మత్ కరోనా(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ముట్టుకుంటే అంటుకొనే రోగమొచ్చింది.
మనిషి,మనిషిని కలవనీయకుండా కట్టడి చేస్తుంది.
అంతా ఆగమాగం చేసి
స్వీయనిర్భంధంలోకి నెట్టింది.
మాస్క్,సానిటైజర్లను కట్టబెట్టింది.
పరిశుభ్రత,భౌతికదూరాలను
తప్పనిసరి చేసింది.
కాలం‌ గడుస్తున్నా కనికరించనంటుంది.
ముహూర్తాలు ముంచుకొచ్చి
జంటలు కావాలన్నా కోరికలు
నెరవేరేదెట్లా?
వేడుకగా చేసుకొనే కళ్యాణం
నిబంధనలమయం అయింది.
తాళికట్టు శుభవేళలో
భయాలు,అనుమానాలు అక్షతలయ్యాయి.
తిందామన్నా,తాగుదామన్నా
తిప్పలు తప్పవని
ఎవరికి వారే యమునాతీరే.
తాళికట్టే చేతుల్లో భద్రమెంత?జిలకరబెల్లం పెట్టే చేతుల్లో శుభ్రతెంత?
దగ్గర దగ్గర,పక్కపక్కనే కూర్చుంటే జాగ్రత్తెంత?
కలవాడానికొచ్చిన‌ వారిలో 
కోవిడ్ లేని వారెవరు?
కరోనా కాలంలో‌ కళ్యాణము
కళతప్పి కళ్ళు తేలేస్తున్నది.