ఆలోచన : -శ్రీసత్య గౌతమి



 భుజంగం, రాజారెడ్డి బియ్యం వ్యాపారస్తులు. భుజంగం మట్టి బెడ్డలూ, తెల్లరాళ్ళూ కలిపి ప్రజల్ని మోసం చేసేవాడు. రాజారెడ్డి బియ్యంలో నమ్మకాన్ని కలిపి మేలురకం బియాన్ని అందించేవాడు. భుజంగానికి ఇలా వ్యాపారం చెయ్యడం నచ్చేది కాదు. అతని దృష్టిలో రాజారెడ్డి వట్టి దద్దమ్మ, వ్యాపారం ఎలా చెయ్యాలో తెలియని వాడు. నమ్మి వచ్చిన కస్టమర్ ని మోసం చెయ్యడం వ్యాపారంలో ఒక భాగం అని గట్టిగా నమ్ముతుండేవాడు భుజంగం. 

ఇద్దరి ఆలోచనలు ఎంత తేడా?

భుజంగం ఇతర వ్యాపారుల గొడౌన్లను కొల్లగొట్టించి సహాయం చేస్తున్నట్లుగా వారికి అధిక ధరలకు తన బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొనేవాడు. మధ్యరకం ప్రజల నాడిని పట్టి, ధరలు తగ్గించి చౌకరకం బియ్యాన్ని ప్రజలకు అంటగట్టడం మొదలెట్టాడు. చౌకరకమైనా తక్కువ డబ్బులకొస్తుందనీ భుజంగం షాపుకు వెళ్ళడం మొదలెట్టారు. 

కస్టమర్లను దేవుళ్ళుగా చూసే రాజారెడ్డి వ్యాపారం క్రమంగా దెబ్బతిన్నది. షాపును వేలం వేస్తున్న సమాయానికి పాత కస్టమర్లు మనసు ద్రవించి మా తండ్రుల కాలం నుండీ, వారి చేతులు పట్టుకొని ఈ షాపుకు వచ్చేవాళ్లం, ఇది మా బాల్యాన్ని గుర్తుకు తెచ్చే చిహ్నం అంటూ వందల్లో వేలల్లో సహాయం అందించడం మొదలెట్టారు. నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసిన రాజారెడ్డి షాపు మళ్ళీ పునరుద్దరింపబడింది. 

ఇతరుల గొడౌన్లను కొల్లగొట్టించి ప్రోగేసుకున్న నల్లధనంపై ఇన్ కం టాక్స్ రైడ్ జరిగి, అసలు విషయం కూడా బయటపడి భుజంగాన్ని పోలీసులు పట్టుకెళ్ళారు. 

(సమాప్తం)


కామెంట్‌లు