అంతరంగం (జీవితానుభవాలు - మిలిటరీ జీవితం)--కందర్ప మూర్తి , హైదరాబాద్
 ఉదయం నాలుగు గంటలకు మా సెక్షన్ ఇన్ చార్చి
 విజిల్ వేసాడంటే గబగబ మంచం మీద నుంచి లేవల్సిందే.
  లేకపోతే  హిందీలో తిట్ల దండకం అందుకుంటాడు.
          మంచం మీద నుంచి లేస్తూనే దోమతెర బ్లాంకెట్ పద్దతి
ప్రకారం ఫోల్డు చేసి దరీ పరిచి మగ్ పట్టుకుని లంగర్ దగ్గర పెద్ద పాత్రలో తయారుగా ఉంచిన చాయ్ అనే వేడి తియ్యని ద్రవ
పదార్థం తాగి కాలకృత్యాల కోసం లైను పెట్టాలి.
  సమయం తక్కువగా ఉన్నందున నోటిలో టూత్ పేస్టు వేసిన
బ్రష్ తో  బయలుదేరి వరుసలో నంబరు వచ్చి టాయిలెట్ డోర్
మూసామో లేదో వెంటనే' టక్ టక్ 'చప్పుడు మొదలవుతుంది.
ఒకపక్క టూత్ బ్రష్ చేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుంటారు.
కొంచెం ఆలశ్యమైతే భాయ్ లోపల నిద్రపోతున్నావా అంటూ
మళ్లీ తలుపు మీద చప్పుడు. ఎంత మలబద్దకం ఉన్న వారైనా
ఆ వాతావరణంలో ఏక్టివ్ అయిపోతారు. బయటకు వచ్చిన
వెంటనే గోడ మీద ఉంచిన టవలు అండర్ వేర్ పట్టుకుని
 స్నానాల గది దగ్గర లైను. వెంట వెంటనే టూత్ బ్రషింగు
 స్నానం చేసి బయట పడాలి.తడి బట్టలు ఆరవేయడానికి
 దూరంగా ఐరన్ వైరు కట్టిన చోట ఎండలో వేసుకోవాలి.
   సివిల్ జీవితంలో ఎంత సోమరిపోతైనా  ఆర్మీ యూనిఫామ్
వంటిమీద  ఉంటే చిరుతలా  తయారవుతారు.ఏ పని చెయ్యాలన్నా గ్రూపులుగా చేస్తూండటం వల్ల అలసట అనిపించదు. స్నేహభావం ఏర్పడుతుంది. కష్టమైనా ఆనందమైనా కలిసి పంచుకునే వాతావరణం ఉంటుంది.
 ఒకరి  కష్టసుఖాలు  మరొకరికి  చెప్పుకుని  మనశ్శాంతి పొందుతారు.
      టెక్నికల్ బ్రాంచ్ ఐనా జనరల్ డ్యూటీ బ్రాంచైనా బేసిక్
మిలిటరీ ట్రైనింగ్ లో అందరూ సమానమే.ముందు సోల్జర్
తర్వాత వారి డ్యూటీ విధులు.
   సివిల్ జీవితంలో విధ్యార్థి దశలో అల్లరి చిల్లరగా తిరిగే
 వివిధ మనస్తత్వాల యువకుల్ని సైనికులుగా తీర్చి దిద్దడంలో
బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ లో ఇన్ స్ట్రక్టర్ల భూమిక ఎంతో
 ఉంటుంది.
   ఉన్న ఊరికి  కుటుంబ సబ్యులకు  మిత్రులకు
దూరంగా హోమ్ సిక్ నెస్ తో బాధ పడే యువతను మందలిస్తూ
ఆదరిస్తు క్రమశిక్షణలో ఉంచాల్సి ఉంటుంది. రోజులు గడిచే
కొద్దీ వారు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడతారు. 
కఠినమైన ఇక్కడి డిసిప్లీన్ తట్టుకోలేక  వీలుచూసుకుని బయటకు పారిపోడానికి ప్రయత్నిస్తారు రిక్రూట్స్. కాని వారి
హైర్ కటింగ్ ప్రవర్తనతో రైల్వే స్టేషన్లు ,బస్టాండ్ లలో మిలిటరీ
 పోలీసులకు దొరికిపోయి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ కు వాపసు
వస్తారు. అటువంటి వారిని కౌంసిలింగ్ చేసి వారి మీద ప్రత్యేక
 దృష్టి ఉంచుతారు. ఒకవేళ వారి ఊళ్లకు చేరినా మిలిటరీ ఫిర్యాదు ననుసరించి లోకల్ పోలీసులు దగ్గరి మిలిటరీ 
 యూనిట్లకు అప్పగిస్తే వారు ట్రైనింగ్ సెంటర్ కి అప్పగిస్తారు.
    నాలాంటి హిందీ భాష మాట్లాడలేని దక్షిణాది తమిళ్ నాడు ,
 కేరళ , కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులం
 రోజు వారి దినచర్యలో హిందీ బాగా మాట్లాడ గలిగే స్థితికి
 వచ్చాము.
        (మరి కొన్ని  ట్రైనింగ్ సెంటర్  అనుభవాలు  తర్వాత)
       


కామెంట్‌లు