పుస్తకాలు – అప్పులు:-- యామిజాల జగదీశ్

 నా తండ్రి నాకు
ఎలా బతకాలి అని
తిన్నగా చెప్పలేదు
ఆయన బతికాడు
అది పక్కనే ఉండి
నేను చూస్తూనే ఉన్నాను
ఇదొక ఇంగ్లీషు కవిత. ఎవరు రాశారో గుర్తు లేదు. కానీ తమిళంలో దీనినొకరు అనువదించారు. ఆయన పేరు నా. ముత్తుకుమార్. ఆయన నాకెంతో ఇష్టమైన రచయిత. ఆయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఇతనూ చిన్నవయస్సులోనే పోయాడు. అతను చనిపోయినప్పుడు భార్య, కొడుకు, నెలల కూతురు ఉన్నారు.
అమ్మ మరణం తర్వాత అతను నాన్న చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ ప్రపంచాన్ని పగటిపూట సూర్యుడు నడిపిస్తున్నాడు. రాత్రిపూట చంద్రుడు నడిపిస్తున్నాడు. కానీ తనను పగలూ రాత్రీ నడిపించేది నాన్న చేతులే అని అతను తెలుసుకున్న కాలమది. తండ్రి వేళ్ళు అతనిని అనేక వైపులకు తీసుకుపోయాయి. అతనికి ఈ ప్రపంచం ఆశ్చర్యంగా అనిపించింది. విస్తుపోయేలాగానూ అనిపించింది. అదేసమయంలో భయంగానూ ఉంటూ ఉండేది. అయితే తన తండ్రి చేతివేళ్ళు పట్టుకోవడంతో ఎన్ని అనుభవాలో.
పదో తరగతి వరకు అతను బతికింది ఓ పూరిపాకలో. ఈ పాక ముందర పేడతో అలికిన రెండు అరుగులు. ఓ అరుగు పక్కన ఓ మునగచెట్టు. మునగ చెట్టును అల్లుకున్న ఓ గుమ్మడి పాదు. అది మెల్లగా పాక పైకప్పునంతా ఆక్రమించింది. దాని నిండా గుమ్మడి పూలు. పైకప్పంతా పసుపు వర్ణంతో కనిపించేది. నాన్న సైకిల్ ఇంట్లో ఓ మూల నిలబెట్టిన తర్వాత ఓ ఇద్దరు నడవడానికి మాత్రమే వీలుగా ఉన్న గది అది. ఈ గదికి ఓవైపు వంట గది. మరొకవైపు పక్కదుప్పట్లు పెట్టుకోవడానికి వీలుగా ఓ గది. పేరుకే అది పడగ్గది. అక్కడ ఓ మూల రెండు మూడు బస్తాల నిండా పుస్తకాలు. అవన్నీ అతని నాన్న ఆస్తులు. అలాగే అక్కడున్న మంచం కిందా పుస్తకాలే. ఓ చిన్నపాటి చెక్క బీరువా పక్కనా పుస్తకాలే. వంట గది అంతా కొయ్య కుంపటితో కమ్ముకున్న మసి. ఆ గోడమీద పాల లెక్కలు, లాండ్రీకి వేసిన బట్టల లెక్కలు. పెరుగు లెక్కలు వగైరా వగైరా అంకెలతో నిండిపోయేది. ఇక ముందు గదిలో చిన్న చిన్న పత్రికలు బోలెడు. అవన్నీ నాన్న చందాలు కట్టి తెప్పించినవే. ఆ పత్రికలన్నీ సాహితీపరమైన చర్చలతో నిండినవే. అయితే అతనేమో పిల్లల పత్రికలు చదివేవాడు. తండ్రీ కొడుకులకు పుస్తకాలే పెద్ద తోడు. భరోసా. ఓదార్పు. ఒకటేమిటీ అన్నీనూ.
నాన్న నుంచి వచ్చిన పుస్తకాల పఠన అలవాటుతో క్రమంగా అతను అమ్మ వాసనను మరచి పుస్తకాల వాసనలో పడ్డాడు. అతని తండ్రి రాత్రంతా చదువుతూ ఉండేవారు. ఎప్పుడు నిద్రపోతారో తెలీదు. అంతటితో ఆగరు. వాటిలోని ముఖ్యమైన అంశాలను ఆయన కత్తిరించి ఓ పుస్తకంలో అతికించేవారు. వాటి పక్కన తన అభిప్రాయాలు రాసేవారు. నాన్నలాగా అతనేమో తనకు నచ్చిన మాటల కింద గీతలు గీసుకునేవాడు. ఇలా పుస్తకాలే వారిద్దరికీ ప్రపంచమయ్యాయి.
ఓమారు వేసవి సెలవులప్పుడు ఇంటికి దగ్గర్లో పొరుగింటి పిల్లలు వీధిలో గిల్లీ దండా, గోలీలు, బొంగరాలు ఇలా ఏవేవో ఆటలు ఆడుతుంటే అతని తండ్రి ఓ కిటికీ తలుపులు తెరచి అక్కడ కూర్చోపెట్టి అక్కడి నుంచి ఆ ఆటలను చూడనిచ్చారు. అలాగే అతనికి ప్రపంచం పరిచయమైంది. అయితే ఓరోజు వేసవిలో తండ్రి ఓ పది ముఖ్యమైన పుస్తకాల పేర్లు చెప్పగా అవి ఓ వరుసలో రాశాడతను. వాటిలో కొన్ని ప్రముఖుల జీవిత చరిత్రలు. కొన్నేమో జానపద కథలు. కొన్నేమో నీతి కథలు. ఆ జాబితా చెప్పడం పూర్తయిన తర్వాత తండ్రి ఆ పుస్తకాలను అతనికి ఇచ్చారు. వాటిలో తను ముందుగా చదివిన పుస్తకం ఓ హాస్యకథ. ఆ కథలోని అమ్మాయి పాత్ర అతనికి ఎంతో నచ్చింది. తండ్రితో ఆ విషయం భయంభయంగా చెప్పాడు. తండ్రి అలాగా అంటూ అతని భుడం మీద ఓ తట్టు తట్టారు.
ఆ తర్వాత తను చదివింది మరొక పిల్లల నవల. అందులో తండ్రిని కోల్పోయిన ఓ కుర్రాడి గురించి కథ. ఆ కుర్రాడి గురించి తండ్రితో చెప్పి బాధపడ్డాడు.
ఓరోజు అతను తండ్రితో నాన్నా నాన్నా నా ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తామంటున్నారు అన్నాడు. కానీ ఈ పూరిపాక ఇంటికి వారిని తీసుకురావడానికి సిగ్గుగా ఉంది నాన్నా అన్నాడతను. ఈ మాటలు జరుగుతున్న సమయం రాత్రి. తండ్రి అతని కళ్ళల్లోకి చూసి ఇదిగో అలా పైకప్పులోంచి చూడు అన్నారు. అతను చూశాడు. పైకప్పు కన్నాలలోంచి ఆకాశంలోని నక్షత్రాలు కనిపించాయి. అతనిని జ్ఞానమనే కళ్ళు తెరచి చూడమని తండ్రి చెప్పాడు. మీ ఫ్రెండ్సుని తీసుకురావాలనుకుంటే రాత్రి పూట తీసుకురా....మనమిప్పుడు పడుకున్నట్టే ఇంట్లో నుంచే ఆకాశంలోని నక్షత్రాలను చూడొచ్చు. వాళ్ళు తమ ఇళ్ళల్లో ఇలా పడుకుని నక్షత్రాలను చూడలేరు తెలుసా అన్నాడు.
ఈ సంఘటన జరిగి ముప్పై ఏళ్ళుపైనే అయ్యింది. తండ్రి పోయి ఇరవై ఏళ్ళు అయింది.
ఈమధ్య ఓరోజు అతను తన కుమారుడితో  అవీ ఇవీ మాట్లాడుతూ తాతయ్య బోలెడంత అప్పులు చేసారు....అవన్నీ తాతయ్యే తీర్చాడు అన్నాడు అతను.
అప్పుడు కొడుకు అడిగాడు....తాత ఎందుకు అప్పు చేసారని.
తాతయ్య బోలెడన్ని పుస్తకాలు చదువుతారురా... అవి కొనడానికి అప్పులు చేసేవారు అన్నాడతను.
మంచి విషయమే కదు నాన్నా....మీరు పుస్తకాలు చదవండి....మీరు పుస్తకాలు కొనడం కోసం చేసే అప్పులను నేను తీరుస్తాను నాన్నా అన్నాడు కొడుకు.
అతను ఆ క్షణమే కొడుకు కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో నక్షత్రాల్లా కనిపించాయి కన్నీటిచుక్కలు.