ఈత నేర్చిన వైనం ..!!:- ----శ్యామ్ కుమార్--నిజామాబాద్.

 మా ఊర్లో రకరకాల ఆటలు ఆడిన తర్వాత, మేము వెతుక్కోవడానికి ఆటలు ఇంకా ఏమీ లేవు అని అర్థమైంది. అప్పుడు నా వయస్సు పన్నెండు సంవత్సరాలు.  మేము ప్రతి రోజు కలిసి ఆడుకునే స్నేహితుల్లో సగం అమ్మాయిలు  ఉండేవాళ్లు. అమ్మాయిలతో కలిసి ఆడుకునేప్పుడు, చాలా సున్నితం గా ఉండే ఆట,  దెబ్బలు తగలకుండా ఉండే ఆట ఆడుకునే వాళ్ళం.  ఇలా, మేము అబ్బాయిలము మాత్రమే ఉండేటప్పుడు, కబడ్డీ, చెట్లు ఎక్కడం, గోడలు దూకడం, లాంటి ఆటలు ఆడుకునేవాళ్లం.
  ఒక రోజు ఏం ఆలోచన వచ్చిందంటే, అందరం వెళ్లి చెరువులో ఆడుకుందామని.  అయితే అప్పుడే కలిగిన జ్ఞానోదయం ఏంటంటే ,మాకు ఎవ్వరికీ ఈత రాదు.  వెంటనే నేను  మావాళ్లు  అందరికీ చెప్పాను మనం ముందుగా ఈత నేర్చుకోవాలి అని. ఆ రోజుల్లో ఈతకొలను , అంటే స్విమ్మింగ్ పూల్స్, నేర్పించే వాళ్ళు, ఎవరూ ఉండేవారు కాదు. 
 మాకు చెరువులు లేదా దిగుడు బావులు మాత్రమే  ఈతకు అనువుగా ఉండేవి.  మామూలుగా , అందరం కలిసి చెరువు కి వెళ్ళాము, కానీ అందులో దిగడానికి భయమేసింది, ఎందుకంటే బురద, పాములు ఉంటాయని ,చనిపోతారని అందరూ అనుకునేవారు. అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్లాo. అయితే మా లో మా కంటే దాదాపుగా మూడు సంవత్సరాలు  చిన్న గా ఉండే  అజ్మీర్ అనే అబ్బాయి ఉండేవాడు. వయసులో చిన్నవాడైనా గొప్ప ధైర్యం ఉండేది. మొండి   వాడిని అయిన  నాకే   అజ్మీర్ ను చూసి భయమేసేది. 
 ఊరికి దూరంగా ఉన్న దర్గా వద్ద , ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావి లోకి చక్క గా దిగడానికి మెట్లు , అక్కడ నుండి లోపలి బావి చుట్టూ నడవడానికి  ప్లాట్ ఫాం లాగా ఉండేది.  అక్కడికి వెళ్లాం, అజ్మీర్ సలహా మేరకు వెళ్లి చూస్తే  నీళ్లు ఆకు పచ్చగా పాకుడు పట్టి ఉన్నాయి.  గోడల వెంబడి అసహ్యకరమైన పురుగులు పాకుతున్నాయి.   అయినా అక్కడే ఈత నేర్చు కోవాలని నిశ్చయించుకున్నాము.
  అప్పుడు మాకు అజ్మీర్ ఒక సలహా ఇచ్చాడు నీళ్ళలో మునిగి పోకుండా ఈత కొట్టాలంటే ఖాళి డబ్బా( కిరోసిన్ ఐదు లీటర్లది) తీసుకొని దానికి  తాళ్ళు కట్టి దాన్ని మన వైపు కట్టుకొని నీళ్లలో దిగాలని. 
 నీళ్ళలో మునిగి పోకుండా ఈత కొట్టాలంటే ఖాళి డబ్బా  తీసుకొని దానికి  ,తాళ్ళు కట్టి దాన్ని మన  వీపుకు కట్టుకొని నీళ్లలో దిగాలని. ఇంకేముంది- వెంటనే వెళ్లి  ఆ సరంజామా అంతా సరి చేసుకొని మళ్ళీ ఈతకు వచ్చేసాం.  వీపు కట్టుకున్న ఆ ఖాళీ డబ్బా లోకి నీళ్ళు పోకుండా మూత గట్టిగా బిగించి  ఈత మొదలుపెట్టాం .హాయిగా నీళ్ళలో మునిగి పోకుండా తేలాము. ఎందుకంటే  ఖాళీ డబ్బా లు మునిగిపోకుండా పైకి  తేలుస్తాయి.  అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. మా ఇంట్లో మా బాబాయ్ కి ,మా నానమ్మకు, తెలిసినా వాళ్ళు ఎవరు కంగారు పడేవారు కాదు. ఎందుకో గానీ ,చాల స్వతంత్రం ఇచ్చే వారు.  ఇప్పటి లాగా పిల్లలను అతి జాగ్రత్త గా  చూసి  భయపడే వారు కాదు.  
ఆ  సమయంలో కొందరు వచ్చి చూసి మీకు ఇంకా డబ్బా లు ఎందుకు మీకు ఈత వచ్చేసింది అని అన్నారు. కానీ మేము ఎవరము 
  డబ్బాలు తీసి నీళ్ళలో దిగే సాహసం చేయలేదు.  మరుసటి రోజు   ఈత కొట్టుకుంటూ నేను ఒడ్డుకు వచ్చాను. తీరా వచ్చి చూస్తే నా వీపు కు డబ్బా లేదు అది నీటి మధ్యలో తేలియాడుతూ ఉంది. గుండె బాగా కొట్టుకోవడం మొదలైంది .అమ్మో   నయo   ఇంకా నేను మునిగిపోలేదు మధ్యలో డబ్బా   పూడిపో యి?అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది నాకు ఈత వచ్చేసిందని. డబ్బా లేకుండానే నేను నీళ్లలో తేలుతూ ఒడ్డుకు వచ్చాను .అయినా నమ్మశక్యం కాలేదు, నాకు  ఈత వచ్చిందని. ఎందుకైనా మంచిదని ఆ డబ్బా  కట్టు కొనే మళ్లీ నీళ్లలో దిగాను. 
 ఆ తర్వాత మరుసటి రోజు మెల్లిగా బావి ఒడ్డునే ఈత కొట్టడం మొదలు పెట్టాను  .
 అప్పుడు నాకు అర్థం అయింది నేను నీళ్లలో   తేలగలను అని.  దాని తర్వాత ఇంకో అడ్వెంచర్ చేయాలనిపించింది. ఆ బావికి చాలా ఎత్తులో
 అటూ ఇటూ నడవడానికి ఒక వంతెన ఉండేది .ఇంకో వైపు  పొడవు గా వుండే  రెండు రాతి స్తంభాలు బావి అంచు నుండి కాస్త మద్య కు వుండేవి. అక్కడి నుంచి  బావిలోకి   దూకాలి అన్నమాట.
 అందరు వెళ్లి కాసేపు నిలబడి భయపడుతూ  దూకారు..
 నేను మాత్రం  దూకడానికి ధైర్యం సరిపోక  భయపడుతూ అలాగే నిలబడ్డాను.  అందరూ దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి మళ్ళీ మెట్లు ఎక్కి మళ్ళీ  - మళ్లీ దూకడం మొదలుపెట్టారు.  నేను ఇలా కాదు,  అని కళ్ళు మూసుకొని భగవంతుని స్మరిస్తూ  దూకే సా.  ఇంకేముంది నీళ్లను తాకగానే జర్ న   లోని కి జారిపోయాను.  కాసేపు ఏమీ అర్థం కాలేదు ముక్కులోకి నీళ్లు , కళ్ళ లో కి నీళ్లు  వెళ్లిపోయాయి.  పైకి వచ్చి ఒడ్డుకు ఈదుకుంటూ విజయోత్సాహంతో మళ్లీ పైకి  వెళ్ళి మళ్లీ  దూకాను.  ఇంకేముంది నాకు ఈత వచ్చేసింది. మాఆటల్లో ఇంకొకటి చేరి పోయింది. ఎన్నెన్నో సాహస విన్యాసాలు చేస్తే కాని బాల్యం గడవ లేదు. యౌవనం లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా తెలియ లేదు ఎంతో విలువైన బాల్యం అయిపోయిందని . భగవంతుడు వరం ఇస్తే ఒక్క బాల్యం మళ్లీ కావాలని కోరుకుంట. ఇంకేమీ వద్దు.ఎలాగూ...బాల్యం తిరిగి రాదుక దా!!
               ***