఎంఎస్ ఆచార్యగారు తరచు ‘‘నిండు మనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యము’’ అనే నన్నయ పద్యాన్ని తలచుకునే వారు. మాకు చెప్పేవారు. మానాన్నగారి ఆగ్రహం, అంతలో ప్రేమ, చూసినప్పుడల్లా ఈ పద్యం గుర్తు చేసుకునే వారిమి. కాని ఆ పద్యం నన్నయ్య ఎవరితో ఎవరికి చెప్పించారో తెలియదు. వనం జ్వాలా పుస్తకం తొలి పుటల్లోనే ఈ సంగతి తెలిసి పోయింది. కచ దేవయానుల కథ, దుష్యంత శకుంతల వృత్తాంతాలలో ఉన్న కడు రమ్యమైన పద్యాలు మధ్య మధ్య మనకు అందించారు. దివాకర్ల వెంకటావధాని వాటి గురించి చెప్పిన మాటలూ వివరించారు.  కర్ణుని రంగ ప్రవేశం, ద్రౌపది స్వయంవర ఘట్టం, శిశుపాల వధ వంటి కథలు అద్భుతంగా అనిపిస్తాయి. పాపపు జూదంలో ఓడి అడవులకు వెళ్లే ముందు ఇంద్ర ప్రస్థంలో 23 సంవత్సరాలు రాజ్యం చేసారని, నారాయణుడు వేయి మహాయుగాల దాకా వటపత్రశాయిలోఉండి యోగనిద్ర చేస్తాడనే రహస్యాలు ఎన్నో తెలుస్తాయి ఈ పుస్తకం లో.  
చెడు ప్రవర్తన ఉంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా అధముడవుతాడు. సత్యం పలికే ధర్మాత్ముడు శూద్రకులంలో పుట్టినా సద్బ్రాహ్మణుడే అవుతాడు అని, మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు,  సద్బ్రాహ్మణుడినని అనుకునే కౌశికుడికి వివరిస్తాడు. వ్యక్తిగతధర్మ నిర్వహణ ద్వారా, తల్లిదండ్రులసేవ ద్వారా జ్ఞానాన్ని సంపాదించే వివరాలు చెబుతాడు. మహాభారతంలో రామాయణం కూడా ఉందని తెలియదు. మార్కండేయుడు రామాయణ కథను, సత్యవంతుడు సావిత్రి కథను ధర్మరాజుకు వివరిస్తాడు.  
శ్రీకృష్ణుని రాయబార ఘట్ఠాన్ని కీలకమైన అంశాలు విడిచిపెట్టకుండా అందించారు. కర్ణుడికి కృష్ణుడికి, కుంతికి కర్ణుడికి మధ్య జరిగిన సంభాషణను కవులు, రచయతలు, నాటక కర్తలు, సినీదర్శకులు రకరకాలుగా అన్వయించి ఏవేవో చేర్చి మార్చిపడేశారు.  ఈ పుస్తకంలో వారి మధ్య జరిగిన అసలు సంభాషణ ఏమిటో తెలుసుకోవచ్చు. కుంతితో కర్ణుడి సంభాషణ ప్రేమాప్యాయతలతో ముగుస్తుందని తెలుస్తుంది.  యుద్ధం వివరించే అనేక పర్వాలను, మూల సూత్రాలతో సహా సక్రమంగా ప్రస్తావించారు. 
శాంతి పర్వం, అనుశాసనిక పర్వం రాజనీతికి నిలయాలు. ఈ పర్వాలలో భీష్ముడు ధర్మరాజుకు బోధించిన రాజధర్మాలు పాలనా సూత్రాలను సంక్షిప్తంగా రచయిత మనకు అందించారు. పాపాలన్నింటికీ మూలం పేరాశ అనీ, ఇంద్రియనిగ్రహం ఉత్తమ ధర్మం అనీ, మృదువైన నడవడి అవసరమనీ, పాపపుణ్యాలను నరుడిని వదలవనీ, సృష్టి అంతా పంచభూతాలతో కూడుకున్నదే అని, ప్రజ్ఞ జీవితంలో అన్నింటికీ కారణమవుతుందని, సుఖ దుఃఖాలు-రాగద్వేషాలు అనే జీవన వ్యాపారాలన్నీ ప్రజ్ఞ వల్లనే వస్తాయని భీష్యుడు వివరిస్తాడు.  సత్యాన్ని ఆచరించడమే తపస్సు అనీ, అసత్యమే అశాంతి, నరకం, దుఃఖం అనీ, లోకం నిలిచి ఉండడానికి కారణం కూడా సత్యమే అని వివరించాడు. భీష్ముడు చెప్పిన మానవ నడవడిక సూత్రాలను తెలుసుకోవడానికి జ్వాలా నరసింహారావు పుస్తకం ఉపకరిస్తుంది.
ఒరులేమేమి యొనర్చిన
నరవర అప్రియము తన మనంబునకగు తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్
అని తిక్కన తన పద్యంలో భీష్ముడి నీతి న్యాయశాస్త్రాల సారాంశాన్నిఇమిడ్చారు. ఆంధ్రపత్రిక దినపత్రిక సంపాదకీయం పైన ప్రతిరోజూ ఈ పద్యాన్ని ప్రచురించే వారు.  మీకు ఇతరులు ఏం చేస్తే నచ్చదో ఆ పనులు మీరు ఇతరులపట్ల చేయకూడదనే సూత్రం.  దీన్నే ఇంగ్లీష్ లో గోల్డెన్ రూల్  లా అంటారు. న్యాయశాస్త్రానికి ఇది మూలం. మిగతా అంతా వ్యాఖ్యానమే అంటారు. 
కవిత్రయ పద్య శిల్పాన్ని, కవితా వైభవాన్ని గురించి సాహితీ వేత్తల విశ్లేషణను కూడా అడపాదడపా ప్రస్తావించారు. విరాట పర్వంలో తిక్కన పద్యాల సొగసును వివరిస్తారు. కనుక తెలుగు సాహిత్యం చదువుకునే విద్యార్థులకు ఈ పుస్తకం కరదీపికగా ఉపయోగపడుతుంది. 
లక్ష శ్లోకాలతో విస్తృతంగా ఉన్న సంస్కృత మహాభారతాన్ని ఆ భాష తెలియకుండా చదవడం కష్టం. అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. జయం పేరుతో వ్యాసుడు రచించిన  పంచమవేదమైన మహా భారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు మహాకవులు నన్నయ్య, తిక్కన, ఎర్రనల నాటి గ్రాంధికమైన తెలుగును అనువాద సహాయం లేకుండా చదివి కావ్య స్వారస్యాన్ని గ్రహించడం ఇంకా కష్టం. కవిత్రయ విరచిత భారతాన్ని మాత్రమే సంక్షిప్తీకరించి, సులువుగా మహా భారత సంగ్రహాన్ని చదువరులు తెలుసుకోవడానికి ఉపయోగపడే మహత్కార్యం నిర్వహించిన జ్వాలా అభినందనీయుడు.  
మహాభారతం అంటే దాయాదుల కుట్రలు, యుద్ధాలు, కోట్లాది మరణాలు మాత్రమే అనే భావం చాలా మందికి ఉంది.  పూర్తిగా చదవని వారు, చదవలేని వారు, చదవకలిగినా ఆసక్తిలేని వారు, సమయం లేదనే వారు 90 పాళ్ల మంది.  ఈ పుస్తకం చదివితే వారందరికీ తెలియని దేమిటో అవగతమవుతుంది. 
తెలుసుకోవలసింది చాలా ఉందనే తెలివి ఎవరికైనా వస్తే, అసలు పుస్తకాలు చదవడానికి స్ఫూర్తి లభింపజేసే పుస్తకం ఇది. యుద్ధాలు కురుక్షేత్రంలోనే మాత్రం జరగడం లేదు. ప్రతి మనిషిలో, మనసులో, కుటుంబంలో, గ్రామంలో దేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సంఘర్షణలన్నీ మహాభారతాలే. ‘‘మానవజీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం, నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే’’ అని శ్రీ శ్రీ రాసిన పాట గుర్తుకు వస్తుంది. కురుక్షేత్రం సినిమాకు యుద్దగీతంగా ఈ పాటను అద్భుతంగా రచించారాయన. 
మహాభారతం అంటే యుద్ధగాధ కాదు. మంచీ చెడులను వివరించే మానవజీవన సంఘర్షణగాధ, పక్కన భగవంతుడున్నా గుర్తించని అజ్ఞాన తిమిరాంధకారం కథ, ఎంత చెప్పినా మంచి అర్థం కాని మూఢుల ఉదాహరణ కథ, పరోపకారం కోసం, ఇచ్చిన మాట కోసం, భీషణ ప్రతిజ్ఞల కోసం జీవనాన్ని త్యాగం చేసిన పోరాట వీరుల గాధ. జ్ఞానాజ్ఞానాల మధ్య భీషణ సమరం మహాభారతం. ఆ చీకట్లను చీల్చుకుంటూ వెళ్లడానికి ఉపకరించే వెలుగు ధార మహాభారతం. 
చదివి తీరాల్సిన పదాలలో, తెలుసుకుని తీరాల్సిన కథలు ఈ మహాభారత కథలు. చదివితే తెలుస్తుంది. మీరు మొదలు పెట్టండి, అదే చివరిదాకా చదివిస్తుంది.

కామెంట్‌లు