నా చిన్నతనంలో ఒకప్పటి మా రామాయంపేటలోని ఇంట్లో ప్రతీ సంవత్సరం జరిగే 'శ్రీరామనవమి కల్యాణ ఉత్సవం' అనుభూతులను నేనెప్పటికీ మరిచిపోలేను. ఏడాదిలోని అన్ని పండగలూ ఒక ఎత్తు అయితే ఒక్క 'శ్రీరామనవమి వేడుక' ఒక్కటీ మరో ఎత్తు. అప్పట్లో భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ ఘట్టాల వ్యాఖ్యానాలు, వర్ణనాత్మకంగా మంత్రాలతోసహా రేడియోలో ప్రసారం అవుతుంటే, అంతదూరం వెళ్లలేని పట్టణంలోని అనేకమంది భక్తులకు మా ఇంట్లోని 'కళ్యాణ కార్యక్రమం' ఒక అనిర్వచనీయమైన, అపురూపమైన తృప్తిని ఇచ్చేది. ఈ విషయం పదేళ్ళ వయసులో ఉన్న నాకు వారి ప్రవర్తన, ముఖాలలోని భక్తి శ్రద్ధలనుబట్టి అర్థమయ్యేది.
చతుషాల వరండాలు భక్తులతో నిండిపోయేవి. సన్నాయి, తబలా మేళం వారు వచ్చి కూర్చునేవారు. తూర్పు వరండాలో సగం ప్రదేశం కల్యాణ వేదికగా ఉండేది. ఉగాది నుంచి ప్రతీ రోజు జరిగిన నవరాత్రులు ఆ రోజు సీతారాముల కల్యాణంతో ముగిసేవి. జీలకర్ర బెల్లం ముహూర్తం వేళకు నాన్న రామచంద్రమూర్తి విగ్రహానికి, అమ్మ సీతమ్మ ప్రతిమకు బాజా బజంత్రీలు మోగుతుండగా పెట్టేవారు. పుస్తె మట్టెలు, భాసింగాలు కూడా ఉండేవి. మంగళాష్టకాల వేళకు నాన్నతోపాటు అందరూ లేచి నిలబడి పసుపు అక్షతలు చల్లేవారు. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగేది. బిక్కనూరు నుంచి మా మేనబావలు ముగ్గురు, మేన వదినలు ముగ్గురు వారి కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా వచ్చేవారు.
నాన్నతోపాటు బంధువులైన పురోహితులంతా కలిసి చదివే మంత్రపుష్పం ఆఖరులో హైలైట్ అయ్యేది. వారు రెండుగా విడిపోయి, చాలాసేపు దీర్గాలు తీస్తూ, పోటీలు పడుతున్నట్టుగా చదివేవారు. భక్తులంతా చాలా ఆసక్తిగా వినేవారు. ప్రసాదాల వరకు వచ్చేసరికి పగలు 3 గంటలయ్యేది. అమ్మ భక్తులందరికీ పిల్లలకు కూడా సరిపోయేలా మోదుగాకుల్లో వడపప్పు, పానకం, మొర్రిపండ్లు సిద్ధం చేసి ఉంచేది. మంగళహారతులు కూడా పోటీలు పడి చదివేవారు. ఇదంతా అయ్యాక, భక్తులందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాక, దేవుళ్ళకు మహా నైవేద్యం (వండిన అన్నం, కూరలు, పిండివంటలు, సిరా వంటివి) పెట్టేవారు. ఆ తర్వాత వరండాలన్నీ వస్త్రంతో (ఆ సమయంలో చీపురు వాడేవారు కాదు) శుభ్రపరిచి పంక్తి భోజనాలకు ఏర్పాట్లు జరిగేవి. కళ్యాణం చేసిన అమ్మా నాన్నలు ఆ రోజు అన్నం తినకుండా వండిన పిండి వంటలు మాత్రమే తినేవారు. ఆ వయసులో నాకు ఇదంతా పెద్ద చాదస్తంలా అనిపించినా ఇప్పుడు ఆ కార్యక్రమంలోని పవిత్రత తెలిసొచ్చింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి