సరిలేరు నీకెవ్వరూ....!(కథ) సరికొండ శ్రీనివాసరాజు

 ఉజ్జయినీ రాజ్యంలో ప్రముఖ గురువు దివ్యగుణుడు. అతని దగ్గర ఎంతోమంది ప్రముఖుల పిల్లలు విద్యను నేర్చుకుంటారు. అతను సమస్త విద్యలను నేర్పిస్తాడు. ఉజ్జయినీ రాజు వద్ద ఒక ఉద్యోగి అయిన శ్రీమంతుని కుమారుడు సుందరుడు. అతడు అన్ని విద్యలను చక్కగా నేర్చుకుంటున్నాడు. అతన్ని బాగా మెచ్చుకున్నాడు దివ్యగుణుడు. రాను రాను సుందరునిలో గర్వం తలకెక్కింది. మిగతా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. విద్యలో వెనుకబడిన వారిని చులకన చేస్తున్నాడు. హేళన చేస్తున్నాడు. గురువు గారికి ఇది తెలిసి, విద్యార్థులకు సత్ప్రవర్తన ముఖ్యమని, తోటి విద్యార్థులతో స్నేహ పూర్వకంగా ఉంటూ వారిని ప్రోత్సహించాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించాలని హితబోధ చేశాడు. ఆ హితబోధ చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అయింది. 
       విద్యలో సుందరునితో సమానుడు సుధాకరుడు. అతడు క్రమశిక్షణ కలవాడు. గురువు గారికి ఎన్నో సేవలను చేస్తున్నాడు ‌ సుధాకరుని విద్యార్థులకు నాయకునిగా నియమించాడు దివ్యగుణుడు. అది సుందరునికి నచ్చలేదు. సుధాకరుని ఎన్నో రకాలుగా బాధ పెట్టాలని చూస్తున్నాడు సుందరుడు. కానీ సుధాకరుడు సహనంతో అవన్నీ భరిస్తున్నాడు. ఎన్ని చేసినా సుధాకరుడు గురుకులం నుంచి వెళ్ళిపోక పోవడం సుందరునిలో మరింత ద్వేషాన్ని నింపుతుంది. 
       హఠాత్తుగా సుందరుడు సుధాకరునితో స్నేహం చేశాడు. రాను రానూ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. సుందరునితో జాగ్రత్త అని గురువు గారు సుధాకరుని హెచ్చరించాడు. ఒకరోజు సుందరుడు సుధాకరునితో "మిత్రమా! ఈ ప్రాంతంలో ఒక గొప్ప అడవి ఉంది. మనోహరంగా ఉంటుంది. మనం అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఆ అడవిని చూద్దామా?" అన్నాడు. సుధాకరుడు ఒప్పుకున్నాడు. అడవి మధ్యలోకి సుధాకరుని తీసుకు వెళ్ళి, అతనితో ద్వంద్వ యుద్ధానికి దిగి, సుధాకరుని అంతం చేయాలని సుందరుని కుట్ర. వీరిద్దరూ అడవి మధ్యలోకి చేరగానే హఠాత్తుగా ఒక క్రూర మృగం సుందరునిపై దాడి చేసింది. సుధాకరుడు దానిపై యుద్ధానికి దిగి, క్షణాల్లో దానిని అంతమొందించాడు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన రాజభటులు "యువరాజా! నీ పరాక్రమానికి జోహార్లు. అయినా రక్షణ లేకుండా ఇలా అడవిలోకి ప్రవేశించడం మీకు మంచిది కాదు." అని సుధాకరునితో అన్నారు. ఆశ్చర్యపోయాడు సుందరుడు. సుధాకరుని క్షమించమని వేడుకున్నాడు. తాను రాజకుమారుడినని గురువు గారికి కూడా తెలియదని, అలా తెలియడం తన తండ్రికి ఇష్టం లేదని, అందుకే ఒక సామాన్యుని కుమారునిగా గురుకులంలో ప్రవేశించానని సుధాకరుడు తెలిపాడు. ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన ధర్మాలను నూరిపోశాడు. సుందరునిలో కనువిప్పు కలిగింది.
       సుందరుడు ఇలా అన్నాడు. "రాజ కుమారునివై కూడా సామాన్యునిలా గురువు గారికి అనేక సేవలు చేశావు. అందరితో కలిసిపోయి, దర్పాన్ని ప్రదర్శించకుండా స్నేహం చేశావు. నీవు రాజువు అయితే ప్రజలందరిలో కలసిపోయి, వారి సమస్యలు తీరుస్తావు. ఎన్నిరకాలుగా నిన్ను బాధ పెట్టినా సహనంతో ఓర్చుకొని నన్ను కాపాడినావు. చిన్న వయసులోనే పెద్ద మనసు ఉన్న నీ పాలనలో ప్రజలకు కష్టాలు ఉండవు. ఓ నరపాల సుధాకరా! సరిలేరు నీకెవ్వరూ!" అని.