నేను హై స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న రోజులు. అంతకు ముందు సంవత్సరం గర్ల్ స్ - స్కూల్లో చదివాను. మా హెడ్ మిస్సెస్
పేరు విజయం జాన్ , మా ఇంటి వెనకాల ఉండే వారు. నన్ను మొదటి తరగతి నుంచి తన వెంబడి స్కూల్ కు తీసుకు వెళ్లేవారు .
కాస్త చామనఛాయ లో పెద్ద కళ్ళు వేసుకుని గంభీరంగా ఉండేది ,మంచి మాటకారి కూడా, అయితే మా కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మా స్కూల్ లో తాను అంటే అందరికీ టెర్రర్ .తన కి ఉన్న ఇద్దరు కూతుళ్లు నాకు మంచి స్నేహితురాళ్ళు. నేను ,శర్మ ,సుధాకర్, కరుణాకర్, వినోద్ కుమార్ ,అందరం కలిసి- ఆడుకునే వాళ్ళం .
నేను క్లాసులో అన్నిటా ముందుండే వాడిని గాని లెక్కలు అంటే చచ్చేంత భయం. మా లెక్కల టీచర్ పేరు బుచ్చమ్మ. ఆవిడ వస్తుంది క్లాసు మొదలవుతుంది అంటే ,ఎక్కడలేని నీరసం, భయం. ఎందుకోగానీ లెక్కల క్లాసు మొదలవగానే నా బుర్ర పనిచేయడం మానే సే ది. ఒక క్లాసు అయిపోయిన తర్వాత క్లాసు మొదలుపెట్టడానికి బెల్ కొట్టేవారు, ఈ టీచర్ వెళ్లి ఆ.. టీచర్ వచ్చే లోపల, ఆ మధ్య సమయంలో కిటికీ లో నుండి దూకి పారి పోయేవాడిని. మరుసటి రోజు బెత్తంతో అర చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చేది, అయినా సరే దాని సంగతి తర్వాత ,ముందు ఈరోజు పారిపోవడంపారిపోవడం ముఖ్యమని
పరిగెత్తి పోయేవాడిని. ఆ సమయంలో మా క్లాసులోకి కళ్యాణి అనే ఒక అమ్మాయి కొత్తగా వచ్చి చేరింది. అమ్మాయి అన్నిట్లో ఫస్ట్ .లెక్కల్లో కూడా. నేనేమో అన్నిట్లో ఫస్టు , మ్యాథమెటిక్స్ లో తప్ప. మా స్కూల్లో జరిగే ప్రతి నృత్య నాటిక- కార్యక్రమాలలో నన్ను తీసుకునేవారు. దానికి రిహార్సల్స్ అన్నీ మా హెడ్ మిస్సెస్ గారి ఇంట్లోనే. దాదాపుగా పది మంది అమ్మాయిలు -అబ్బాయిలు అక్కడ ఉండే వాళ్ళం. చేత్తో తిప్పే, చిన్న గ్రామ్ఫోన్ రికార్డు ఉండేది. దానిలో పాటలు పెట్టి మా తోటి విద్యార్థులతో చేయించేవారు. అక్కడికి కళ్యాణి వచ్చేది. ఆ అమ్మాయిని ఏంటో ఏమోగానీ అన్నింటా ముందు ఉంచేవారు. నన్నేమో వెనకాతల ఉంచేవారు. నాకేమో తెగ అవమానంగా ఉండేది. ఆఖరికి ప్రోగ్రాం నాడు అబ్బాయిల ను తీసేసి అమ్మాయిలతొ డాన్స్ చేయించే వాళ్ళు స్టేజి మీద. అంటే మేమంతా ఆటలో అరటిపండు అన్నమాట. స్కూల్ డే కార్యక్రమాలు డాన్సులు ఉన్న రోజు టీచర్ కట్టె పట్టుకొని గేట్ దగ్గర కాపలా కాసేవారు. విద్యార్థులను మాత్రమే లోనికి రానిచ్చేవారు. విద్యార్థులు ఎవ్వరికీ టేబుళ్లు ,కుర్చీలు ,బెంచీలు ఉండేవికావు .మేమంతా కింద నేల మీద కూర్చొని సంతోషంగా చూస్తూ ఉండేవాళ్ళం. మా క్లాస్మేట్స్ లో స్వరూపరాణి ,రమేష్ అని అన్నా చెల్లెలు ఇద్దరు ఉండేవారు. మా ఊర్లో ఉన్న ఒకే ఒక టాకీస్ కు వాళ్ళు ఓనర్ల పిల్లలు. అందుకని వాళ్ళు సినిమాలు అదేపనిగా చూస్తూ డాన్స్ నేర్చుకునే వాళ్ళు. ఆ డాన్స్ ని అలవోకగా స్టేజి మీద చేసే వాళ్ళు. అన్నీ మార్లు ఆ సినిమా చూస్తే అలాగే నేను డాన్స్ చేయగలను అనుకునేవాడిని. మా ఊర్లో కి కొత్తగా సంగీతం మాస్టర్ వచ్చారు. సాయంత్రం సమయంలో విద్యార్థులకు సంగీత నేర్పిస్తున్నారు అని తెలిసింది. నేను మా నానమ్మ ని తీసుకుని ఆ సంగీతం మాస్టారు ఇంటికి
వెళ్లాను. అయితే అక్కడ నాకంటే ముందు వచ్చినవాళ్ళల్లో కళ్యాణి కూడా ఉంది.
నన్ను ముందు కూర్చోబెట్టుకొని ఆ సంగీత మాస్టారు కొన్ని ఆలాపనలు చేయమన్నాడు. నేను సరిగ్గా అలాగే చేశాను కానీ ఆయన మొహం విరిచి లాభం లేదు వచ్చే సంవత్సరము ట్రై చేద్దాం ఇంకా కంఠం కుదురు కోలేదు అని రిజెక్ట్ చేశాడు. మళ్లీ నాకు కళ్యాణి ముందు భయంకరమైన అవమానం జరిగింది. పోతే పోయిందిలే ఈ సంగీతం అనుకొని వెనక్కు వచ్చేసా.
నాకున్న లెక్కల ప్రాబ్లం వల్ల మా చిన్నాన్న సరస్వతి టీచర్ దగ్గరికి పంపారు లెక్కలు నేర్చుకోమని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కళ్యాణి ఉంది. అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చింది. నీకు లెక్కలు రావా ? అని అడిగింది , అప్పుడు చూడాలి నాకు మళ్లీ అవమానం. వెంటనే మా నానమ్మ దగ్గరికి వెళ్లి చెప్పాను, నేను ఇంక ట్యూషన్ కి వెళ్ళను అని. మళ్లీ వెళ్ళలేదు సుమా! ఆ తర్వాత కరుణాకర్ నాకు లెక్కలు నేర్పించాడు. పట్టుదలతో వాణ్ని అన్నీ అడిగి నేర్చు కునేవాడిని. మొత్తానికి ఎలాగో లెక్కలు నేర్చుకున్నాను, కానీ లెక్కలంటే భయం మాత్రం ఇప్పటికీ,వదల్లేదు! బుచ్చమ్మ టీచర్ ఇప్పటికి కూడా గుర్తున్నారు. పాపం నాకు లెక్కలు నేర్పటానికి చాలా కష్ట పడేది. ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకు ,బుచ్చమ్మ టీచర్ను చూడాలని అనిపించి వెళ్లాను, కాని అప్పటికే ఆలస్యమైంది., తను స్వర్గస్తులయ్యారు .అప్పటికి మూడు సంవత్సరాలు దాటింది అట. ఆ తర్వాత నుండి నేను ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా మా ఊరికి వెళ్లి నాకు పాఠాలు నేర్పిన గురువులను కలిసి వచ్చాను . ఎంతోమంది గురువులు కష్టపడి నేర్పితే నేను ఒక దశ కు చేరాను. మనకు జీవితంలో మొదట అన్ని నేర్పించే దేవుడు తల్లి అయితే ,రెండవది గురువు. అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మ అన్నారు. గురువులను పూజించని వారు ,ఎప్పుడూ జీవితంలో బాగుపడరు,అన్నది నా మ్మకం.
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి