ఎక్కడి కెళ్లినా పుట్టిన ఊరిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు విధ్యాబుద్ధులు నేర్పిన గురువుల్నీ
మరువ వద్దంటారు విజ్ఞులు.
అమ్మా నాన్నా జన్మనిచ్చినా లోకజ్ఞానంతో తీర్చి దిద్దేది
గురువులు.
నేను కూడా అందరిలాగే బ్రతుకు తెరువు కోసం
ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని భవిష్యత్తు జీవితం
సాగించాలనుకున్నాను.
ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి
జరుగుతుంది.నేను నా S.S.L.C హైస్కూలు (1962)
తర్వాత PUC కోసం అనకాపల్లి AMAL కాలేజీలో చేరిన
తర్వాత పోలీటెక్నిక్ కోర్సుకి ధరఖాస్తు చేస్తే విశాఖపట్నం
పోలీటెక్నిక్ ఇన్సిస్ట్యూట్ లో సీటు వచ్చింది.
అనకాపల్లి ఆర్ట్స్ కాలేజీ వదిలి వైజాగ్ పోలీటెక్నిక్
ఇన్సిస్ట్యూట్ లో జాయిన్ అయి కంచరపాలెంలో ఇల్లు
అద్దెకు తీసుకుని ముగ్గురం కలిసి ఉంటూ ఫుల్ కేరేజీ మీల్సు
తెప్పించుకునే వారిమి. నాది ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఐతే మిగతా
ఇద్దరిదీ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. కోర్సులు వేరు, సిలబసు
వేరుగా ఉండేది. మొదటి సంవత్సరం బేసిక్స్ అందరికీ కామన్
సిలబస్ నడిచేది. మూడు సంవత్సరాల డిప్లమో కోర్సులో
రెండవ సంవత్సరం నుంచి అసలు సిలబసు మొదలయేది.
ఎపరెంట్ షిప్ తర్వాత డిప్లమో లభించేది.
అప్పట్లో మా పోలీటెక్నిక్ ఇన్సిస్ట్యూట్ మాధవదార స్టాపు
నుంచి ఒక కిలోమీటరు దూరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన
తాటి తోపులో ఉండేది.
నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం
సగం కోర్సు పూర్తయింది(1965). అప్పుడే మన పొరుగు దేశం
పాకిస్థాన్ భారతదేశ సరిహద్దుల్లో భూమి దురాక్రమణకు
తలపడటంతో యుద్ధం ప్రకటించి దేశం అంతా అత్యవసర
పరిస్థితులు అమలు పరిచారు.అప్పట్లో దేశ ప్రధానిగా
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉండి దేశ ప్రజలు మన
రక్షణ దళాలకు అండగా ధన వస్తువుల్ని విరాళం ఇవ్వ
వల్సిందిగా రేడియో లలో విజ్ఞప్తి చేస్తున్నారు.
దేశమంతా ప్రభావితమైంది. సినీ కళాకారులు, మహిళా
సంఘాలు వ్యాపారవేత్తలు ఉధ్యోగులు ఇలా అందరూ
తమకు వీలైనంత సహాయం దేశ రక్షణ దళాలకు విరాళాలు
సేకరించి ప్రధానమంత్రికి పంపుతున్నారు.
అప్పట్లో ఇన్ని ప్రసార సాధనాలు అందుబాటులో ఉండేవి
కావు.ఆకాశవాణి ప్రసారాలు రేడియో ట్రాన్సిస్టర్లో వినేవారిమి.
అన్ని భాషల వార్తాపత్రికల్లోయుద్ధవార్తలు, రాజకీయ నాయకుల
సంఘ సేవకుల సందేశాలు ప్రచురణ జరిగేవి.
రేడియోలలో ప్రధానమంత్రి యువతను రక్షణ దళాలలో
ప్రవేసించి ఈ ఆపత్ సమయంలో దేశాన్ని రక్షించాలనే విజ్ఞప్తి, ఉత్తేజ దేశభక్తి గీతాలు , సినేమా పాటలు రోజంతా వినిపించేవి.
రేడియో లో వచ్చే ప్రధానమంత్రి గారి యువతకు విజ్ఞప్తి
సందేశం , ఉత్తేజ పాటలు వింటుంటే ఈ విపత్కర పరిస్థితుల్లో
నా వంతు దేశసేవ చెయ్యాలని నిశ్చయానికొచ్చాను. నా సహచర మిత్రుల్ని అడిగితే వారు అంగీకరించ లేదు.ఇంట్లో
చెబితే ఒప్పుకోరని తెలుసు. నా SSLC హైస్కూలు సర్టిఫికేట్
నా వద్దే దాచి ఉంచాను.
ఒకరోజు నా చదువు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకుని
రిక్రూటింగ్ ఆఫీసుకి చేరుకున్నాను. నాలాగే చాలమంది యువత వరసలు కట్టి సైన్యంలో చేరడానికి ఉత్సాహం
చూపుతున్నారు.ముందుగా శరీర దారుడ్యం ఎత్తు బరువు శరీర
అవయవ పరీక్షలు , తల నుంచి కాలి గోరు వరకూ క్షుణ్ణంగా
డాక్టరు పరీక్షలు చేసి ఫిట్ అన్న తర్వాత మేధస్సు రాత పరీక్షలు
అనంతరం వారి చదువును బట్టి కేటగిరీలుగా విభజించి డాక్యుమెంట్లు తయారు చేసి దేశంలోని మిలిటరీ ట్రైనింగ్
సెంటర్లకు పంపుతున్నారు.
* * *
(తరువాతి ముచ్చట మరోసారి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి