స్నేహమేరా జీవితం ....!!:---శ్యామ్ కుమార్--నిజామాబాద్.


 పసితనం అంటే కల్లకపటం ఎరుగని లేత వయసు.

ఈ వయసులో పెద్దవాళ్లు నూరిపోస్తే తప్ప పిల్లలకు 

కులాలు,మతాలు ,ప్రాంతాలూ ,బాషా ,స్నేహానికి అడ్డురావు.నా చిన్నతనం అలానే గడించింది .నాటి 

పవిత్రమయిన స్నేహాలు ఇప్పటికీ కొనసాగడానికి 

కారణం ఇదేకావచ్చు !

చుట్టూ చిమ్మ చీకటి  గుండెలు అరచేతిలో పెట్టుకొని  దయ్యం కథ వింటున్నాము . రాత్రి సమయం అందరం  వరుసగా పక్కపక్కనే పడుకున్నాం. అది మా ఇంటి పక్కనే ఉన్న. నాహిద్ అక్క ఇల్లు. 

 అప్పుడప్పుడు మా ఇంట్లో కాక పక్క ఇంట్లో  ఉండే   నాహిద్ అక్కఇంట్లో పడుకొనే వాడిని. వాళ్లు ముస్లిమ్స్. వారితో మా యొక్క అనుబంధం చాలా విచిత్రమైనది. వారి ఇంటికి మా ఇంటికి మధ్యలో ఒక తలుపు ఉండేది. రెండు ఇళ్లకు కలిసి ఒకే బావి అది మా ఇంట్లో ఉండేది. వారికి వీలైనప్పుడల్లా వచ్చి బావిలో నీళ్ళు చేదుకొని వాళ్ళ ఇంట్లోకి మోసుకొని వెళ్లేవారు. ఆ రోజుల్లో కుళాయిలు వగైరా ఉండేవి కావు. ఆ బావిలో నీళ్ళు తోడు కోడానికి కొబ్బరి నారతో అల్లిన తాడు , దానికి ఒక వైపు ఇనుప బకెట్ ఉండేది ,దాన్ని చాంతాడు అనేవారు. ఇలాంటి అవసరాలు కూడా మా మద్య స్నేహం బలంగా వుండ టాని కి కారణం కావచ్చు.

మేము బ్రాహ్మణుల ము అయినప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకుని గడిపాము. వాళ్ల ఇంట్లో ఐదుగురు అక్క చెల్లెళ్లు , ఒక తమ్ముడు, మా ఇంట్లో నేను మాత్రమే అబ్బాయి. నా వయస్సు 12 సంవత్సరాలు. 

మా బాబాయి బయటకు వెళ్లిపోయిన తరువాత వారు నేనూ రెండు ఇళ్ళ మద్య తలుపులు తీసివేసి ఆడుకొనే వాళ్ళo.రంజాన్ పండుగ రోజు  సేమియా పాయసం ఇచ్చేవారు. నేను మా బాబాయ్ హాయిగా తినేవాళ్ళం. వాళ్ళు మాంసం వండుతున్న రోజు మేము తలుపు తీసే వాళ్ళం కాదు.  వారు రోజూ స్నానం అనే కార్యక్రమాన్ని పట్టించుకునే వారు కాదు. రంజాన్ నాడు వేసుకునే దుస్తులు దాదాపుగా మూడు రోజులు ఒంటి మీదే ఉంచుకునేవారు.  నేను అక్కడ పడుకున్న ప్రతిరోజు

 రకరకాల సినిమా కథలు రకరకాల దెయ్యం కథలు చెప్తూ ఉండేది.నాకంటె పెద్ద వారు ముగ్గురూ అక్కయ్యలు .నేను ఎక్కువగా వారి తోనే గడిపి వాడిని. 

ఇంటి ముందు నుండి నాతో 5 వ తరగతి చదివిన కల్యాణి వెళ్తుండగా నన్ను త్వరగా రమ్మని చూపించి ఒరేయ్ నీ  బివి (భార్య) పోతుంది చూడు అని తెగ నవ్వే వారు.  నేనూ తెగ ఆనందించే వాడిని. నేను కాస్త వేరే గా తల  . దువ్వు కుంటే కూడా  వీడి  పోజు చూడండి రా   అని పకపక నవ్వేవారు. వాళ్ల వంట ఇంట్లో కూర్చుని వారు వంట చేసే విధానం కూడా గమనించి నేర్చుకునే వాడిని. రాత్రిపూట అయితే మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, ఇద్దర  ఇళ్ళలో లైట్లు ఆర్పేసి దాగుడుమూతలు ఆడుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే మా ఇతర మిత్రులు సుధాకర్ ,శర్మ, కర్ణాకర్ కూడా వచ్చి చేరేవారు. పండగలకు మా ఇంట్లో వారికి కూడా సరిపోయేంత పిండి వంటలు చేసే వారు.   బినాక గీత్ మాలవచ్చిందంటే చాలు వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కూర్చొని  రేడియో చుట్టూ చేరి అతుక్కు పోయే వాళ్ళం.   ఆప్ కి ఫర్మహేష్,   భూలే  బిసిరి గీత్  ,  ఛాయా గీత్   రేడియోలు వింటూ వాల్ల మధ్యలో  నిద్ర పోయే వాడ్ని. వారిలో ఒక అమ్మాయి అసలు నేను పెళ్లి చేసుకోను అనేది.  ఇంకొక అమ్మాయి పేరు  తొకీర్.  తాను చాలా ప్రాక్టికల్ గా ఉండేది. నేను మాత్రం పెళ్లి చేసుకుంటాను, ఎందుకు చేసుకోకూడదు, అందరూ చేసుకుంటారు నేను చేసుకుంటాను అనేది.  వారు ఎంగిలి భోజనం గురించి పట్టించుకునేవారు కాదు. నా  ప్లేట్లో నేను తింటుంటే దాన్ని తీసుకుని హాయిగా తిని వేసేవారు.  పైగా ఆ! ఏమవుతుంది? అందరూ మనుషులే కదా! అనేవారు.

అందులో పెద్దక్కయ్య తన్వీర్  పెళ్లి  అయ్యివెళ్ళిపోతుంటే చాలా బాధేసింది. పెళ్లిలో చాలా ఎంజాయ్ చేశాను కానీ అక్క వెళ్ళిపోతుంది అన్న విషయం మాత్రం బాగా చిరాకు ,చికాకు పెట్టింది. ఆవిడ భర్త నా కళ్ళకి పెద్ద   విలన్ లాగా కనిపించాడు. బాల్యం లో ఆ సమయం స్వర్ణ యుగం అని చెప్పవచ్చును. నాకు హిందీ పాటలు బాగా రావడానికి కారణం వారే. నేను ఇంటర్ చదవడానికి సాగర్ వెళ్లిపోవటం వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి నల్గొండ కి వెళ్లిపోవడం జరిగింది. కానీ ఇప్పటికీ మేము స్నేహం కొనసాగిస్తున్నాం. వారి పిల్లలకు పెళ్లిళ్లు  అయ్యి  ఈ రోజున మనమలు కూడా వచ్చారు. కులమతాలకు అతీతంగా మా మధ్య స్నేహం తీయగా కొనసాగింది.   మా ఆచారాలు కూడా  గౌరవించి పాటించేవారు.   నా బాల్యం హాయిగా సంతోషంగా  గడపడానికి ఇలా ఎంతో మంది కారణం. ఇప్పటికీ నేను కలిసినప్పుడు వాళ్లకు నేను చిన్న పిల్లవాడినే..నను ఇంకా చిన్న పిల్లవాడు లాగా చూస్తారు . నేను కూడా వారు కలవ గానే నా వయస్సు 60 అని మర్చి పోతాను. ఇప్పటికీ.


     


కామెంట్‌లు