నన్నెందుకు తినాలనుకుంటున్నావు? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        ఓ కుక్కకు జబ్బు చేసింది. 
       ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. 
       నాటు వైద్యుడిని కలిసింది. 
       చిట్కా వైద్యం చెప్పాడు.
       'కోడి కూర తింటే మొండి రోగం మాయమవుతుంది" అని చెప్పాడు.
       కోడి కూర తినాలి అనుకుంది కుక్క. 
       కోడి కోసం వేట మొదలు పెట్టింది.
       చాలా రోజులకు ఓ పుంజు దొరికింది. 
       అది చాలా బలిసిన పుంజు. 
       నడవలేక నడుస్తూ కుక్కకు చిక్కింది.
       కూర వండుదామని పుంజును కట్టేసింది.
        కత్తి నూరుతుంది.
        పుంజుకు విషయం అర్థమైంది.
        ఎలాగయినా తప్పించుకోవాలనుకుంది.
       "కుక్క బావా! కుక్క బావా!! నన్నెందుకు తినాలనుకుంటున్నావు" అని అడిగింది పుంజు.
       "వైద్యుడు చెప్పాడులే. నిన్ను తింటే నా రోగం నయం అవుతుంది” అంది కుక్క
       పుంజుకు ఓ ఆలోచన వచ్చింది.
       “కుక్క బావా! కుక్క బావా!! కోడి కూర తినమన్నాడా? లేక కోడిపుంజు కూర తినమన్నాడా ?" అని అడిగింది.
        “కోడి కూర" అన్నది కుక్క.
        “మరి అలా అయితే నన్నెందుకు తింటావు. 
        నన్ను తింటే నీ జబ్బెలా నయం అవుతుంది. 
        నావెంటరా  కోడి పెట్టను పట్టిస్తా. పలావు చేసుకు తిందుగానీ" అంది పుంజు.  
        కుక్క నమ్మింది.
        పుంజును వదిలింది.
        "కొక్కోక్కో” అంటూ పుంజు పాకాలో దూరింది.
         మళ్ళీ బయటకు వస్తే ఒట్టు.
         కుక్క చెవులు జాడించుకుంటు వెళ్ళిపోయింది.
కామెంట్‌లు