నేనే పుస్తకమైతే:--లక్ష్మీ పద్మజ.దుగ్గరాజు.-హైదరాబాద్(నాగార్జున సాగర్)

 పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు 
వయో వర్గ లింగ భేదం లేకుండా ధరించే 
ఆభరణం.. 

మరో జన్మంటూ ఉంటే..  నే పుస్తకమై పుడతా 
ఉన్నత శిఖరాలధిరోహించడానికి 
ఓ నిచ్చెననౌతా 

ఒంటరితనంలో అద్భుత నేస్తాన్నవుతా 
విచారంలో వినోదాన్నందిస్తా 
పుస్తకం ఓ అద్భుతశక్తి రూపం అని నిరూపిస్తా 
ఓ అనిర్వచనీయమైన బాండాగారమని రుజువుచేస్తా 

ఎన్నటికీ తరగని గని నేనే 
సంస్కృతిని తెలిపే నిలువుటద్దం నేనే 
సంస్కారాన్ని నేర్పే ఉత్తమ గురువుని నేనే 
చరితను తెలిపే విజ్ఞానఖని నేనే 
తరతరాలకు ఆస్తిని నేనే 

ఎందరో మహామహుల ఆలోచనలకు 
అక్షర రూపాన్నవుతా 
డైరీ పేజీల్లో గత స్మృతుల విపంచినౌతా 
మరో భగవద్గీతనై విశ్వాన్నే శాసిస్తా....