స్వర్ణోత్సవ వేళ:-- యామిజాల జగదీశ్
అన్నట్టు, 
నేను స్కూలు చదువు పూర్తి చేసుకుని 
ఈ ఏప్రిల్ తో యాభై ఏళ్ళు నిండాయి
ఆరో ఏటనుకుంటా 
అన్నపూర్ణా టీచర్ దగ్గర
ఒకటో క్లాస్ చదువుకున్న నాకు
స్కూల్ ఫైనల్ వరకూ 
శ్రీరామకృష్ణా మిషన్ విద్యాలయమే
అండాదండా!

స్కూలు మంచి స్కూలే
నాకే ఒంటపట్ట లేదు చదువు
కానీ 
తీపిగుర్తులెన్నెన్నో.....

ఒకటో క్లాసులోనే రెండు వారాలు
ఎగ్గొట్టి రోడ్డు పక్కన 
ఓ మైలు రాయిమీద కూర్చుని
అమ్మకు పట్టుబడటం 
జ్ఞాపకమే!

ఇంగ్లీష్ కాపీ రైటింగ్ సరిగ్గా రాయక
మీనాక్షీసుందరం మాస్టారు 
స్కేలుతో వేళ్ళమీద కొట్టడమూ 
జ్ఞాపకమే!

సబ్జెక్టుల క్లాసులకన్నా
క్రాఫ్ట్ పీరియడ్
డ్రాయింగ్ పీరియడ్ 
పీటీ పీరియడ్ అంటే
మక్కువెక్కువుండటమూ 
జ్ఞాపకమే!

తొమ్మిదో క్లాసులో 
ఎంచక్కా అన్ని లెక్కలూ తప్పుచేసి
గుండుసున్నా తెచ్చుకోవడమూ 
జ్ఞాపకమే!

శివప్రసాద్ సంచీ లోంచి
ఇంగ్లీష్ గైడ్ కొట్టేసి 
మళ్ళీ ఏమీ తెలీనట్టు 
మరుసటిరోజే వాడి సంచీలో 
పెట్టేయడమూ జ్ఞాపకమే!

తొమ్మిదో క్లాసు 
తెలుగు పరీక్షలో కాపీ కొట్టానని
నాగరాజు మాస్టారు
నన్ను తీసుకెళ్ళి
హెడ్మాస్టర్ రూములో దోషిలా నిలపడమూ
జ్ఞాపకమే! 

ఆల్జీబ్రా అంటేనూ
ట్రిగ్నామిట్రీ అంటేనూ దడ
ఎందుకురా ఈ క్లాసనుకోవడమూ
జ్ఞాపకమే!

సైన్స్ మాస్టారు 
ల్యాబులో కప్ప గురించి 
చెప్పిన పాఠం కన్నా కప్పను కోసి చూపడం జ్ఞాపకమే!
అలాగే సైన్స్ మాస్టారు
నా జవాబులకు గ్యాస్ అని రిమార్కు రాయడం జ్ఞాపకమే!

ఏమాత్రం గ్యాప్ దొరికినా
పనగల్ పార్కులో కబడ్డీ ఆడటం
జ్ఞాపకమే!

ఇంగ్లీషు గ్రామరూ
తెలుగు వ్యాకరణమూ
బుర్రకెక్కెక తికభకపడటం
జ్ఞాపకమే!

అసలు ఒక్క ఏడాదైనా 
చదువుమీద ఆసక్తి కలగలేదనేదే
నిజం నిజం!

ఎప్పుడూ అరకొర మార్కులతో
గట్టెక్కడం జ్ఞాపకమే!

స్కూలుకి వెళ్ళడమంటే ఇష్టమే
కానీ పరీక్షలంటేనే గిట్టేది కాదు!

నా చదువు మాటెలా ఉన్నా 
మంచి మిత్రబృందాన్నిచ్చిన
స్కూలు జీవితాన్నెప్పటికీ 
మరచిపోలేను!
ఇప్పటికీ
మిత్రులందరం
వాట్సప్పులో "బాల్యమిత్రులు" పేరిట
కలసిమెలసి ఉండటం
నా భాగ్యమే! 



కామెంట్‌లు