నా తొందరపాటు: -- యామిజాల జగదీశ్

 మాటతీరెలా ఉండాలి? ఎవరితో మాట్లాడుతున్నామో ఆలోచించాలి? ఎందుకు మాట్లాడుతున్నామో తెలియాలి? ఇలా మాటల ముచ్చట్ల గురించి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఏవేవో రాస్తూ వచ్చాను కానీ నా విషయానికొచ్చేసరికి తొందరపడి మాటలు అనేసి నాలుక్కరచుకున్న సంఘటన ఇటీవల జరిగింది.


కొంత కాలంగా ఆర్థిక ఒత్తిడికి లోనై నానా అవస్థా పడుతుండటంతో మొహమాటాన్ని పక్కన పెట్టి ముగ్గురు నలుగురు సన్నిహితులను ఏదైనా పనివ్వమని అడిగాను. ఒకరైతే డబ్బులు అవసరమైతే చెప్పు ఇస్తాను గానీ ప్రస్తుతానికి పనేమీ లేదన్నారు. మరొకరేమో ఈమారు ఊరుకి వచ్చినప్పుడు కలిసి మాట్లాడుతానన్నారు. 

ఇంకొకరేమో "అదేంటీ...మీరు జాగర్తగానే ఉంటారనుకున్నానే....ఏమొచ్చిందంత కష్టం అన్నారు తప్ప పనివ్వలేదు. 


ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క మాట చెప్పాక బండి శ్రీనివాస్ అనే ఓ బంధువుని కాంటాక్ట్ చేసాను. విషయం చెప్పాను. ఉంటే చెప్తానన్నారు. ఈ మాట చెప్పిన ఒకటి రెండు రోజులకే కాబోలు ఓ ముప్పై ఎనిమిది పేజీల డీటీపీ వర్క్ ఇచ్చారు. యూనికోడ్ ఫాంటులో ఉన్నది ఉన్నట్లు టైప్ చేసివ్వమని ఆ పేజీలన్నీ మెయిల్లో పంపారు. 


ఆనందంతో వర్క్ మొదలు పెట్టాను. తీరా ఒకటి రెండు పేజీలు టైప్ చేసేసరికి విసుగొచ్చింది. కారణం అరసున్నలూ వగైరా వగైరా బోలెడన్ని ఉన్నాయి. పైగా విషయం కూడా అంత ఆసక్తిగా లేదు. టైప్ చేయాలనిపించలేదు. కానీ ఎంతో కొంత డబ్బులు వస్తాయనే ఆరాటంతో పళ్ళు కరచుకుంటూ కిందా మీదా పడి ఓ పది పేజీలు చేసాక శ్రీనివాస్ కి ఫోన్ చేసి అందులో ఉన్నట్టే టైప్ చేయాలా అని అడిగితే బెంగళూరులో ఉంటున్న సంబశివరావుగారనే వ్యక్తి ఫోన్ నెంబరిచ్చి మాట్లాడమన్నారు శ్రీనివాస్. 


వెంటనే సాంబశివరావుగారికి ఫోన్ చేసాను. మనసులో వున్న ఏవగింపునంతా వ్యక్తం చేస్తూ నమస్కారమంటూ నన్ను నేను పరిచయం చేసుకుని "ఈ కాలంలో ఎవరు చదువుతారండీ ఇలాంటి పుస్తకాలు. ఎందుకండీ ఇలాంటి పుస్తకాలు...ఎఏమిటండీ ఈ చాదస్తం....అరసున్నలు ఎవరిక్కావాలండీ...ఇలాటివి ఒక్కరూ చదవరండి ....ఎందుకంటి టైమ్ వేస్ట్..." అని ఏవేవో అనేసాను. కానీ ఆయన నా మాటలన్నీ విని ఏమాత్రం ఆవేశంగానో కోపంగానో మాట్లాడలేదు. చాలా ప్రశాంతమైన స్వరంలో మాట్లాడుతూ అందులో ఎలా ఉంటే అలాగే చేసివ్వాలి. విరామ చిహ్నాలుసైతం విడిచిపెట్టకూడదు. అక్షరాలు సరేసరి. ఎవరు చదువుతారనో ఎవరు చదవరనో దానితో నిమిత్తం లేదు మాకు. భాషను బతికించుకోవడంలో భాగంగానే ఇలాటి పాత పుస్తకాలను మా వెబ్ సైట్లో పోస్ట్ చేస్తుంటామండి. కనుక మేమిచ్చిన దానిని అక్షరం పొల్లుపోకుండా టైప్ చేసిపెట్టాలండి" అని ఆయన చాలా సన్నని మృదువైన స్వరంలో చెప్పేసరికి ఇక చేసేదేమీ లేక ఇచ్చిన పని పూర్తి చేసాక శ్రీనివాస్ కి ఫోన్ చేసి సాంబశివరావుగారితో జరిపిన మాటల ముచ్చటను చెప్పి ఆయన వయస్సెంత అని అడిగాను. ఎనబై పైనేనండి అని శ్రీనివాస్ చెప్పినప్పుడు నన్ను నేను తిట్టుకున్నాను. తొందరపడి చిత్తమొచ్చినట్లల్లా మాటలన్నందుకు బాధపడ్డాను. ఆయనకు ఫోన్ చేసి సారీ  చెప్పాను. కానీ ఏం లాభం? పెదవి దాటిన మాటలు వెనక్కు తీసుకోలేనుగా? రాసినట్టు బతకలేని నా రాతలు దండగే అనుకుంటాను. రాసే అర్హత లేదు నాకు. ఎందుకూ పనికి రాని రాతలే నావి. ఏం చేయను? ఎలా మానుకోవాలీ రాతకోతలు. రాసుకున్న మాటలకు విలువివ్వాలంటే ముందు నన్ను నేను సంస్కరించుకోవాలి కదూ!!?!!