అక్షరానికి ఎంత అహం !:- విరించి లక్ష్మి

అక్షరానికి ఎంత అహం !
తన్ను చూసి వారు దడుసుకుంటారని,..
పుస్తకానికి ఎంత పొగరు !
గుండె చేతపట్టి వారు దాడులవుతారని..

 కవి పెదవులపై చిరు దరహాసం
ప్రశ్నల చెట్టుకు పూసిన పూలే తన కవితలనీ,
ప్రశ్నను సంధించే ట్రిగ్గర్ తన కలమనీ,
ఆ చెట్టుకు పుట్టిన తేనెటీగల గూడే తన పొత్తమనీ

ఎర్రబారిన పొద్దు
తనకు తానే చెప్పుకుంటుంది
రాత్రి చీకటి తొలగిందనీ, 
రోజంతా తనదేననీ...

నాకునేనే స్వగతంలో
చరిత్ర మరచిపోలేనిదనీ,
క్రూరరోజులు కూలతాయనీ,
ప్రజలే చరిత్ర నిర్మాతలనీ...

పిట్టలన్నీ వేకువ గీతం పాడుకుంటూ
కువకువా రాగాలాపనతో
తెలవారిన దిక్కు దండుకడుతున్నయ్...

పక్షుల దండును చూస్తూ 
ఎవరన్నారు?
చీకటి రోజుల్లో పాటలు పాడరనీ,!
నిర్బంధంలో నిద్రలు లేవరనీ !!
 తత్వం పాడుకుంటూ నేను....